– మూడో రోజూ కొనసాగిన వాగ్వాదాలు
– మూసీ అంచనాలపై కేటీఆర్ ప్రశ్నల వర్షం
– ఎదురుదాడి చేసిన మంత్రులు
– సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
(మండువ రవీందర్రావు)
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడు రోజులుగా చాలా వాడిగావేడిగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షాల మధ్య తగ్గేదేలేదన్నట్లుగా వాగ్వాదాలు కొనసాగుతున్నాయి. గడచిన రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు, మరో రెండున్నర ఏండ్లు కొనసాగే పాలనకు ఈ సమావేశాలు గీటురాయి కావాలనుకుంటోంది. కాగా, కాంగ్రెస్‌ను ఫెయిల్యూర్ ప్రభుత్వంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజలముందు నిలబెట్టాలని బిఆర్ఎస్, బిజెపిలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. పార్టీ ఫిరాయింపు, నిధుల కేటాయింపు, ఐటి పెట్టుబడులు, పరిశ్రమల నెలకొల్పే విషయంలో, రైతు అప్పుల మాఫీ, రైతు భరోసా లాంటివి ఈ చర్చల్లో ప్రధానాంశాలుగా కొనసాగుతున్నాయి. వీటన్నిటినీ మించి మూసీ ప్రక్షాళన మీద తీవ్ర స్థాయిలో వివాదం కొనసాగుతున్నది. వివాదం తారస్థాయికి చేరుకోవడంతో ఒకదశలో బిఆర్ఎస్ సభ్యులు సభనుండి వాకౌట్ చేశారు. మూసీ మురికి కారణం మీరంటే మీరని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. దీని ప్రక్షాళనకు గతంలోనే తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని బిఆర్ఎస్ గుర్తు చేస్తుండగా, పదేళ్ళపాటు పట్టించుకోని ఈ ప్రాజెక్టును విజయవంతంగా తీర్చిదిద్దుతామంటోంది కాంగ్రెస్. అయితే ప్రక్షాళన పేరున మూసీనది పొడవున విద్వంసానికి శ్రీకారం చుడుతున్నదని కాంగ్రెస్ విధానంపైన బిఆర్ఎస్ ద్వజమెత్తడంతో గత మూడు రోజుల చర్చల్లో ఇదే ప్రధానాంశంగా మారింది. మూసీ మురికి నీటిని శుభ్రపర్చి పర్యావరణాన్ని కాపాడేందుకు, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కలిగించడమే తమ ముఖ్య ఉద్దేశ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదానిలో వాస్తవంలేదని, దీనివెనుక అవినీతి, అక్రమాలు చోటుచేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయన్నది బిఆర్ఎస్ వాదన. మూసీ ప్రక్షాళనకు తాము ఎట్టిపరిస్థితిలో వ్యతిరేకం కాదని, ఆ పేరున ప్రభుత్వం భూసేకరణ చేస్తున్న విధానం పలు అనుమానాలకు తావిస్తున్నదని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటి రామారావు అసెంబ్లీ సాక్షిగా తీవ్రంగా స్పందించారు. 3,260 ఎకరాల భూమి సేకరణను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నదన్నారు. నదికి బఫర్‌జోన్ 50 మీటర్లు అని ప్రకటించిన ప్రభుత్వం, అయిదు కిలోమీటర్ల దూరంలోఉన్న ఇండ్లవారికి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ దగ్గర దీనికి సంబందించిన డిపిఆర్ లేదని, అందుకు కనీసం 18 నెలల కాలం పడుతుందని చెప్పిన ప్రభుత్వం కేవలం రెండు నెలల్లోనే డిపిఆర్ సిద్దమైందని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. మూసీ ప్రక్షాళన పదహారు వేల కోట్ల రూపాయలతో పూర్తి కానుండగా ప్రభుత్వం మాత్రం లక్షన్నర కోట్ల రూపాయలకు అంచనాలు వేయడంపట్ల ఆయన విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అంతేగాక బఫర్జోన్లపేర పేదలు నిర్మించుకున్న ఇండ్ల కూల్చివేత లెక్కల విషయంలోకూడా ప్రభుత్వంవద్ద స్పష్టతలేదన్నది ఆయన ఆరోపణ. కూల్చిన ఇండ్లకన్నా ప్రభుత్వం చెబుతున్న లెక్క చాలా తక్కువగా ఉందంటారాయన. అన్నిటికీమించి ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏషియన్ డెవలెప్మెంట్ బ్యాంకు రుణం ఇవ్వడానికి సిద్దంగా ఉందన్న విషయాన్ని ఆ బ్యాంకు అధికారులు కొట్టివేస్తున్న క్రమంలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నది కెటిఆర్ డిమాండ్. కాగా, బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవంలేదని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డిఅనుసూయ అలియాస్ సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కెటిఆర్ చేస్తున్న ఆరోపణలను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే మూసీ ప్రక్షాళనను అడ్డుకునేందుకు బిఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని వారు ఆరోపించారు. ప్రజల జీవన విధానాన్ని మెరుగు పర్చాలన్న తమ ఉద్దేశ్యాన్ని బిఆర్ఎస్ వ్యతిరేకించడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





