- యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ టూ సిద్ధిపేట
- జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనులు, ఊపందుకున్న వరి నాట్లు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 6 : పొట్టకూటి కోసం వందల మైళ్ల దూరాన్ని దాటి వస్తున్నారు ఎందరో కూలీలు. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూలీలు వలస వొస్తున్నారు. సిద్ధిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వందలాది సంఖ్యలో వలస కూలీలు దర్శనమిస్తున్నారు. చెరువులు, కుంటలు, వ్యవసాయ బావుల నిండా దండిగా నీరు ఉండటంతో తమ పొలాల్లో వరి నాటు వేసేందుకు రైతులు ఈ వలస కూలీలపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. స్థానికంగా కూలీల కొరత ఉండటంతో రైతులు బయటి రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. దీంతో వరి నాట్లు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో వరి నాట్ల కోసం యూపీ నుంచి ఉపాధి కోసం కూలీలు వొచ్చారు. దినసరి కూలీ ఒప్పందం ప్రకారం గుత్తాలకు తీసుకుని నాట్లు వేస్తున్నారు. ఉపాధికై ఉత్తరప్రదేశ్-యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణ బాట పట్టారు. సిద్ధిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో ఇప్పటికే యూపీ కూలీలు వరి నాట్లను ప్రారంభించారు.
యూపీ నుంచి వొచ్చిన కూలీలు 15 నుండి 16 మందితో ఒక బ్యాచ్‌గా ఏర్పడ్డారు. యజమాని దగ్గర ఎకరాకు 5000 నుంచి 5500 వరకు గుత్త ఒప్పందం మాట్లాడుకుంటారు. ఇందులోనే నారు తీసి నాట్లు వేయాల్సి ఉంటుంది. ఇదే మన ప్రాంత కూలీలు అయితే 6500 నుండి 7000 వరకు అవుతుందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. యూపీ నుంచి వొచ్చిన కూలీలు ఒక్కరోజులో 16 మంది బ్యాచ్ సుమారు నాలుగు నుండి ఐదు ఎకరాలు వరకూ అందులోనూ పాత పద్ధతిలో జపాన్ పద్ధతిన నాట్లు వేస్తారు. మన కూలీలతో అయితే నాలుగు నుంచి ఐదు ఎకరాలు నాటు వేయడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుందని రైతులు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్ నుంచి వొచ్చిన కూలీలతో డబ్బులే కాకుండా సమయం కూడా ఆదా కావడంతో రైతులు ఆ కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు సిద్ధిపేట, గజ్వేల్ ప్రాంతంలో అనేక గ్రామాలలో కూలీలు దొరకక ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ రైతులకు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. యూపీ కూలీలకు ఉపాధి దొరకడంతో పాటు రైతులకు కూడా అనేక రకాలుగా కలిసివస్తున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్ జిల్లా(మేనకాగాంధీ ప్రాతినిధ్యం వహించిన) నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు సిద్ధిపేట జిల్లాలోని సిద్ధిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గ పరిధి మండలాల్లోని ఎన్నో గ్రామాలలో మొత్తం 230 మంది బ్యాచ్‌లుగా ఏర్పడి కూలీ చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నామని యూపీకి చెందిన కూలీ రామ్ తివారీ చెప్పారు.




