ప్రకృతి నుండి ఆశించాలే తప్ప దానిని శాసించ కూడదనేది అక్షర సత్యం. న్యూటన్ శాస్త్రవేత్త చెప్పిన చర్యకి ప్రతిచర్య ఉంటుందనే సూత్రం పర్యావరణంకి కూడా వర్తిస్తుందేమో అన్న సందేహం నిన్నటి ఉత్తర భారత రాష్ట్రాలలో చూస్తున్న భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల విలయాన్ని చూసాకా కలుగక మానదు.
విపత్తులు రావడానికి మానవుడు ఆవరణానికి చేస్తున్న ద్రోహమే అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు .
ఈ నెల 9 వ తేదీ నుండి హిమాచలప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగి పొర్లుతున్నాయి. వరదలతో పాటుగా అక్కడక్కడ కొండచరియలు విరిగిపడడం వలన ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి.
ఈ రాష్ట్రాలలో భారీ వర్షానికి కారణం ఋతుపవనాలు మరియు వీటికి తోడైన పశ్చిమ దిశ గాలులని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ గాలులనేవి మధ్యధరా సముద్రంలో ఉద్భవించి మధ్య ఆసియా తూర్పు ప్రాంతం వైపు కదిలే అల్పపీడనం .దీని కారణాన ఉత్తర భారతదేశ వాతావరణములో మార్పులు వస్తాయి.
జూలైలో దేశం మొత్తం మీద కంటే 30 శాతం ఎక్కువ మరియు వాయువ్యంలో సాధారణం కంటే 52 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. హిమాచలప్రదేశ్ లో సాధారణ వర్షపాతం 8 మిల్లీ మీటర్లు, కానీ ఈ ఆదివారం 103.4 మిల్లీ మీటర్లు వర్షం పడింది. అదే రోజు రాత్రి యెనిమిదిన్నర వరకు 36 గంటల వ్యవధిలో ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో 260 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది.జూలై నెల మొత్తం 195.8 మిల్లీ మీటర్ల వర్షం కురియాల్సి ఉండగా రోజున్నర లోనే 30 శాతం ఎక్కువ నమోదయ్యింది . 40 యేళ్ళలో జూలై నెలలో ఒకే రోజు అత్యధిక వర్షం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. 1958 తరువాత జూలై నెలలో ఇలా జరగడం ఇది మూడోసారి.హిమాచలప్రదేశ్ లో ఈ సారి సగటు వర్షపాతం కంటే 10 రెట్లు ఎక్కువ కురిసింది. గత యాభై ఏళ్లలో తమ రాష్ట్రం ఇంత భారీ వర్షాలు చూడలేదని సాక్షాత్తు హిమాచలప్రదేశ్ రాష్ట్ర మఖ్యమంత్రి చెప్పడం అక్కడి ఘోర పరిస్థితికి నిలువుటద్దం.
ఈ రాష్ట్రంలో చాలా వంతెనలు తెగిపడ్డాయి. కార్లు, జీపులు,లారీలు వరదలో కొట్టుకుపోయాయి. హిమాచలప్రదేశ్ లో భుంతర్ వ్యాలీ వంతెన బియాస్ నది వరద ధాటికి కొట్టుకుపోయింది. యెన్నో భవనాలు నేలమట్టమయ్యాయి.జల విద్యుత్ కేంద్రాలు మూతపడ్డ కారణంగా కొన్ని గ్రామాలు చీకట్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
చాలా గ్రామాల ప్రజలకు తాగు నీరు లేదు. ఆహారం లేదు. అత్యవసర రోగులకు వైద్య సదుపాయం లేదు.
పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి , వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది.
ఉత్తరాఖండ్‌లోని జుమ్మగడ్ నదిపై వంతెన కూలిపోవడం వలన చాలా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గులార్ వద్ద కొండచరియలు విరిగి పడి గంగానదిలో జీపు పడి అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు చనిపోయారు. పోంచ్ లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఆర్మీ జవానులు ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయారు. ఎంతో మంది వరదల్లో చిక్కుకున్నారు.
జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగపడటంతో ఎంతో మంది అమర్నాథ్ యాత్రికులు మార్గమధ్యంలో చిక్కుకున్నారు..
ఢిల్లీ లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
యమునా, బియాస్ నదులుతో చాలా నదులు పొంగిపొర్లుతున్నాయి.ప్రభుత్వ ఉద్యోగులు వీధుల నుండి నీటిని పారద్రోలేందుకు అనేక ప్రాంతాలలో పంపులను ఉపయోగించారు, నివాసితులు మోకాళ్లలోతు నీటిలో కొట్టుమిట్టాడుతున్నారు.కొన్ని ప్రాంతాలలో పాఠశాలలకు సెలవులిచ్చారు.
మన దేశంలోవరదకు గురయ్యే ప్రాంతాలు
మన దేశ భూ భాగంలో సుమారు 30 శాతం వరదలకు గురవుతుంది. దేశంలో వరద ముప్పున్న 50 మిలియన్ హెక్టార్ల భూమిలో 24.9 శాతం ఉత్తర ప్రదేశ్, 15 శాతం బీహార్ రాష్ట్రాల్లోనే ఉంది . గంగా, బ్రహ్మపుత్ర, సింధు, ద్వీపకల్ప నదీ పరివాహక ప్రాంతాలలో ఎక్కువ వరదలు వస్తాయి . ఈ వరదల వలన ప్రతీ ఏటా సుమారు 1464 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు 86,288 పశువులు మరణిస్తున్నాయి.
ఈ వరదలు రావడానికి కారణం
వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన, పట్టణీకరణలో భాగంగా లోతట్టు పంటభూములను నివాస స్థలాలుగా మార్చడం, మైనింగ్ మొదలగు మానవ కార్యకలాపాలు ముఖ్య భూమికను పోషిస్తాయి.. ఇంకా రోడ్లు, కరకట్టలు, రైల్వే మార్గాలు, కాలువలు మొదలైనవి నదుల స్వేచ్ఛా ప్రవాహాన్ని అడ్డుకోవడం వరదలకు కారణమవుతున్నాయి.
పరిష్కారాలు :
పర్యావరణ కాలుష్యము లేకుండా చూసుకోవాలి . అడవులను కాపాడుకోవాలి. పట్టణాల్లో వర్షం నీరు సాఫీగా పోయేటట్లు ప్రణాళికలు రూపొందించాలి. ముందస్తు ప్రణాళికలను సిధ్ధం చేసుకోవాలి. పర్యావరణానికి హాని కలిగించరాదు .
– డి జె మోహన రావు
యం. ఎస్సీ ( ఫిజిక్స్)
టీచర్
ఆంధ్రప్రదేశ్
9440485824




