ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 14 : కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా బుధవారం జైపూర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ స్థానానికి ఎన్నిక జరుగుతున్నది. ఇప్పుడు ఆ స్థానం నుంచి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లనున్నారు. అందుకు ఆమె బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్, ప్రియాంకా పాల్గొన్నారు. రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు గెలిచే అవకాశం ఉంది. ఈ ఎన్నిక ఈ నెల 27న జరుగనుంది.
ఇందిరా గాంధీ తర్వాత గాంధీ కుటుంబం నుంచి పెద్దల సభకు ఎన్నికయ్యే రెండో నేతగా సోనియా గాంధీ నిలువనున్నారు. కాగా ప్రస్తుతం రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ 1999 నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాల పాటు వరుసగా లోక్‌సభ సభ్యురాలిగా వ్యవహరించారు. పార్టీ క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు పగ్గాలు చేపట్టిన ఆమె 2004, 2009లో రెండు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆమె ఎప్పుడూ హుందాగా వ్యవహరించారు.





