శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్27: టిఆర్ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుండి కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్లు దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రచారంలో భాగంగా శేరీలింగంపల్లి కొండాపూర్ ఆర్టిఏ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నుండి విద్యావంతుడైన జగదీశ్వర్ గౌడ్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సీఎం కేసీఆర్ లక్ష కోట్లు దోచుకోవడమే కాకుండా పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నారన్నారు. ల్యాండ్స్ మైండ్స్ సాండ్స్ వైన్స్ అంతా కేసీఆర్ చేతుల్లోనే ఉందన్నారు. అవన్నీ ఎట్లా రాబట్టాలో తెలుసన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు కావాలన్నారు. నిరుద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రాజెక్టుల పేరిట వేల కోట్లు వేలాది ఎకరాలు దోసుకున్నారన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికలను కాంగ్రెస్ పార్టీని గెలిపించి బిఆర్ఎస్ నుబొంద పెట్టాలని అన్నారు. బిఆర్ఎస్ పాలన అంటే దొరల దోపిడీ కమిషన్లు ఇసుక దొంగల రాజ్యం అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి అన్నారు. ప్రత్యేక తెలంగాణలో మోసపోయిన నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రఘునాథరెడ్డి, రఘునాథ్ యాదవ్, జరిపేటి జైపాల్, మైనార్టీ నేతలు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
లక్ష కోట్లు దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం శేరిలింగంపల్లి బహిరంగ సభలో టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి



