తెలుగు సాహిత్య ప్రపంచంలో మినీ కవిత్వానికి ఫ్రత్యేకమైన స్థానం ఉంది. మినీ కవితలు సర్వత్రా విస్తరించాయి. హైకులు, రెక్కలు, టుమ్రీలు వంటి రూపాల్లో కవిత్వం వెలుగు చూసింది. నిజమైన కవిత్వం సామాజిక అవసరాల నుండే వచ్చిందని భావిస్తే ఆ కోణంలో మినీ కవితకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రాపంచిక దృష్టిలో సమాజాన్ని అర్థం చేసుకొని గొప్ప మినీ కవిత్వాన్ని అందించిన కవులెందరో ఉన్నారు. గతంలో కన్నీటి సీమ, నాకొక మనిషి కావాలి వంటి కవితా సంపుటులు, మనసు పాట వంటి గేయాలను అందించిన సాహితీవేత్త, కవి డాక్టర్ ఎన్ ఈశ్వర్రెడ్డి ఇటీవల వెలువరించారు. నాలో నువ్వు పేరుతో మినీ కవితాసంపుటిని ప్రచురించారు. ముఖీలతో కూడుకున్న మినీ కవితల సంరంభంగా ఈ సంపుటి కనిపిస్తుంది. 178 పుటల్లో ఉన్న నాలో నువ్వు సంపుటిలో ముఖీలుగా సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తూ ఈశ్వర్రెడ్డి అందించిన మినీ కవితలు ఆలోచింపజేస్తాయి. వాస్తవాలను ప్రతిబింబింపజేసే మినీ కవితలు ఎన్నో ఇందులో ఉన్నాయి. సమాజంపై స్పష్టతను కలిగి గుండె ధైర్యం, నిస్వార్థంతో, తన మార్గమేమిటో తెలుసుకొని రాసిన ముఖీలు ఇందులో ఉన్నాయి. 2017 నుండి 2021 వరకు రాజకీయం, ప్రజాస్వామ్యం, ఓటు, సామాజికత, ఆర్థికం, మతం, నీతి బోధ, కుటుంబం, విద్య వంటి అంశాలపై రాసిన మినీ కవితలు ఈ పుస్తకంలో ఉన్నాయి. కఠినమైన సత్యాలను ఈ కవితలు చెప్పాయి. నిస్వార్థం, స్పష్టత, తేట పరిచే తెగువ వంటివి ఈ సంపుటిలోని కవితల్లో కనిపిస్తాయి.
మనసు గొంతులో ధ్వనించే ఆందోళన ప్రతి అక్షరంలో ఆలోచనై కూర్చుంటుందని స్పష్ట పరిచారు. నిరంతరం రగిలే ఆవేశంలో నరనరాన ప్రవహించే ఆవేదన ఉందని అన్నారు. నాయకుల నోట్లాటలో ఓటర్లు సెల్ఫ్ – అవుట్ అని అలాంటప్పుడు దేశాభివృద్ధి ప్రశ్నార్థకం కాకుండా ఎలా ఉంటుందని వాపోయారు. నాయకులంతా చక్రవర్తులుగా, ప్రజలంతా సేవకులుగా ఓట్ల పండుగ అయిపోగానే మారిపోతారని చెప్పారు. రాజకీయ వర్తకులు ఎన్నికల సంతలో ఓటర్లను కొనుగోలు చేసి ఆ తరువాత వ్యవస్థ అమ్మకానికి అలవాటు పడతారని చురకలంటించారు. దోపిడీని ప్రశ్నిస్తే కత్తుల భాష, తన్నుల భాష తప్పదని చెప్పారు. డబ్బులు చల్లి ఓట్లు ఏరుకున్నంత కాలం మంచి నాయకత్వం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఎలక్షన్ హామీలు చౌడు భూముల్లో చల్లిన విత్తనాలేనని ఎంతో స్పష్టంగా చెప్పారు. ఓటును అమ్ముకునే వారు ప్రశ్నించే గొంతుక కోల్పోతారని అన్నారు. మనుషులంటే ఓట్లని అనుకున్నంత కాలం వ్యవస్థ మారదని చెప్పారు. ప్రజల్ని ప్రలోభాలకు లోను కాకుండా ఓట్లేస్తారా అని ఇలా సూటిగా ప్రశ్నిస్తారు.
తీర్పు చెప్పే అధికారం/ మార్పు తెచ్చే అవకాశం
ఎన్నికలు ఇస్తాయి/ సక్రమంగా ఓట్లేస్తారా ?
ఎన్నికల ముందు హామీల వర్షాలు కురవడం, ఎన్నికలయ్యాక గతం వర్తమానం అవ్వడం సహజమేనని చెప్పారు. అమ్మకాలు, కొనుగోళ్ల వ్యవస్థగా మారిన రాజకీయాలలో గౌరవానికి సంబంధించిన గొప్ప అంశమే వ్యక్తిత్వమని అన్నారు.
ప్రశ్నించే వారిని లేకుండా చేస్తే ప్రశ్నలు చావకుండా ఇంకా పదునెక్కుతాయని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రెక్కల కష్టానికి విలువ లేకుండా పోయిందని చెప్పిన ఈ మినీ కవిత ఎంతగానో ఆలోచింపజేస్తుంది.
ఉపాధి, ఉత్పత్తి స్థానంలో / విలాసాలు, కులాసాలు
వచ్చి కూర్చుంటున్నాయి!/ రెక్కల కష్టానికి/
విలువను సున్నా చేస్తున్నాయి!
వ్యవస్థను పీడిరచే వాళ్ళు రాజుల్లా, ప్రశ్నించే వాళ్ళు నేరస్తులుగా ప్రజాస్వామ్యంలో మిగిలిపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. సర్వమానవ స్వేచ్ఛనే ప్రజాస్వామ్యానికి ఊపిరి అని చెప్పారు. సమస్యలను ఎదిరించి నిలబడే వాడే గెలిచే మనిషి అని చెప్పిన ఈ కవిత ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.
ఎదురయ్యే కష్టాలన్నీ/ జీవితోన్నతికి అర్హత పరీక్షలే
ఎదిరించి నిలబడితే/ విజయాలు/ నీకాళ్ళ కింద చెప్పులే!
బుద్ధి బలంతో ఒప్పించలేని వాడు కుతంత్రాన్ని ఆయుధంగా మలచుకుంటే చేతలతో గెలవలేని వారు చెడును రక్షణ కవచంగా ధరిస్తారని చెప్పారు. ముడుచుకుపోయిన మనస్సు రెక్కలను తిరిగి సవరించుకోవడమే పండగ అని తెలిపారు. పోరాడే వాడికి గెలుపు ప్రాధాన్యత ఏంటో తెలుస్తుందని చెప్పిన ఈ కవిత ఎంతగానో ఆలోచనాత్మకమైంది.
పోరాటమే జీవితం/ జీవిత బరిలో నిలిస్తేనే
విజయం/ వెన్ను చూపావో/ తథ్యం మరణం
నదిలో ప్రవహించే నీరు ఆవిరి రెక్కలతో మబ్బుల రథాలెక్కి తిరిగి వర్షమై ఎగిరొస్తుందని అన్నారు. అజ్ఞానంతో అడుగేస్తే కాలం కోరల్లో నలిగిపోక తప్పదని హెచ్చరించారు. చేతల్లో నీతి, ఆర్తుల పట్ల జాలి నీలో ఉంటే నువ్వే ఒక భగవంతుడివి అని చెప్పారు. దుఃఖమే నరకం, ఆనందమే స్వర్గం అన్నారు. చిన్న సమస్యలను బూతద్దంలో చూస్తే కొండంత బరువుతో మనసుపై కూర్చుంటాయని చెప్పారు. కష్టాన్ని కడుపులో దాచుకొని ప్రాణికోటికి నిత్యం పాలిచ్చే బాలింత కదా ధరణి అన్నారు. ప్రశ్న, అవసరాలను వివరించిన ఈ కవిత ఆలోచింపజేస్తుంది.
ప్రశ్న/ ప్రగతికి/ పునాది!/ అవసరం/ సృజనకు మాతృక!
జీవితాన్ని నిలబెట్టలేని చదువు, సమాజానికి ఉపయోగపడని శాస్త్రం వృథా అని చెప్పారు. రోజూ చేసే పనిని నిన్నటి కంటే నాణ్యతతో చేయాలని అన్నారు. అంతుచిక్కని అఘాధ శాస్త్రం సముద్రమని చెప్పారు. మంచి, చెడు కర్మలు స్వానుభవంలో తేలే అంశాలని అన్నారు. అక్షరాలు రెక్కలు తొడిగితే రంగురంగుల భావచైతన్య పక్షులు జన సముద్రంపై విహరిస్తాయని అన్నారు. మనిషి కాలంతో పాటు మారకపోతే కాలం చెల్లిన పురావస్తువులా మిగిలిపోతాడని చెప్పారు. నిరంతర జీవిత సంగ్రామంలో పోరాటాన్ని విరమిస్తే గెలుపు బాట సమాప్తమవుతుందని అన్నారు. విజ్ఞత లేని ఆవేశం శత్రువులను పెంచే సాధనమవుతుందని చెప్పారు. అహం వీడితే అంతా స్వర్గమేనని ఈ కవిత స్పష్టం చేసింది.
టపాసులు పేల్చితే/ దీపావళి/ అహాలను కూల్చితే/ స్నేహావళి
మాయ మనసు చేసే చిత్రాలు బహు విచిత్రమని అన్నారు. ప్రతిక్షణాన్ని ఉపయోగించుకుంటేనే ఉన్నత స్థానం అందుతుందని చెప్పారు. అనంతంలో మనమెంతని అనుభవం నేర్పిన పాఠం చెప్పిందని తెలిపారు. అదృశ్య హస్తమే వికారి కరోనా అని ఆగ్రహించారు. పదునెక్కని మెదడు పాడుపడిన ఇంటితో సమానమని చెప్పారు. సర్వం నేనే అని విర్రవీగుతుంటే సమూలన పతనం కాళ్ళ కిందే మొదలవుతుందని అన్నారు. శ్రామికులే నాగరికత నిర్మాణానికి కర్త కర్మ క్రియలని చెప్పారు. శరీరం, ధనం అస్థిరమైనవని చెప్పేవాడు వాటిని నమ్మకపోవడమే విషాదమని తెలిపారు. జబ్బు కన్న భయం పెద్దదని తేల్చారు. ధైర్యాన్ని మించిన స్నేహితుడు లేడని చెప్పారు. అపోహల భయాన్ని పడగొట్టేది శాస్త్రమని అన్నారు. నేటి బాలికలే రేపటి ధరిత్రికి అమ్మలని చెప్పారు. శ్రమ గొప్పతనాన్ని ఈ కవిత పట్టిచూపింది.
మట్టి దేహాలను/ మహా పని ముట్లుగా/ మార్చుకొన్నాకే/ నాగరికతా సౌధాలు/ తలెత్తి నిలబడ్డాయి
అసూయ ముదిరితే మనసు పడవను అర్థాంతరంగా ముంచేస్తుందని చెప్పారు. ప్రకృతి నేర్పే పాఠాన్ని గ్రహిస్తూ విశ్వం నడవాలి అన్నారు. పల్లె, పట్నాలలో మానవ సంబంధాలు అపరిచిత ముఖాలౌతున్నాయని వేదన చెందారు. మంచిని మెచ్చని వాడికి చెడును ప్రశ్నించే నైతిక హక్కు ఎక్కడిదని అన్నారు. జనంతో వచ్చే వాడు రాజకీయ నాయకుడు, జనం కోసం వచ్చేవాడు రాజనీతిజ్ఞుడు అని చెప్పారు. బలవంతుని వాక్కు తీర్పుగా చలామణి అయినప్పుడు సామాన్యుని బాధ ఎవరికీ వినిపించదు అన్నారు. షోత్కర్ష, పరనింద రాజకీయ రైళుకు రెండు పట్టాలని చెప్పారు. సంపాదించే వాడు పొలిటీషియన్, ఇచ్చేవాడు లీడర్, బతుకుల్ని మార్చేవాడు స్టేట్స్ మెన్ అన్నారు. మనుషులను కలిపే ప్రతి సంప్రదాయం మహోన్నతమైనదేనని చెప్పారు. పల్లె లేకుంటే పట్నం లేదని అన్నారు. అంతర్జాల వలలో మనమే చేపల్లా చిక్కుపడ్డామని తెలిపారు. ఓర్పు, సహనం, ఎదిగేందుకు తోడ్పడే మెట్లని చెప్పారు. జీవన సత్యాన్ని విడమర్చి చెప్పింది ఈ కవిత.
నేర్చుకునే వాడికి/ ప్రతిరోజూ ఒక కొత్త పాఠమే
తెలుసుకునేవాడికి/ ప్రతి వ్యక్తీ/ ఒక గొప్ప పుస్తకమే!
స్పర్థలతో వినాశనం ఒద్దన్నారు. ఇతరులపై నిందలను నడిచే గురివిందలతో పోల్చారు. యాంత్రిక జీవితానికి బానిసలైన వారే అసలైన అజ్ఞానులని అన్నారు. కార్యసాధకులు ఒప్పిస్తారని, కార్యబాధితులు నొప్పిస్తారని చెప్పారు. ఆదర్శాలను పంచుకోవడమే అసలైన వారసత్వమని తెలిపారు. మాత్రతో పోయేదాన్ని మరణం దాకా తెచ్చుకోవద్దని అన్నారు. పురస్కారాలు బాధ్యతలను గుర్తు చేసే బంగారు చిలుకలని చెప్పారు. అంతరాత్మను మించిన హితుడు లేడని అన్నారు. పుస్తకాన్ని పట్టుకుంటే ప్రపంచాన్ని దాటవచ్చని చెప్పారు. నీటిని మించిన జీవరసం, మట్టిని మించిన సుగంధం, ఆత్మను మించిన సాక్ష్యం, శ్రమను మించిన దైవం లేదని తెలిపారు. శ్రమించకుండా వచ్చే ఫలితాలు ఎప్పటికీ నిరర్ధకమేనని అన్నారు. ఆన్లైన్ పాఠాలు, వెబినార్ సదస్సులకు కారణమైన కరోనా నీకొక నమస్కారం అని చెప్పారు. మూడు కొమ్ములున్న గురువుకు తిమిర మహిషంతో పోరాటం జరిగిందని అన్నారు. ప్రపంచ సముద్రాన్ని దాటాలంటే జ్ఞాన రెక్కలు అవశ్యమని తెలిపారు. మనస్సు విప్పి మాట్లాడుకుంటే సంబంధాలు, కష్ట సుఖాలను పంచుకుంటే అనుబంధాలు నిలబడతాయని చెప్పారు. కరోనా కరచాలనాన్ని కాటేసిందని అన్నారు. బాధలను, కన్నీళ్ళను చిరునవ్వుతో జయించడానికి పనికొచ్చే చేతనాయుధమే కవిత్వమని నిర్వచించారు. రోడ్ల నాలుకలు రక్తదాహంతో ఎదురుచూస్తుంటే మైకం – వేగం రెండూ ప్రమాదమేనని అన్నారు. చీకటి వెలుగుల మిశ్రమం జీవితమని చెప్పారు. పంటలు ఇంకి ఫ్లాట్లు మొలుస్తున్నాయని నగరీకరణ విపరీతాన్ని తెలిపారు. క్రీడా భూమిలో బంగారాన్ని పండిస్తున్న నారీమణులకు జైజైలు పలికారు. దృష్టిని బట్టి మంచి చెడూ ఉంటాయని అన్నారు. మబ్బులు వెక్కిరించాయని పంటను వాయిదా వేయడం, అప్పును చెల్లించలేక ప్రాణాలను వదలడం సరైంది కాదని చెప్పారు. ప్రజల్నినమ్మించే మాధ్యమాల మంత్రగత్తెలు పొంచి ఉన్నాయి జాగ్రత్త అని హెచ్చరించారు. అభిప్రాయాలు మార్చుకోకపోతే మనిషి పొలిటీషియన్ కాలేడని చెప్పారు. ప్రాణధారలు పోసిపొమ్మని వానమ్మకు వందనం చేశారు. సరిహద్దుల కంచెలు దాటి వచ్చిన గుదిబండ కరోనా అని చెప్పారు. లాక్డౌన్ వలలో చిక్కిన పక్షి గూటికి చేరే దారి లేక రోదిస్తుందని చెప్పారు. మట్టి దేహాలతో రాజధాని ఆలింగనం చేసుకుంది అంటూ వక్రచట్టాలపై విజయం సాధించి ఎర్రకోటపై ఎగిరిన రైతు పతాకాన్ని గురించి చెప్పారు. మనసు రంగులకు వెన్నెల పూలు, సూర్య రేఖలను కలిపి కవితామృతం చేసిన సిరివెన్నెల గానం గగనతలం చేరిపోయిందని నివాళులు అర్పించారు. అన్నీ పోగొట్టుకున్న సీమ జనాన్నిఆదుకోవాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. రక్షణ చట్టాలు ఎన్నున్నా సగటు మనుషులకు బలి చట్రాలు మాత్రం తప్పడం లేదని వేదన చెందారు. ఈ మినీ కవితలలోని లోతును గమనిస్తే సామాజిక వర్తమాన దృశ్యంలో మనిషి స్థానాన్ని ఎంతో స్పష్టంగా అంచనా వేయొచ్చు.
-డా.తిరునగరి శ్రీనివాస్
8466053933





