ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : రాష్ట్రంలో త్వరలో రానున్న ఎన్నికల్లో క్రైస్తవులు(బిసి-సి)లకు అన్ని రాజకీయ పార్టీలు 30 శాతం సీట్లు కేటాయించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని నియోజకవర్గాల్లో క్రైస్తవ అభ్యర్థులను పోటీలో నిలుపుతామన్నారు. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎంతో కాలం నుంచి ఎమ్మెల్యే సీట్ల కోసం ఎదురుచూస్తున్న దళిత క్రైస్తవులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. క్రైస్తవులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తేనే రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తారని అన్నారు. బిఆర్ఎస్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో దళిత క్రైస్తవులు లేకపోవడం అన్యాయం అన్నారు. ఈ సమావేశంలో నాగళ్ళ పోచయ్య, ఇశ్రాయేలు, జాన్సన్, మోజెస్, డానియల్ తదితరులు పాల్గొన్నారు.




