రిటైర్డ్ ‌బొగ్గు ఉద్యోగులకు పెన్షన్‌ ‌పెంచండి

ఉద్యోగంలో ఉన్నప్పుడు నెల జీతంతో బ్రతుకు జీవనం సాఫీగా ఉండేది. సగటు ఉద్యోగి దాదాపు 35 నుండి 40 సంవత్సరాలు సంస్థలో ఉద్యోగం చేస్తారు. సంస్థ లో చేరిన తర్వాత బొగ్గు ఉత్పత్తికి మరియు పురోగతికి తమ చెమట రక్తాన్ని దార పోస్తారు. కంపెనీ లో చేరిన తర్వాత పెళ్లిళ్లు సంసార బాధ్యతలు మోస్తూ బొగ్గు ఉత్పత్తికి అహర్నిశలు కష్టపడతారు.

కంపెనీలో సంపాదించిన డబ్బుతో పిల్లల చదువులు మరియు వారి పెళ్లిళ్లు అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యుల బరువు బాధ్యతలు పేన వేసుకుంటూ బతుకు బండిని సాగిస్తారు. సింగరేణి ఉద్యోగులకు రిటైర్మెంట్‌ ‌తర్వాత ప్రధానంగా గ్రాట్యుటీ మరియు CMPFడబ్బులు చెల్లిస్తారు. ఈ పైసలు తమ పిల్లల చదువులు, పెళ్లిళ్లకు చేసిన అప్పులకు సరిపోతాయి. ఇంకా బ్యాంకు అప్పులతో కట్టుకున్న ఇళ్ళరుణాలకు ఈ పైసలే శరణ్యం. చాలామంది ఉద్యోగులు ఇల్లు లేక కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇదే కాక తమ కుటుంబ సభ్యులు ఆరోగ్యం కోసం చాలా పైసలు ఖర్చు చేసినారు. ఇప్పుడు వచ్చే చాలీచాలని పెన్షన్‌ ‌తో బతుకు బండి నడుపుతున్నారు.

రిటైర్మెంట్‌ అయిన తర్వాత CMPF 1998 చట్టం ప్రకారం ఉద్యోగి చివరి పది నెలల సరాసరి వేతనం పై 25% పెన్షన్‌ ‌నెల చెల్లిస్తారు. 24 సంవత్సరాల కింద చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పటికీ 25% పెన్షన్‌ ‌చెల్లిస్తున్నారు. 24 సంవత్సరాల క్రితం దిగిపోయిన ఉద్యోగికి అప్పటి వేతన ఒప్పందం ప్రకారం మరియు చివరిగా తీసుకున్న వేతనం పై 25% పెన్షన్‌ ‌నిర్ణయం జరుగుతుంది. ఈ ప్రకారంగా 1998 నుండి రిటైర్‌ అయిన ఉద్యోగులకు 300 రూపాయల నుండి 15 వేల రూపాయల వరకు పెన్షన్‌ ( ‌జూన్‌ 2018 ‌తో తొమ్మిదవ వేజ్‌ ‌బోర్డు ఒప్పందం ముగింపు) లభిస్తున్నది. 2018 జూలై నుండి NCWA X (National Coal Wage Agreement).). వేతన ఒప్పందం అమలైంది. ఈ వేతన ఒప్పందంలో జీతాలు కొద్దిగా పెరిగి 25% పెన్షన్‌ ‌ప్రకారం సగటు రిటైర్మెంట్‌ ఉద్యోగి నెలకు 20000 పెన్షన్‌ ‌దొరుకుతున్నది. ఈ 20000 ల రూపాయలు కూడా మరో మూడేళ్లకు పెరుగుతున్న ధరలతో పోటీపడలేక విశ్రాంత ఉద్యోగి జీవితం దుర్లభంగా మారుతుంది.

సీఎం పిఎఫ్‌ 1998 ‌చట్టం ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి సమీక్ష చేసి పెన్షన్‌ ‌పెరుగుదలకు తోడ్పడాలి. ఉదాహరణకు ఒక ఉద్యోగి 500 రూపాయలు పెన్షన్‌ ‌దిగిపోయిన రోజున నిర్ణయమైతే ఇప్పటికి కూడా అదే 500 పెన్షన్‌ ‌వస్తున్నది. వీటితో జీవనం సాగించడం చాలా చాలా కష్టంగా ఉంటున్నది. ఎందుకు సమీక్ష జరగడంలేదని మరియు ఎందుకు పెన్షన్‌ ‌పెంచడం లేదని వినతి పత్రాలు సమర్పిస్తే నిధులు లేవని ఏవో కుంటి సాకులు చెబుతున్నారు. పెన్షన్‌ ‌పెంచమని భారతదేశంలోని వివిధ సంఘాల నాయకులు ప్రయత్నాలు చేస్తున్న బూడిదలో పోసిన పన్నీరుగా మిగులుతున్నది. పెన్షన్నో రామచంద్ర అని అరిసి గీపెట్టిన వినే నాథుడే కరువయ్యాడు. 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు బొగ్గు పరిశ్రమలకు తమ కష్టాన్ని చెమటను ధారపోసి సంపద సృష్టించి దేశానికి వెలుతురు మరియు ఇతర రంగాల అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడిన బొగ్గు పరిశ్రమ ఉద్యోగులు దిగిపోయిన తరువాత వారి బతుకే చీకటిగా మారి భారంగా జీవనం సాగిస్తున్నారు. తమ జీవితాన్నే పణంగా పెట్టి యుక్త వయసు అంత ధారపోసిన బొగ్గు పరిశ్రమ ఉద్యోగులకు పెన్షన్‌ ‌కంటితుడుపు చర్యగా ఇస్తున్నారు. పెన్షన్‌ ‌పెంపుదల గురించి ఢిల్లీ హైకోర్టులో గత ఐదు సంవత్సరాల నుండి విచారణ కొనసాగుతూనే ఉన్నది.

పెన్షన్‌ ‌పెంచుటకు నిధులు లేవని మరియు CMPF 1998 చట్టం ప్రకారం 25 శాతమే పెన్షన్‌ ఇచ్చుటకు ఒప్పందం కుదిరిందని తెలుపుతున్నారు. మన భారత రాజ్యాంగం ఇప్పటికీ నూట నాలుగు సార్లు మన అవసరాలకు తగ్గట్టు సవరించుకున్నాము. ఇదేవిధంగా సీఎం పిఎఫ్‌ 1998 ఒప్పందాన్ని సవరించి పెన్షన్‌ ‌తగు విధంగా పెంచుటకు కృషి చేయాలని విశ్రాంతి బొగ్గు గనుల ఉద్యోగులు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.

దేశంలో ప్రకృతి విలయాలు కరువు కాటకాలు మరియు ఇతరత్రా సంఘటనలు జరిగినప్పుడు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆదుకుంటున్నారు. ఇదే పద్ధతిలో బొగ్గు పరిశ్రమ ఉద్యోగులకు పెన్షన్‌ ‌పెంచుటకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆదుకోవాలని వేడుకుంటున్నాం.

ఎన్నికలప్పుడు నాయకులకు బొగ్గుగని కార్మికుల పెన్షన్‌ ‌పెంచుటకు కృషి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అనేక సందర్భాలలో విజ్ఞప్తులు సమర్పించటం జరిగింది. అధికార, ప్రతిపక్ష నాయకులు గెలిచిన తర్వాత పెన్షనర్ల ధీనస్థితిని పట్టించుకున్న పాపాన పోలేదు. చెవిటివాని ముందు శంఖు ఊదినట్లు పెన్షనర్ల పరిస్థితి ఉంది. అనేక అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మంత్రులకు మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులకు మంత్రులకు పెన్షన్‌ ‌పెంచుటకు పలు విజ్ఞాపనలు సమర్పించినారు. ఇవి పత్రికలలో ఫోటో రూపంలో తెలుపుటకు మాత్రమే ఉపయోగపడతున్నది.

ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్‌ ‌లు మరియు ఇతర పెన్షన్లు ఇచ్చి ధీనావస్థలో, అచేతనంగా మరియు కడు పెదరికం లో ఉన్న ప్రజలను ఆదుకుంటున్నది. సింగరేణి నిధులు, బొగ్గు గనులు ఉన్న ఆధారిత ప్రాంత వాసులకు మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు పలు అవసరాలకు ఉపయోగిస్తున్నారు. రామగుండంలో మెడికల్‌ ‌కాలేజీ నెలకొల్పుటకు సింగరేణి నిధుల నుండి ఐదు వందల కోట్లు కూడా కేటాయించినారు ఇది మన తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతున్నది అని తెలపడంలో సందేహము లేదు. ఇంకా బొగ్గు గని ప్రాంత నియోజకవర్గ శాసనసభ్యులకు ప్రత్యేకముగా నిధులు కేటాయించి ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. ఇదే పద్ధతిలో సింగరేణిలో పనిచేసి చెమట మరియు రక్తాన్ని ధారబోసిన విశ్రాంతి ఉద్యోగులకు కూడా ప్రత్యేకంగా సింగరేణి నిధులు కేటాయించి ఇతర ప్రజలను అదుకున్నట్లు ఆదుకోవాలని వేడుకొనుచున్నాం. మేము కూడా సింగరేణి అభివృద్ధికి ఎంతో దోహదం చేసినవారమే కదా. ఇప్పుడు సింగరేణి పరిశ్రమ ఈ పరిస్థితిలో ఉన్నదంటే మేము చేసిన కృషి ఫలితమే.

ఇంకా సింగరేణి విశ్రాంతి ఉద్యోగులకు కల్పిస్తున్న వైద్య సౌకర్యాలు కంటితుడుపు వంటివే. ఆయా సింగరేణి ప్రాంతంలో ఉన్న ఏరియా దవాఖానాల్లో విశ్రాంతి ఉద్యోగులకు నామమాత్రపు ఉచిత వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. చాలామంది విశ్రాంత ఉద్యోగులు హైదరాబాద్‌ ‌కరీంనగర్‌ ‌వరంగల్‌ ‌ఖమ్మం తెలంగాణలోని ఇతర ప్రాంతాలు మరియు ఇతర రాష్ట్రాలలో కూడా స్థిర నివాసం ఉంటున్నారు. ఇది జే బి సి సి ఐ(JBCCI) ఒప్పందం ప్రకారం అని చెబుతున్నారు. ఈ సింగరేణి దవాఖానాలకు మందుల కోసం ప్రతి నెల సుదూర ప్రాంతాల నుండి రావాలంటే అనేక వ్యయప్రయాసలతో కూడుకున్న పని మరియు చాలీచాలని పెన్షన్‌ ‌తో కాలం సాగదీస్తూ దవఖానాలకు రావడం చాలా కష్టంతో కూడుకున్న పని మరియు ఆరోగ్యం కూడా సరిగా సహకరించదు.

ప్రతి విశ్రాంత ఉద్యోగి నుండి రూపాయలు 40,000 కట్టించుకుని CPRMS NE హెల్త్ ‌కార్డులు భార్య భర్తలు ఇరువురికి కలిపి జీవిత కాలంలో ఎనిమిది లక్షలకు వైద్య సౌకర్యం పొందుటకు ఇచ్చినారు. తెలంగాణలోని కొన్ని దవాఖానాలలో వైద్యం పొందుటకు వీలు కల్పించినారు. ఆంధ్రప్రదేశ్‌ ‌లో కూడా ఈ పథకం ఉపయోగించుటకు వీలు కల్పించినారు. ప్రతినిత్యం వైద్య ఖర్చులు పెరుగుతున్న ఈ రోజులలో ఈ ఎనిమిది లక్షలు ఎందుకు సరిపోవు. ఇందులో కూడా అయా దవాఖానాలు సరిగా స్పందించక అనేక కష్టాలకు గురి చేస్తున్నారు. ఇటీవల ఈ విషయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి మరియు జాతీయ సంఘాల నాయకులు సింగరేణి యాజమాన్యానికి వినతి పత్రాలు సమర్పించినారు.సింగరేణి అధికారులకు హైదరాబాద్‌ ‌శివారు ప్రాంతంలో ఇల్లు కట్టుకొనుటకు స్థలాలు కేటాయించటకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలియవస్తున్నది కానీ ఉద్యోగులకు స్థలాలు కేటాయింపుకు ఎలాంటి ప్రయత్నం జరగడం లేదు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు విశ్రాంత కార్మికుల సమస్యలను పరిష్కరించుటకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు భూతద్దం లో చూసిన వీరు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడం లేదు.

కోల్‌ ఇం‌డియా మరియు సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల దీనస్థితిని గమనించి పెన్షన్‌ ‌పెంచుటకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి చేసి తగు విధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా వేడుకొనుచున్నాం. అదేవిధంగా సింగరేణి నిధులను తెలంగాణ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. సింగరేణిలో రాష్ట్ర 51 శాతం వాటా కలిగి ఉన్నది. మా విశ్రాంత ఉద్యోగులకు కూడా కొన్ని నిధులు కేటాయించి కొంత ఉపశమనం కల్గించచాలని కోరడమైనది. ఉచిత వైద్యం సౌకర్యం సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు ప్రత్యేకంగా కల్పించాలని మనసారా వేడుకుంటున్నాము. మా ధీనపరిస్థితి ముఖ్యమంత్రికి తెలియనిది కాదు. తెలంగాణ సిద్ధించినక పట్టుదలతో 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ ‌సౌకర్యం ఎట్లా కల్పిస్తున్నారో, అట్లనే నీటి కరువు తెలంగాణను జల తెలంగాణగా మార్చిన విధంగా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల జీవన్మరణ సమస్యలు తక్షణమే పరిష్కరించి పెన్షనర్ల జీవితాల్లో వెలుగు నింపాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము.

– దండంరాజు రాంచందర్‌ ‌రావు

రిటైర్డ్ ‌డిప్యూటీ సూపరింటెండెంట్‌ ‌సింగరేణిభవన్‌ ‌హైదరాబాద్‌

‌మరియు అధ్యక్షుడు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ‌హైదరాబాద్‌, 9849592958

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *