వారి మాటలను ప్రజలే ఖండిస్తున్నారు
ఇది చూసి కాంగ్రెస్ నేతల్లో కలవరం
సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో అసహనం
బూతులు మాట్లాడటం, కోతలు కోయడం తప్ప మరో సోయి లేదు..
ప్రెస్మీట్లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 8 : రిజర్వేషన్ల రద్దు అంటూ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం ఫెయిల్ అయిం దని, రిజర్వేషన్ లబ్ధిదారులే బీజేపీపై విశ్వాసంతో మద్దతు పలుకు తున్నారని, కాంగ్రెస్ దుష్ప్రచా రాన్ని ప్రజలే ఖండిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. ఇందుకు తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ప్రచారానికి ఊరూరా అద్భుతమైన స్పందన వొస్తుందని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వొచ్చి.. బీజేపీకే వోటు వేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ… రిజర్వేషన్లపై ముఖ్య మంత్రిది బాధ్యతారాహి త్యమైన విమర్శ అని, వెనుకబడిన వర్గాల నుంచి వొచ్చిన మోదీ.. రిజర్వేషన్లు తొలగించరనే విశ్వాసం ప్రజల్లో ఉంద న్నారు.
అత్యధిక స్థానాలు బీజేపీ గెలువబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారమే తమకు సానుకూలంగా మారుతుందన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ పదేండ్లు, అంతకు ముందు కాంగ్రెస్‌కు పదేండ్లు అధికారం ఇచ్చారని, ఈ సారి మెజారిటీ వోట్లు, సీట్లు బీజేపీకే వేయాలని ప్రజలు నిశ్చయించుకున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది చూసి కాంగ్రెస్ పార్టీలో కలవరం పెరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో ఈ అసహనం కనబడుతుందన్నారు. ఇద్దరు, ముగ్గురు జర్నలిస్టులను జైళ్లో వేస్తే బుద్ధి వొస్తుందన్న రేవంత్ రెడ్డి ప్రకటనలు..ఆయన అహంకారానికి నిదర్శనమని తెలిపారు. బూతులు మాట్లాడటం, కోతలు కోయడం తప్ప చేతల్లో చూపించే సోయి ఆయనకు లేదని ధ్వజమెత్తారు. టాక్స్ వసూలు చేయడం తప్ప వేరే విషయం తెలియదని చెప్పారు. రీసెర్చ్ టీమ్ పెట్టుకుని..ఏయే తిట్లు తిట్టాలి, ఏ వీడియో డీప్‌ఫేక్ చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం సీఎం చేస్తున్నారని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఖరి ఒకటేనని అన్నారు.
ముఖ్యమంత్రిలో అభద్రతా భావం, అసహనం పెరిగిపోయిందని, బీజేపీపై వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేయడంలో..ఆ రెండు పార్టీలు పోటీపడుతున్నాయన్నారు. ప్రధానమంత్రి స్వయంగా.. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రిజర్వేషన్లపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెప్పినా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అబద్ధాల ప్రచారంలో కల్వకుంట్ల కుటుంబానికి, రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా కిషన్ రెడ్డి చేశారు. తెలంగాణకు యూరియా పరిశ్రమ తీసుకొస్తే, పేదల ఇండ్లకు వెలుగులు తీసుకొస్తే అది గాడిద గుడ్డులా కనబడుతున్నదా…అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గెలవలేని సీట్లకు కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తానని రేవంత్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైతు భరోసాను కేంద్ర ఎన్నికల సంఘం నిలివేసిందని, ఎన్నికలు వొస్తాయని ముందే తెలిసినా.. రైతుభరోసా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా.. తెలంగాణలో బీజేపీ రెండంకెల మార్కు దాటడం ఖాయమని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు.. శామ్ పిట్రోడా జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని తెలిపారు. దేశ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ దురంహకార వైఖరికి అద్దం పడుతుందని. గతంలో ప్రధాన మంత్రిపైనా ‘నీచ్’ (తక్కువ జాతి) అని మాట్లాడారని గుర్తుచేశారు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణ కోల్పోతుందని తెలుస్తుందో.. అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటం.. అసహనాన్ని బహిర్గత పరచడం సాధారణమైపోయిందని కౌంటర్ ఇచ్చారు. బుధవారం నాటి మోదీ కరీంనగర్, వరంగల్ సభలు విజయవంతమయ్యాయని, ప్రజలు వేడిని కూడా లెక్క చేయకుండా భారీ సంఖ్యలో సభల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రధాని మోదీ ఈనెల 10వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సమావేశంలో ప్రసంగించనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.




