రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రికి సిద్ధమైన శైవక్షేత్రాలు

  • భక్తుల రాకతో వేములవాడలో భారీగా ఏర్పాట్లు
  • హన్మకొండలో శివరాత్రి వేడుకలు….హాజరు కానున్న గవర్నర్‌ ‌తమిళి సై
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : నేడు శివరాత్రి పర్వదిన ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. శివరాత్రి రోజున భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశమున్నందున భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం, కాళేశ్వరం, హన్మకొండ వేయిస్తంభాల గుడి, కీసర రామలింగేశ్వర స్వామి వంటి ప్రముఖ శైవక్షేత్రాలను భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకోనుండడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఇక  మహాశివరాత్రి వేడుకల కోసం వేములవాడ రాజన్న ఆలయం ముస్తాబైంది. వేడుకలకు వివిధ రాష్ట్రాలతో పాటు స్థానికంగా సుమారు 4  లక్షల మంది భక్తులు వొచ్చే అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు రూ.3.03 కోట్లతో పనులు చేస్తున్నారు. 400 వసతి గదులు మాత్రమే ఉండడంతో గుడి చెరువు గ్రౌండ్‌లో చలువ పందిళ్లు వేశారు. తాగునీటి వసతితో పాటు స్నానాల ఘాట్‌లు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశారు. రాత్రి జాగరణ చేసే భక్తుల కోసం శివార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
దీని కోసం దేశవ్యాప్తంగా కళాకారులు తరలివచ్చారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఆలయం సిబ్బందితో పాటు ఇతర జిల్లాల నుంచి మున్సిపల్‌ ‌కార్మికులు, తాత్కాలిక కార్మికుల సేవలను ఉపయోగించుకుంటున్నారు.   17 రాత్రి 9 గంటల నుండి నిశీపూజ తర్వాత అన్ని పూజలను రద్దు చేసి కేవలం భక్తుల సౌకర్యార్థం లఘు దర్శనం, కోడె మొక్కుబడి నిర్వహిస్తారు. 18వ తేదీ మొదలుకాగానే 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు వేములవాడ పట్టణవాసులకు సర్వదర్శనం, ఉదయం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు ఆలయం శుద్ది ఉంటుంది. 4 గంటల నుంచి 4.25 వరకు సుప్రభాతం, 4.25 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాత:కాల పూజ, అనువంశిక అర్చకుల దర్శనం, 7 గంటల నుంచి టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం, ఉదయం 8 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పట్టు వస్త్రాల సమర్పణ, సాయంత్రం 4 గంటల నుంచి శివదీక్ష స్వాములకు దర్శనం,  సాయంత్రం 6.05 నిమిషాలకు శ్రీస్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 నిమిషాలకు లింగోధ్భవ కాలమందు శ్రీస్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతరకు వచ్చే భక్తుల కోసం అధికారులు 4 లక్షల లడ్డూలు, 10 క్వింటాళ్ల పులిహారా సిద్ధం చేస్తున్నారు.
100 గ్రాములతో లడ్డూలు,  250 గ్రాములతో పులిహారా ప్యాకెట్లు ఉండనున్నాయి. 100 గ్రాముల లడ్డూ రూ.20, 500 గ్రాముల లడ్డూ రూ.100,  పులిహార రూ. 15 కు అమ్మనున్నారు. కౌంటర్లలోనే కాకుండా దర్శనం చేసుకొని బయటకు వెళ్లే మార్గాల్లో ప్రసాదాన్ని అందుబాటులో ఉంచనున్నారు.  ఉత్సవాల కోసం 850 ప్రత్యేక జాతర బస్సులను నడుపుతున్నామని అర్టీసీ అధికారులు చెప్పారు. భక్తులకు వైద్య సాయం కోసం11 అత్యవసర కేంద్రాలు,  163 మంది వైద్య సిబ్బందిని నియమించామని డీఎంహెచ్‌ఓ ‌డా. సుమన్‌ ‌మోహన్‌రావు తెలిపారు.  అన్ని దారుల్లో అత్యవసర కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
హన్మకొండలో శివరాత్రి వేడుకలు….హాజరు కానున్న గవర్నర్‌ ‌తమిళి సై
ఓరుగల్లులో జరిగే శివరాత్రి వేడుకల్లో గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌పాల్గొననున్నారు. మహా శివరాత్రి సందర్బంగా హనుమకొండలో ఇండస్‌ ‌ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలకు గవర్నర్‌ ‌హాజరు కానున్నారు. అందుకోసం ఇండస్‌ ‌ఫౌండేషన్‌ ‌నిర్వాహకులు హయగ్రీవాచారి గ్రౌండ్‌లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శివరాత్రి మహోత్సవాలకు గవర్నర్‌ ‌తమిళి సైతో పాటు అవధాని మాడుగుల నాగఫణిశర్మ, సినీ డైరెక్టర్‌ ‌విజయేంద్ర ప్రసాద్‌, ‌సీబీఐ మాజీ డైరెక్టర్‌ ‌జేడీ లక్ష్మీనారాయణ కూడా హాజరుకానున్నారు. ఓరుగల్లు వైభవం ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఇండస్‌ ‌ఫౌండేషన్‌ ‌ఛైర్మన్‌ ‌రాకేష్‌ ‌రెడ్డి, నరహరి వేణుగోపాల్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. జాగరణ కోసం పెద్ద ఎత్తున తరలి వొచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *