రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు…పలు చోట్ల కుండపోత

  • నిజామాబాద్‌ ‌జిల్లా వేల్పూర్‌లో 46 సెంమీ రికార్డు స్థాయి వర్షం
  • వరంగల్‌, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు
  • జలమయమైన లోతట్టు ప్రాంతాలు…తెగిపోయిన చెరువు కట్టలు
  • ధ్వంసమైన రహదారులు…ఆర్మూర్‌-‌కరీంనగర్‌ ‌హైవేపై భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌
  • ‌ప్రధాన మార్గాల్లో నిలిచిపోయిన రాకపోకలు
  • పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు…మూసీకి పోటెత్తిన వరద

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 25 : అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా  ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. దీంతో దెబ్బకు చెరువు కట్టలే తెగిపోయాయి.. రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇక నిజామాబాద్‌ ‌జిల్లాలో రికార్డు స్థాయిలో కురిసిన ఈ కుంభవృష్టి వాన అందరినీ ఒక్కసారిగా వణికించింది. వేల్పూర్‌ ‌మండలంలో ఇప్పటివరకు రికార్డ్ ‌స్థాయిలో 46 సెం.మీ (460 మి.మీ) వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే అంటున్నారు అధికారులు. వేల్పూర్‌, ‌బీమ్‌గల్‌లో కురిసిన కుండపోత వర్షంతో చెరువుల కట్టలు కూడా తెగిపోయాయి. వర్షం, వరద ఉధృతికి రహదారి సైతం ధ్వంసమైంది.

దీంతో ఆర్మూర్‌ ‌కరీంనగర్‌ ‌హైవేపై భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ అయింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. వేల్పూర్‌ ‌చెరువుకు గండి పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేల్పూర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌, ఎమ్మార్వో కార్యాలయం, ఐకెపి, రైతు వేదికలు నీట మునిగాయి.ఆర్మూర్‌-‌భీంగల్‌ ‌మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పచ్చల నడికూడ- భీంగల్‌ ‌మధ్య ఊర చెరువుకు గండి పడి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వరంగల్‌ ‌జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. వరంగల్‌-‌ఖమ్మం హైవేపై భారీగా వరద నీరు చేరగా పంతిని గ్రామం దగ్గర హైవే పై ఉదృతంగా వరద ప్రవహిస్తుండగా వరద నీటిలో చిక్కుకుపోయిన లారీని బయటికి తీసేందుకు స్థానికులు ప్రయత్నించారు. హైవే పై ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ ‌జామ్‌ అయ్యింది..ఇక ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వానలతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

వరంగల్‌ ‌నగరంలోని పలు లోతట్టు కాలనీలు నీట మునిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. యాదాద్రిలో జోరుగా వర్షం పడుతుంది. ఇక యాదగిరిగుట్ట భువనగిరి మండలంలో మూసీకి వరద పోటెత్తింది. దీంతో భీమా లింగం కత్వా దగ్గర మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. బొల్లెపల్లి-సంగెం మధ్య రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ముందస్తుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్‌ ‌గాజుల రామారంలో వరద కష్టాలు వెంటాడుతున్నాయి. వరద తగ్గుముఖం పట్టేలోపే వర్షాలు దంచికొడుతుండటంతో జనం ఇబ్బందిపడుతున్నారు. నీటిని తొలగించేలా చర్యలు చేపట్టాలని లోకల్‌ ఎమ్మెల్యే, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వికారాబాద్‌ ‌జిల్లా దారూర్‌ ‌మండలం నాగసమందర్‌ ‌దగ్గర రోడ్డుపై  కోటపల్లి వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. రిజర్వాయర్‌ ‌నిండి అలుగు పారుతుంది. దీంతో నాగస మందర్‌-‌వికారాబాద్‌ ‌మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో దారూర్‌ ‌పోలీసులు సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వికారాబాద్‌ ‌జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వికారాబాద్‌ ‌జిల్లా యాలాల మండలం జుంటిపల్లి ప్రాజెక్ట్‌కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద నీరు పెరగడంతో జుంటిపల్లి ప్రాజెక్ట్ అలుగు పారుతుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *