రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ ‌నిరసనలు

  • రేవంత్‌ ‌వ్యాఖ్యలపై రైతులతో కలిసి ఆందోళన
  • మంత్రి కెటిఆర్‌ ‌పిలుపు మేరకు రైతు సమావేశాల నిర్వహణ
  • కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కాలన్న మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అనవసరమన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పిలుపుమేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ‌నాయకులు ‘రైతు సమావేశాలు’ నిర్వహించారు. రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కాంగ్రెస్‌ ‌తీరును నిలదీశారు. కాంగ్రెస్‌ ‌రైతు వ్యతిరేక విధానాలపై సమావేశాల్లో అవగాహన కల్పించారు. పలు చోట్ల రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతుల జోలికొస్తే కాంగ్రెస్‌ అ‌డ్రస్‌ను గల్లంతు చేస్తామని హెచ్చరించారు. కెటిఆర్‌ ‌పిలుపుతో ‘మూడు పంటలు టీఆర్‌ఎస్‌ ‌నినాదం-మూడు గంటల కరెంటు కాంగ్రెస్‌ ‌విధానం’ పేరుతో పది రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు.
ప్రతి రైతు వేదిక వద్ద కనీసం వెయ్యిమంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు కరెంటు కష్టాలకు కారణమే కాంగ్రెస్‌ అని, పంచాయతీరాజ్‌ ‌శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు అన్నారు. అసమర్థ, దుష్ట పాలన వల్ల రైతులు అరిగోస పడ్డారు. అందుకే ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడినా బుద్ధిరాలేదన్నారు. ‘రేవంత్‌ ‌రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. వ్యవసాయానికి కేవలం 3 గంటల కరెంటు చాలట. వ్యవసాయం గురించి తెలిసినోడు మాట్లాడే మాటలేనా? అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌నాయకుల వ్యాఖ్యలతో రైతులు నవ్వుకుంటున్నారు. నవ్వులపాలైన ఆ పార్టీని పాతాళంలో పాతి పెట్టాలి’ అని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. రైతులకు ఉచిత కరెంట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ ‌వైఖరిని నిరసిస్తూ, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండలం, ముత్తారం, పాలకుర్తి రైతు వేదికల వద్ద రైతులతో కలిసి నిర్వహించిన సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కాంగ్రెస్‌ ‌వ్యాఖ్యలపై కన్నెర్ర చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ మూర్ఖంగా మాట్లాడుతున్నది.
తప్పుడు ప్రచారాలు చేస్తున్నది. ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నదని మండిపడ్డారు. దున్నపోతు ఈనింది అంటే.. దొడ్లో కట్టేయమన్నట్లు కాంగ్రెస్‌ ‌పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన పాపం కాంగ్రెస్‌ ‌పార్టీదేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ‌హయాంలో కాలిపోయే మోటార్లు, స్టాటర్లు, ఎండిపోయిన పైర్లు అసెంబ్లీలో ప్రదర్శించి, అల్లరి చేసే పరిస్థితి నాడు ఉండేది. వాటితోనే అసెంబ్లీ దద్దరిల్లేది. వ్యవసాయం దండుగ అనేదని అన్నారు. ఎరువులు, విత్తనాల కొరత, నకిలీలు, సాగునీరు లేక, కరెంట్‌ ‌రాక అంతా ఆగమాగం ఉండేది. రైతులు అత్మహత్యలు చేసుకునే దుర్మార్గ పాలన అనాడు సాగింది. ఎండాకాలంలో గ్రామాలకు రావాలంటేనే ప్రజాప్రతినిధులు భయపడేవారు అని ఆనాటి పరిస్థితులను మంత్రి రైతులకు వివరించారు.అందుకే 60 ఏండ్ల కాంగ్రెస్‌ ‌పాలనకు చరమగీతం పాడారని తెలిపారు.కాగా, పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ‌వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *