- తొమ్మిదేళ్లలో రాష్ట్రం బాగుపడిందా ..పాడయిందా ప్రజలే గుర్తించాలి
- షాద్ నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి కెటిఆర్
- ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌పై ప్రశంసల వర్షం..
- మరోసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధిలో పరుగులు : వికారాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి కెటిఆర్
షాద్‌నగర్/వికారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర ఐటీ పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. షాద్ నగర్ నియోజక వర్గంలో 1760 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన ఆయన అనంతరం పత్తి మార్కెట్లో స్ధానిక ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రూపాయి ఖర్చు లేకుండా 25 లక్షల విలువ చేసే ఇళ్లను నిరుపేదలకు పంచుతున్నామని వెల్లడించారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ బాగుపడిందా, పాడయిందా అన్నది ప్రజలు గుర్తించాలన్నారు. 24 గంటల విద్యుత్, తాగునీరు రాష్ట్రానికి మేము అందించిన వరాలు అని అన్నారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతు జీవితాలకు భరోసా కల్పించిన ఘనత తమ పార్టీదేనని అన్నారు. సంక్రాంతి గంగిరెద్దులా ఎన్నికల వేళ వొచ్చే కాంగ్రెస్, బిజెపి నాయకులు ప్రజలకు చేసే మేలు ఏమీ ఉండదన్నారు. కాంగ్రెస్‌కు వోటు వేస్తే మూడు గంటల కరెంటుతో వ్యవసాయం ఆగం అవుతుందన్నారు. చచ్చిన పీనుగలా మారిన కాంగ్రెస్‌వి దింపుడు కళ్లెం ఆశలని ఎద్దేవా చేశారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు 2 వందలకంటే ఎక్కువ పింఛన్ ఇవ్వని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నాలుగు వేలు అంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములు ఇచ్చేది లేదు చచ్చేది లేదని, వారి మాటలు నమ్మొద్దని హితవు చెప్పారు. త్వరలోనే కెసిఆర్ భారీ స్కీములు ప్రకటించబోతున్నారని అన్నారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ విషయంలో ఆందోళన అవసరం లేదని, ప్రస్తుతం కొల్లాపూర్, ఉదండాపూర్, కరివేన, ఏదుల, లక్నాపూర్ పనులు పూర్తి కాగానే మొదలవుతుందన్నారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో ఆందోళన చేసి కేసులు పెట్టిన నాయకులే ఇప్పుడు ప్రాజెక్టు గురించి అడగడం హాస్యాస్పదమన్నారు. రేవంత్ రెడ్డి లాంటి ఆర్ఎస్ఎస్ నాయకుడు పార్టీలో ఉంటే పార్టీ సర్వనాశనం అవుతుందని వాళ్ల పార్టీ నేత అమరేందర్ సింగ్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. బిజెపిలో చేరేందుకు టిఆర్ఎస్ ఆసక్తిగా ఉందంటూ మోదీ చెప్పడం చూస్తే నవ్వొస్తుందని, ఆ పార్టీతో కలిసి ఉండే దరిద్రం తమ పార్టీకి పట్టలేదని అన్నారు. అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ పేదలే లక్ష్యంగా తమ పాలన కొనసాగుతుందన్నారు. ప్రజలు ఆ గట్టున ఉంటారో, తమ గట్టును ఉంటారో తెలుసుకోవాలని కెటిఆర్ రంగస్థలం సినిమా పాటలు గుర్తుచేస్తూ స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం..
షాద్ నగర్ బహిరంగ సభ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధిని సంక్షేమాన్ని నిద్రలో కూడా మర్చిపోకుండా పనిచేసే ఉద్యమ నాయకుడు అంజయ్య యాదవ్ అని కొనియాడారు. పాలమూరు జిల్లాలో తొలిసారి ముఖ్యమంత్రి జడ్పిటిసి స్థానాన్ని గెలిచి పార్టీకి కొండంత ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి అని, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడనీ ప్రశంసించారు. ఇది తనకు ఎన్నికల సభలా కాకుండా అంజయ్య యాదవ్ విజయోత్సవ సభలా కనిపిస్తుందన్నారు. మళ్లీ అంజయ్య యాదవ్ వొస్తాడని లక్ష్మీదేవి పల్లి నీటిని, పక్కా గృహాలను అందరికీ అందేలా చేస్తాడని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కోరిక మేరకు సిద్దాపూర్లో 334 ఎకరాలలో ఐటి హబ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా షాద్ నగర్ నియోజకవర్గం చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వరకు మెట్రో రైలు ఏర్పాటు అవుతుందని వెల్లడించారు.
4,669 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అంజయ్య యాదవ్ కావాలా.. అధికారం వొస్తే అడ్డంగా దోచునే కాంగ్రెస్ నాయకులు కావాలా.. ప్రజలు తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రవీణ్, పార్లమెంట్ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ రాజా వరప్రసాద్, జడ్పీ చైర్మన్ అనిత రెడ్డి, చేవెళ్ల కార్తీక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇందిర, ఎంపీపీలు రవీందర్ యాదవ్, ప్రియాంక శివశంకర్ గౌడ్, జెడ్పిటిసి శ్రీలత, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, కౌన్సిలర్ వెంకటరామిరెడ్డి, మైనార్టీ నేతలు సయ్యద్ సాదిక్, సర్వర్ పాష, మహమ్మద్ ఎజాజ్, నారాయణరెడ్డి, జాంగారీ రవి, రవి యాదవ్, ప్రేమలత యుగంధర్ తదితరులు హాజరుయ్యారు.
మరోసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధిలో పరుగులు : వికారాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి కెటిఆర్
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మూడోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టి అన్ని రంగాల్లో అభివృద్ధిలో మరింతగా తూసుకుపోయేందుకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలు మోసపూరిత ప్రకటనలు చేస్తూ ప్రజలను వొచ్చే ఎన్నికల్లో మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని, దిల్లీలో మోకరిల్లే నాయకులను నమ్మి మోసపోవద్దని మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటీ రామారావు పర్యటించి రూ. 173 కోట్లతో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు భూగర్భ వనరుల శాఖా మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..వికారాబాద్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ఆనందును మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నాయకులకు కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ వికారాబాద్ నియోజకవర్గాన్ని గతంలో అభివృద్ధి చేయలేకపోయారని ఎమ్మెల్యే ఆనంద్ వొచ్చాక వికారాబాద్ నియోజకవర్గ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన పనులు పూర్తవుతాయని, కొత్త అభివృద్ధి పనులకు ఎలాంటి హామీలు ఇవ్వనని, ఇక రెండు మూడు రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడాల్సి ఉందని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధిలో వికారాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతూ ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వికారాబాద్ రూ.96 కోట్లతో రైల్వే వంతెన నిర్మాణం పనులకు శంకుస్థాపన, రూ. 7.20 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, రూ. 1.10 కోట్లతో ప్రభుత్వ గిరిజన భవనమునకు ప్రారంభోత్సవము, కోటి రూపాయల వ్యయంతో ప్రభుత్వ గిరిజన కళాశాల, బాలికల వసతి గృహమునకు శంకుస్థాపన, రూ. 1.54 కోట్లతో కేజీబీవీ బాలికల పాఠశాలలో అదనపు తరగతి గదులు మరియు ల్యాబ్ ప్రారంభోత్సవము, రూ. 1.54 వోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం, రూ. 48.69 లక్షలతో సఖి సెంటర్ ప్రారంభోత్సవం, అలాగే రామయ్య గూడ, ఆలంపల్లి వైకుంఠ దామాల నిర్మాణ పనులకు రెండు కోట్లు, మోడ్రన్ ధోబి ఘాట్ నిర్మాణ పనులకు రెండు కోట్లతో, వికారాబాద్ పట్టణంలో పార్కుల సుందరీకరణ మరియు అభివృద్ధి పనులకు ఐదు కోట్లు, రూ. 25 కోట్లతో సిసి రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన అలాగే రూ. 30 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు వరసల రహదారిగా విస్తీర్ణం పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్, చేవెళ్ల శాసనసభ్యులు, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ చంద్రకళ, జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, వికారాబాద్ ఆర్డిఓ విజయ కుమారి వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





