- 23వ తేదీకి ఏర్పాట్లు పూర్తి చేయాలి
- కలెక్టర్ అనుదీప్
భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : 28వ తేదీ బుధవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానమునకు విచ్చేయుచున్నందున ఏర్పాట్లు పకడ్బందీగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా ఏర్పాటు చేయాలని భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం నాడు సాయంత్రం భారత రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్న సౌకర్యాలపై జిల్లా ఎస్పీ వినీత్‌తో కలిసి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ముందుగా బిపిఎల్ గెస్ట్ హౌస్‌ను మరియు బిపిఎల్‌లోని పాఠశాల ఆవరణలోని హెలిప్యాడ్ గ్రౌండ్‌ను పరిశీలించిన అనంతరం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకొని భారత రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి దేవస్థానం పరిసరాలలోని మరియు చలువ పందిళ్లకు సంబంధించిన ఏర్పాట్లను చూసిన అనంతరం చుట్టూ కార్పెట్లను వేయించాలని చలువ పందిళ్లకు సంబంధించిన శ్యామియానాలను అందంగా అమర్చాలని దేవస్థానంలోని ఖాళీ ప్రదేశాల చుట్టూ భారీకేడ్లను నిర్మించాలని అన్నారు. రాష్ట్రపతి దర్శనం చేసుకుని పరిసరాల చుట్టూ పచ్చరకం కార్పెట్లు అమర్చాలని రాష్ట్రపతి వెంట వొచ్చే సెక్యూరిటీ సిబ్బంది సూచనల మేరకు దర్శనంకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అన్నారు.
ఏర్పాట్ల విషయంలో ఎటువంటి అశ్రద్ధ చేయకూడదని 23 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యే విధంగా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సంబంధిత అధికారులు చేస్తున్న ఏర్పాట్లను దేవస్థానం ఈవో దగ్గరుండి చూసుకోవాలని అలాగే ప్రసాదం ఆవిష్కరణకు సంబంధించిన శిలాఫలకం చాలా అందంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆవిష్కరణ అయ్యేవిధంగా ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం టొబాకో బోర్డులోని హెలిప్యాడ్ పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకొని రాష్ట్రపతి పర్యటన విజయవంతంగా ముగిసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి రోహిత్ రాజ్, జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ రత్నకుమారి, దేవస్థానం ఈవో శివాజీ, ఈ ఈ ఆర్‌అండ్‌బి భీమ్లాల్, ఓఎస్‌డి సాయి మనోహర్, డిడి ఏవియేషన్ వినయ్, భద్రాచలం తాసిల్దార్ శ్రీనివాస్ యాదవ్ దేవస్థానం డిఈ రవీందర్, గ్రామపంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు, వైద్యశాఖ సమన్వయ అధికారి అధికారి రవిబాబు, మరియు టౌన్ సీఐ నాగరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




