- పూర్తిస్థాయిలో ప్రచారంపై బీజేపీ దృష్టి
- 17న మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడు పెంచింది. పక్కా వ్యూహాలతో బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టింది. ఇక నుంచి ముఖ్య నాయకులను రంగంలోకి దించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటి నుంచి ప్రధాని మోదీ సహా.. అమత్ షా, పలువురు కీలక నేతలు తెలంగాణలో పర్యటించారు. అయితే, ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కీలక నేతలతో ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాలని బీజేపీ యోచిస్తుంది. దీనిలో భాగంగా ఈ నెల చివరి వారంలో ప్రధాని మోదీ వరస పర్యటనలు ఉన్నాయి. 25, 26,27 తేదీలలో మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా టూర్ కి సంబంధించి కూడా ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయినట్టుగా తెలుస్తుంది. ఈనెల 17న అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా ఒకే రోజు నాలుగు సభలకు బిజెపి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌లో పబ్లిక్ మీటింగ్స్ ఉండనున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ నేతలు 119నియోజకవర్గాల్లో పాగా వేసి ఎన్నికలు పూర్తి అయ్యేవరకు గ్రౌండ్ లెవెల్‌లో పనిచేస్తున్నారు. అయితే, బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించి కూడా కూడా క్లారిటీ వొచ్చింది. అమిత్ షా పర్యటన 17న ఉన్న నేపథ్యంలో ఆ రోజే మేనిఫెస్టోని రిలీజ్ చేయాలని బీజేపీ భావిస్తుంది. ఇక మేనిఫెస్టో విషయానికి వొస్తే సెంటిమెంటును రగిలించే విధంగా కొన్ని ప్రాంతాల పేర్ల మార్పుతో పాటు పలు కీలకమైన అంశాలను పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది. వైద్య, విద్య ఉచితంగా అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది. ఇక జాబ్ క్యాలెండర్ ఉపాధి అవకాశాలపైన కూడా ప్రకటన చేయాలని బీజేపీ భావిస్తుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు భిన్నంగా మేనిఫెస్టోను రూపొందించి.. ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రణాళికతో ముందుకెళ్తుంది.




