రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్‌ మార్క్‌

తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఇరవై అయిదు రోజులు కావొస్తున్నది. ఈ కొద్ది కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ తన మార్క్‌ను ప్రదర్శించుకుంది. మునుపటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదని, పాలనాపగ్గాలు చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పకనే చెప్పినట్లుంది. ఎన్నికలముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల వాగ్ధానాన్ని పదవి అలంకరించిన మరుసటి రోజున్నే అమలులో పెట్టడం ప్రజల్లో తమ నమ్మకం వమ్ముకాలేదన్న అభిప్రాయం ఏర్పడడానికి కారణమైంది. మొదటి విడుతలో రెండు వాగ్ధానాలను పూర్తిచేసి, తామిచ్చిన గడువులోగా మిగతావాటిని అమలులోకి తెస్తామనడంతోపాటు, అందుకు కావల్సిన కార్యాచరణను చేపట్టిన తీరు ప్రజల విశ్వాసాన్ని చూరగొనే విధంగా ఉంది.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతున్న క్రమంలో ఈ ప్రాంతంవారికి పాలన చాతకాదని సీమాంధ్రనేతలు చేసిన వ్యాఖ్యలకు గత తొమ్మిదిన్నర ఏండ్లపాటు ఏకధాటిగా పాలన చేసిన కెసిఆర్‌ నిరూపించగా, అందుకు తామేమీ తీసిపోమన్న రీతిలో రేవంత్‌రెడ్డి పాలన సాగుతోంది. ఆరవై ఏండ్ల తండ్లాట, పద్నాలుగేళ్ళ నిర్విరామపోరాటం ఫలితంగా సిద్ధించిన  ప్రత్యేక రాష్ట్రంలో తమ ఆశలు నెరవేరుతాయని ప్రజలు భావించారు. అయితే ఉద్యమ స్ఫూర్తిని మరిచి పాలనసాగించిందన్న ఆపవాదను బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూటగట్టుకుంది. తమ గోడు చెప్పుకునే అవకాశం ఆ ప్రభుత్వంలో లేకుండా పోయిందన్న విమర్శలు చోటుచేసుకున్నాయి.

మంత్రులకే ముఖ్యమంత్రి దర్శనం లభించడం దుర్లభమైంది. దానికి తోడు నిర్బంధాలు.. శక్తికి మించిన పథకాలను రూపొందించి  లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న అపకీర్తి ఆ ప్రభుత్వాన్ని వెంటాడిరది. విపక్షాలు ఆరోపిస్తున్న అవినీతి కాళేశ్వరం బ్యారేజ్‌  కుంగుబాటు బహిర్గతం చేసింది. అపర దానకర్ణుడిగా సంఘాలు, సంస్థలకు ఆర్థికంగా, హార్థికంగా ఆదుకుంటానని ఇచ్చిన వాగ్ధానాలు నెరవేరకపోవడం లాంటి అనేకానేక అంశాల కారణంగా ప్రజలే ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు. దానికి తగినట్లుగా ఎన్నికల ప్రచార సభల్లో తనకు ఏడు పదులు దాటాయని, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా తీసుకువొచ్చిన ఘనతకన్నా కావాల్సిందేముందని నిర్వేదంగా మాట్లాడిన తీరు ప్రజల్లో ఎక్కడో నాటుకుపోయింది. రేవంత్‌రెడ్డి సారధ్యంలో అప్పుడు శక్తివంతంగా ముందుకు దూసుకువొస్తున్న కాంగ్రెస్‌పార్టీ వారికి ప్రత్యామ్నాయంగా  కనిపించింది. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న ఏడు పదులు దాటిన కెసిఆర్‌ను కాదని, 54ఏళ్ళ అనుముల రేవంత్‌రెడ్డికి ప్రజలే పట్టం కట్టారు. అయితే గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలనను చవిచూసిన ప్రజల అనుమానాలకు భిన్నంగా రేవంత్‌రెడ్డి తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నట్లు ఈ ఇరవై అయిదు రోజుల పాలనాతీరు స్పష్టం చేస్తున్నది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో పదవి చేపట్టిన రెండవ రోజున్నే రెండు పథకాలను అమలులోకి తేవడం హర్షించదగిన విషయం.

అందులో ప్రధానంగా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కలిగించడం ద్వారా కాంగ్రెస్‌ మహిళను అకట్టుకోగలిగిందనే చెప్పాలె. బస్సులన్నీ మహిళ ప్యాసింజర్లతో కిక్కిరిసి పోతున్నాయి. మగ ప్యాసింజర్లు కూర్చోవడానికే చోటు లేకుండా పోతున్నది. ఫలితంగా అదనపు బస్సులను కొనుగోలుచేయాల్సిన పరిస్తితి ఏర్పడిరది. అటు ఆర్టీసీకి ఇటు ప్రభుత్వానికి ఇది భారమైనప్పటికీ మహిళాలోకానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్న మాటదక్కింది. అలాగే నిరుపేద వర్గాల చికత్స విషయంలో కూడా అయిదు లక్షలనుండి పదిలక్షలకు ఆరోగ్యశ్రీని పెంచడం, వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న హామీలకు అనుగుణంగా ప్రజలవద్దకు పాలన దరఖాస్తుల హడావిడి అంతా ప్రజాపాలనకు అద్దం పట్టేదిగా కనిపిస్తున్నది. పదవీ స్వీకారం రోజున్నే ప్రగతి భవన్‌ ముందున్న ఇనుప కంచెను తొలగించి, ప్రజాభవన్‌గా మార్చడంతోనే కాంగ్రెస్‌ చెప్పినట్లు తమది ప్రజాప్రభుత్వమని, తాము పాలకులు కాదు, సేవకులమన్న మాటను నిరూపించుకుంది.

గత ప్రభుత్వం మాదిరి కాకుండా తమ ప్రభుత్వం స్వయం నిర్ణయాధికారాలను అధికారులకే అప్పగిస్తున్నామని చెప్పడం రేవంత్‌రెడ్డి మార్క్‌ పాలనకు అద్దం పడుతున్నది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను పెంపొందించే విషయంలో కూడా సొంత  నిర్ణయాలకన్నా ఉన్నత విద్యావంతులతో ఒక సలహామండలి ఏర్పాటు, జిల్లాకు ఒక స్కిల్డ్‌ యూనివర్శిటీ ఏర్పాటు, వైద్యరంగంలో ప్రతీ వంద పడకల హాస్పిటల్‌ కు ఒక  నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు లాంటి సంచలనాత్మక నిర్ణయాలన్నీ నెలరోజుల లోపున్నే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు. మరో ఒకటి రెండు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు రానున్న తరుణంలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న వేగవంత నిర్ణయాలు ఆశించిన మేరకు లోకసభ స్థానాలు గెలుచుకోవడానికి దోహద పడుతాయనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *