రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ

  • అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సీట్లు పెంచుకున్నాం..
  • వోటింగ్‌ శాతంలోనూ భారీ పురోగతి
  • ఆర్నెల్లలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
  • దిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూర్‌ 6 : తెలంగాణలో బీజేపీ గణనీయమైన సీట్లు గెలుచుకుందని, గతంలో కంటే ఎక్కువ సీట్లు, వోట్ల శాతాన్ని సాధించామని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో, గత పదేళ్ల తెలంగాణలోనూ స్వతంత్రంగా పోటీ చేసి ఇన్ని సీట్లు ఏనాడూ సాధించలేదని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలు, పార్లమెంటు ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలిచామని తెలిపారు. మోదీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు ఇది నిదర్శనమని వివరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 14 శాతం వోట్లతో 8 చోట్ల ప్రజలు తమను గెలిపించుకున్నారని తెలిపారు. సరిగ్గా 6 నెలల తర్వాత జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో 35 శాతం వోట్లతో 8 పార్లమెంటు సీట్లలో గెలిపించారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ సరైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని, దీనికి ప్రజల వోటింగే నిదర్శనమన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వోట్ల శాతం 39 శాతం కాగా.. ఇప్పుడది 40 శాతానికి పెరిగిందని, 6 నెలల తమ పాలనకు రెఫరెండంగా ప్రకటించుకున్న కాంగ్రెస్‌ కేవలం ఒక శాతం వోటును మాత్రమే అదనంగా పొందిందని, అదే సమయంలో  తమ వోటు శాతం రెండున్నర రెట్లు పెరిగిందని కిషన్‌ రెడ్డి తెలిపారు.

2014 ఎన్నికల్లో 8.5 శాతంతో 20 లక్షల 40 వేల 360 వోట్లు సాధించాంమని, 2019 ఎన్నిలకల్లో  19.65 శాతంతో 36 లక్షల 26 వేల 173 వోట్లు సాధించామన్నారు. 2024 లోక్‌ సభ ఎన్నికల్లో  35.08 శాతంతో 76 లక్షల 47 వేల 424 వోట్లు సాధించామని, ఐదేండ్లల్లో బీజేపీకి 40 లక్షల వోట్లు పెరిగాయని వివరించారు. కొత్తగా 14 లక్షల కుటుంబాలకు పైగా బీజేపీకి అండగా నిలిచాయన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ తమ ఉనికిని కోల్పోయిందని, బీఆర్‌ఎస్‌ 14 చోట్ల 3వ స్థానానికే పరిమితమైందని, 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్‌ తప్ప మిగిలిన చోట్ల మూడో, నాలుగో స్థానానికి పడిపోయిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్థానాలు గెలిచిన చోట్ల కూడా ఈసారి వోట్లు తగ్గాయని, ఆయా స్థానాల్లో బీజేపీ పుంజుకుందని కిషన్‌ రెడ్డి వివరించారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఆరంభం మాత్రమేనన్నారు. విద్యావంతులు, కవులు, ఉద్యమకారుల ఆకాంక్ష కూడా ఇదేనని, గత పదేళ్లలో 10 లక్షల కోట్ల నిధులతో తెలంగాణలో మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని తెలిపారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో తాము 8 చోట్ల గెలిచామని, మరో 6 చోట్ల రెండో బలమైన ప్రత్యామ్నాంగా నిలిచామని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో తమ పార్టీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారని, రేవంత్‌ రెడ్డి సామ, భేద, దాన, దండోపాయాలు  ప్రయోగించినా..తమ అభ్యర్థిపై అసభ్య పదజాల ప్రయోగించినా..బీజేపీ కార్యకర్తలను బెదిరించినా..ప్రజలు బీజేపీకే పట్టం గట్టారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గతంలో రేవంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన..మల్కాజ్‌గిరిలో తమ పార్టీ నేత ఈటల దాదాపు 3.5 లక్షల మెజారిటీతో గెలిచారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌ సొంత జిల్లాలోనూ తమ అభ్యర్థి రఘునందన్‌ రావు గెలిచారని, గజ్వేల్‌, సిద్ధిపేట, బీఆర్‌ఎస్‌ కంచుకోట మెదక్‌లో.. వందల కోట్లు ఖర్చుపెట్టినా.. బీజేపీయే ఘన విజయం సాధించిందని, ఇది రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తుకు సంకేతమని కొనియాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ..మాజీ సీఎం,  సీఎం ఇద్దరినీ కామారెడ్డి అభ్యర్థి వెంకట రమణారెడ్డి ఓడిరచారని గుర్తుచేశారు.

నిజామాబాద్‌ లోనూ పసుపుబోర్డు విషయంలో ఎన్నో విమర్శలు చేశారని, అయినా ప్రజల బలంతో తమ అభ్యర్థి అరవింద్‌ విజయం సాధించారని కిషన్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ ఎన్నికల్లో విషప్రచారం చేసిందని, బీజేపీ గెలిస్తే.. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు తొలగిస్తారని ప్రచారం చేశారని, ఏకంగా కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా వీడియోను కూడా మార్ఫింగ్‌ చేశారని, కాంగ్రెస్‌ ఇంత దిగజారినా.. ప్రజలు బీజేపీ వైపే నిలిచారని, మరింత కష్టపడి పనిచేయాలని తెలంగాణ ప్రజలు ఆదేశించినట్లుగా తాము భావిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని, 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యం లభించిందని, బీజేపీ రెండో స్థానంలో ఉన్న మరో 6 చోట్ల కూడా.. వోట్ల తేడా చాలా తక్కువగా ఉందని తెలిపారు.

ఈ 8 సీట్ల పరిధిలో, రాష్ట్రవ్యాప్తంగా..47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచామని చెప్పారు. మల్కాజ్‌గిరి పరిధిలో 7 స్థానాలకు 7 చోట్ల అధిక్యం ప్రదర్శించామని, చేవెళ్లలో..7 స్థానాలకు 6 చోట్ల, కరీంనగర్‌లో 7 స్థానాలకు 6 చోట్ల, ఆదిలాబాద్‌లో 7 స్థానాలకు 6 చోట్ల, నిజామాబాద్‌లో 7 స్థానాలకు..5 చోట్ల, సికింద్రాబాద్‌లో 7 స్థానాలకు 5 చోట్ల, మహబూబ్‌నగర్‌లో 7 స్థానాలకు 4 చోట్ల, మెదక్‌లో 7 స్థానాలకు..2 చోట్ల, నాగర్‌కర్నూల్‌లో 7స్థానాలకు..ఒక చోట, వరంగల్‌లో.. 7 స్థానాలకు..ఒకచోట, హైదరాబాద్‌లో 7 స్థానాలకు.. ఒకచోట, పెద్దపల్లిలో 7 స్థానాలకు..ఒకచోట అధిక్యంలో ఉన్నామని తెలిపారు. ఏమైనా లోపాలుంటే..సరిదిద్దుకుంటామని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ..వొచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పడేందుకు కృషిచేస్తామన్నారు. చేవెళ్లలో ఒక్క వికారాబాద్‌లో కేవలం ఐదువేల వోట్లు మాత్రమే వెనుకబడ్డామని, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ ముసుగులో మజ్లిస్‌ పార్టీకి పనిచేసిందని, నాంపల్లి నియోజకవర్గాన్ని గమనిస్తే..ఈ విషయం స్పష్టమవుతుందన్నారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ బలహీనపడటం, ఆర్నెల్లలో కాంగ్రెస్‌పై తీవ్రమైన వ్యతిరేకత వొస్తున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొందని, ఈ పరిస్థితుల్లో ప్రజలో బీజేపీని ప్రత్యామ్నాయంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నుంచే.. దేశవ్యాప్తంగా ఎన్నికలకు అవసరమైన డబ్బులను వసూలు చేశారని, ఆర్టీసీ ఉచిత బస్సు తప్ప ఏవీ అమలు కావడం లేదని, ఇచ్చిన హామీల అమలుకు వనరులను కాంగ్రెస్‌ నేతలు ఎలా సమకూర్చుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ మోసాలను నిలదీస్తామని, ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తామని కిషన్‌ రెడ్డి చెప్పారు. అటు ఆంధప్రదేశ్‌లోనూ చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలో..ఎన్డీయే కూటమి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించిందన్నారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురికి, ఏపీ ప్రజలకు కిషన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

దేశవ్యాప్తంగా కూడా బీజేపీ గణనీయమైన ఫలితాలను సాధించిందని, మూడోసారి ప్రధాని పీఠాన్ని మోదీ కైవసం చేసుకొని హ్యాట్రిక్‌ పీఎంగా ఘనత సాధించారని కొనియాడారు. సొంతగా బీజేపీ 241 సీట్లు గెలవడం..ఎన్డీయే 293 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటం సంతోషకరమని అన్నారు. దిల్లీ, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌.. వంటి రాష్ట్రాల్లో క్లీన్‌ స్వీప్‌ చేయడం.. గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ మొదలైన రాష్ట్రాల్లో 1 స్థానం మినహా మిగిలిన అన్ని సీట్లను కైవసం చేసుకోవడం..మోదీ గ్యారంటీపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. ఒడిశాలోనూ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నామని,  అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు అధికారంలోకి వొచ్చాయని చెప్పారు. రామమందిరం రాజకీయ పరమైన అంశం కాదని, దేశవ్యాప్తంగా చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆధారంగానే తాము ఎన్నికలకు వెళ్లామని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటానని చెప్పారు. ఎన్నికల్లో సహకరించిన మీడియా ప్రతినిధులకు మిగతా అందరికీ ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *