రాష్ట్రంలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం

  • రెండో రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు
  • నామినేషన్లు వేసిన పోచారం, పొంగులేటి, దుద్దిళ్ల, రాజాసింగ్‌ ‌సహా పలువురు ముఖ్య నేతలు
  • పాతబస్తీలో జోరుగా ఎన్నికల ప్రచారం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 4 : ‌తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల సందడి కనిపిస్తుంది. రెండో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారులకు తమ నామినేషన్‌ ‌పత్రాలను సమర్పించారు. ప్రధాన పార్టీల్లో టికెట్‌ ‌ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. తొలిరోజు 94 నామినేషన్లు నమోదు కాగా.. ఇవాళ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్పీకరం పోచారం శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్‌ ‌వేశారు. 1994 నుంచి వొస్తున్న ఆనవాయితీ ప్రకారం తన పాత అంబాసిడర్‌ ‌కారులో వెళ్లి..బాన్సువాడ ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్‌ ‌వేశారు. నామినేషన్‌కి బయలుదేరే ముందు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. 1994 నుంచి ఇప్పటి వరకూ 8 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచిన పోచారం..ఈ సారి కూడా గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌కి చాలా స్థానాల్లో పోటీనే లేదని సర్వేలు చెబుతున్నాయి..కేసీఆర్‌ ‌హ్యాట్రిక్‌ ‌సీఎం కావడం ఖాయమని పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.ఖమ్మం జిల్లా పాలేరులో కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్‌ ‌వేశారు.

పొంగులేటి తరపున ఆయన సోదరుడు సోదరుడు ప్రసాద్‌ ‌రెడ్డి..నామినేషన్‌ ‌పత్రాలను అధికారులకు సమర్పించారు. మంథని కాంగ్రెస్‌ అభ్యర్థిగా దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు నామినేషన్‌ ‌దాఖలు చేశారు. మంథని మండలం కన్నాల గ్రామంలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నామినేషన్‌ ‌వేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. వికారాబాద్‌ ‌జిల్లా తాండూరులో కాంగ్రెస్‌ అభ్యర్థి మనోహర్‌ ‌రెడ్డి నామినేషన్‌ ‌దాఖలు చేశారు. తాండూరు ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ ‌సమర్పించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఏ.చంద్రశేఖర్‌ ‌రావు..నామినేషన్‌ ‌దాఖలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్‌ ‌నామినేషన్‌ ‌వేశారు. గోషామహల్‌ ‌బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేశారు. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్‌ ‌వేశారాయన.

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అనురాగ్‌ ‌టాకూర్‌ ‌హాజరయ్యారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఇప్పటికే ఆయా పార్టీల అగ్రనేతలు వరుస సభలు, సమావేశాలతో దూకుడు పెంచారు. కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో మేము సైతం అంటున్నారు. ఎంఐఎం నేతలు ప్రచారంలో ఎప్పుడూ ముందుంటారనే చెప్పాలి. ఎన్నికలు ఉన్నా లేకపోయినా నిత్యం జనాల్లోనే ఉంటారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకుంటారు. చిన్న చిన్న శుభకార్యాలకు కూడా వెళ్లి ఇంట్లోని కుటుంబ సభ్యుల్లా కలిసిపోతుంటారు. ఇక ఆ పార్టీ అగ్రనేతలు వస్తున్నారంటే కార్యకర్తల్లో జోష్‌ ‌మామూలుగా ఉండదు.ఇక తెలంగాణ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. దాదాపు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. అయితే రెండు స్థానాల్లో సిట్టింగ్‌లను పక్కనపెట్టి కొత్త వారికి అవకాశం కల్పించింది. అంతే కాకుండా నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ అభ్యర్థిని యాకుత్‌పురాకు మార్చారు. ఆ స్థానంలో కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. అలాగే బహదూర్‌పురా, జూబ్లీహిల్స్, ‌రాజేంద్రనగర్‌ ‌నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులపై సందిగ్ధత నెలకొంది.

ఇంత వరకు ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో అభ్యర్థి ఎవరా అన్న దానిపై స్థానికులతో పాటు ఎంఐఎం వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవరిని మారుస్తారు, లేక పాత అభ్యర్థులనే బరిలోకి దించుతారా అన్న సంద్ధిగత నెలకొంది. మిగతా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన చోట ఎంఐఎం అగ్రనేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. రాత్రి సమయాల్లో మీటింగ్‌లతో దూసుకుపోతున్నారు. అయితే కేవలం అగ్రనేతలే కాకుండా ఇప్పుడు వారి కుమారులు సైతం రంగంలోకి దిగారు. దీంతో కార్యకర్తల్లో మరింత జోష్‌ ‌పెరిగింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కుమారుడు సుల్తాన్‌ ‌సలావుద్దీన్‌తో పాటు అక్బరుద్దీన్‌ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్‌ ఒవైసీ తండ్రులతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. పాదయాత్రలు చేస్తూ సెంటర్‌ ఆఫ్‌ అ‌ట్రాక్షన్‌గా మారారు. జనాలు సైతం పెద్ద నేతలను పట్టించుకోకుండా వారి కుమారులను కలిసేందుకే మొగ్గు చూపుతున్నారు. వారితో కరచాలనం చేసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇది వరకు ఎప్పుడూ ప్రచారంలో కనిపించని అసద్‌, అక్బరుద్దీన్‌ ‌కుమారులు ఒక్కసారిగా జనాల్లోకి వచ్చేసరికి ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా వారి వెంట అడుగులు వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *