రణరంగంగా సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌

  • అగ్నిపథ్‌ ఆం‌దోళనకారుల దాడితో బుగ్గి
  • పలు రైళ్లకు, బోగీలకు, వాహనాలకు నిప్పు
  • దాడులతో వాహనాలు ధ్వసం..ప్రయాణికుల పరుగు
  • పోలీసులపైకి పెద్ద ఎత్తున రాళ్లు రువ్విన ఆందోళన కారులు
  • పోలీసుల ఫైరింగ్‌..‌కాల్పుల్లో ఒక్కరు మృతి..ఇద్దరి పరిస్థితి విషమం…పలువురికి గాయాలు
  • కాల్పుల్లో గాయపడ్డ వారికి గాంధీలో చికిత్స : వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
  • సికింద్రాబాద్‌ ‌పరిధిలో పలు రైళ్ల రద్దు..ఎంఎంటిఎస్‌ ‌రైళ్లు రద్దు
  • అల్లర్లతో తమకు సంబంధం లేదన్న ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్‌
  • ఆం‌దోళనకారులను చర్చలకు ఆహ్వానించిన పోలీసులు..అంగీకరించని ఆందోళనకారులు
  • రాత్రి 7 గంటల ప్రాంతంలో పోలీసుల అదుపులోకి స్టేషన్‌..‌రైళ్ల పునరుద్ధరణ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌సికింద్రాబాద్‌ ‌స్టేషన్‌ ‌రణరంగంగా మారింది. అగ్నిపథ్‌తో తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్‌ ‌స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు. ఒక్కసారిగా విరుచుకు పడిన విద్యార్థులతో రైల్వే స్టేషన్‌ ‌ప్రాంగణం, ప్లాట్‌ఫామ్స్‌ల దగ్గర యుద్ధవాతావరణం నెలకొంది. అరంగట పాటు కొనసాగిన ఆందోళనతో రైలు బోగీలు మంటల్లో మాడిమసయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకుని వొచ్చేందుకు రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులపై పోలీసులు 15 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఆందోళనకారులకు గాయాలయ్యాయి. ఈ కాల్పల్లో ఇద్దరు మృతిచెందారు. ఆందోళనకారుల  దాడిలో పార్సిల్‌ ‌కార్యాలయంలో ఉన్న బైకులు, ఇతర సామన్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.

రైల్వేట్రాక్‌, ‌ప్లాట్‌ఫామ్‌లు గందరగోళంగా మారిపోయాయి. వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక అక్కడికి వొచ్చిన ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనకారులు స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులపై రాళ్లదాడికి దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఇద్దరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడిన వారిని గాంధీ దవాఖానకు తరలించారు. ఆందోళనకారుల దాడిలో మూడు రైళ్లు ధ్వంసం అయినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పార్శిల్‌ ‌రైలుతో పాటు అజంతా ఎక్స్‌ప్రెస్‌లో 2 బోగిలు దగ్ధం అయ్యాయని, 40 బైక్‌లు కూడా ధ్వంసం చేశారని రైల్వే సీపీఆర్వో రాకేష్‌ ‌వెల్లడించారు.

44 ఎమ్‌ఎమ్‌టీఎస్‌ ‌రైళ్లు రద్దుచేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులపై పోలీసులు టియర్‌ ‌గ్యాస్‌ ‌ప్రయోగించారు. అలాగే రైల్వేస్టేషన్‌లో అధికారులు విద్యుత్‌ ‌సరఫరా నిలిపివేశారు. గాయపడిన వారిని గాంధీ హాసింపటల్‌కి తరలించారు. సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌రక్తసిక్తంగా మారింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లురువ్వారు. అయితే సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌ఘటనకు ఎన్‌ఎస్‌యూఐకి ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్‌ ‌తెలిపారు. ఎన్‌ఎస్‌యూఐ చేస్తుందని విడియాలో వొస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. ఆర్మీ అభ్యర్థుల ఆకస్మిక దాడితో పోలీసులు ఏవి చేయలేకపోయారు. ఏం జరగుతుందో తెలిసేలోపే సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌ అగ్నిగుండంగా మారింది. మూడు ప్లాట్‌ఫామ్‌లలో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. 20 బైక్‌లకు నిప్పు పెట్టారు.

సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌వద్ద విద్యార్థులు బైఠాయించారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ వందల మంది ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి దిగారు. ప్యాసింజర్‌ ‌రైలు, పార్మీల్‌ ‌బోగీలకు, స్టాళ్లకు ఆర్మీ అభ్యర్థులు నిప్పు పెట్టారు. రైళ్లపై రాళ్లు విసరడంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల దాడిలో పలువురు ప్రయాణికులకు  గాయాలయ్యాయి.  నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకునే  ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయిదాటడంతో సికింద్రాబాద్‌ ‌స్టేషన్‌లో అన్ని రైళ్లను అధికారులు నిలిపేశారు. రైల్వేస్టేషన్‌ ‌వద్ద ఆర్టీసీ బస్సులను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

కాల్పుల్లో గాయపడ్డ వారికి గాంధీలో చికిత్స : వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌లో ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకరికి కాలు ఫ్యాక్చర్‌ ‌కాగా, మరొకరికి ఛాతీలో బుల్లెట్‌ ‌దిగింది. ఈ ఇద్దరికి వైద్యులు సర్జరీ నిర్వహిస్తున్నారు. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గాంధీ వైద్యులు స్పష్టం చేశారు.

సికింద్రాబాద్‌ ‌పరిధిలో పలు రైళ్లు రద్దు..ఎంఎంటిఎస్‌ ‌రైళ్లు రద్దు
సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌ఘటనతో రైల్వే శాఖ అప్రమత్తమయింది. సికింద్రాబాద్‌ ‌పరిధిలో పలు రైళ్లను రద్దుచేసింది. పలు రైళ్లను దారిమళ్లించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రైల్వే అధికారులు హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ ‌రైళ్లను రద్దుచేశారు. మొత్తం 44 ఎంఎంటీఎస్‌ ‌సర్వీసులను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు సికింద్రాబాద్‌-‌ధన్‌పూర్‌, ఈస్ట్‌కోస్ట్ ‌రైళ్లను క్యాన్సల్‌ ‌చేశారు. ఇప్పటికే సికింద్రాబాద్‌-‌ధన్‌పూర్‌, ‌హైదరాబాద్‌-‌షాలిపూర్‌ ఈస్ట్‌కోస్ట్ ‌రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.  కాచీగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. స్టేషన్లలోకి పోలీసులు ఎవరీని అనుమతించడంలేదు. రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించిన పోలీసులు
సికింద్రాబాద్‌ ‌స్టేషన్‌ ‌వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్‌ ‌స్కీమ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనను స్పష్టమైన హావి• వొచ్చే వరకు విరమించే ప్రసక్తేలేదని నిరసనకారులు అంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చర్చలకు ఆహ్వానించారు. 10 మంది ఆందోళనకారుల్ని చర్చలకు పిలిచారు. వారిని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీసర్‌ ‌వద్దకు తీసుకెళ్తామని అన్నారు. అయితే ఆందోళనకారులు మాత్రం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌అధికారి వద్దకు అందరం వొస్తామని పట్టుబట్టారు. లేనిపక్షంలో అధికారినే తమ వద్దకు తీసుకురావాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

అందుకు నిరాకరించిన పోలీసులు అరగంటలో చర్చలకు రావాలని స్పష్టం చేశారు. మరోవైపు ఆందోళనకారుల్ని పోలీసులు నలువైపులా చుట్టుముట్టారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సికింద్రాబాద్‌ ‌స్టేషన్‌ ‌వద్ద భారీగా సీఆర్పీఎఫ్‌, ఆర్పీఎఫ్‌ ‌బలగాలు మోహరించారు.

రాత్రి 7 గంటల ప్రాంతంలో పోలీసుల అదుపులోకి స్టేషన్‌..‌రైళ్ల పునరుద్ధరణ
ఆందోళనకారులు పరిమిత సంఖ్యలో చర్చలకు రావడానికి నిరాకరించడంతో సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు నాలుగు వేల మంది భద్రతా బలగాలు స్టేషన్‌ ‌నాలుగువైపుల నుంచి ఒకే సారి చుట్టు ముట్టి ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించి స్టేషన్‌ను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. దాంతో రాత్రి నడిచే రైళ్లను రైల్వే శాఖ పునరుద్ధరించడంతో రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *