– మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 23: యూరియా కొరత తీర్చడంపై దృష్టి పెట్టడం మానేసి తమ తప్పు లేదన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో యూరియా కొరత లేదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రం ఇవ్వడం లేదని అంటున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు. వీరిద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారు.. ఎవరు అబద్దం చెబుతున్నారో ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 143 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే అందుబాటులో 183 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయని, ఇప్పటికే 155 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయించామని కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే డీఏపీ 45 లక్షల టన్నుల అవసరానికి 49 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని, ఎన్‌పీకే 58 లక్షల టన్నుల అవసరానికి 97 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు నిజమైతే రైతులకు ఎరువులు అందకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దేశం మొత్తంలో ఎరువుల కొరత లేకపోయినా తెలంగాణలో మాత్రం రైతులు ఇబ్బందులు పడుతుండటం రేవంత్ సర్కారు నిర్లక్ష్యాన్ని చూపుతోందని విమర్శించారు. రైతులను మోసం చేయడం మానేసి తక్షణమే అవసరమైన ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.




