- 27న ఎదుర్కోలు, 28న తిరు కల్యాణం….మార్చి 3 వరకు ఉత్సవాలు
- కల్యాణోత్సవానికి హాజరుకానున్న సిఎం కెసిఆర్
- భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దాదాపు ఐదేళ్ల తరవాత ఆలయ విస్తరణతో ప్రధాన ఆలయంలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రధాన ఆలయ ముఖమండపంలో ఆలయ ప్రధానార్చక బృందం వార్షికోత్సవాలకు శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉదయం 10 గంటలకు స్వయంభు నారసింహుడి గర్భాలయానికి ప్రవేశించి స్వామివారి అనుమతితో ఉత్సవాలను ప్రారంభించారు. ముఖ మండపంలో తూర్పు అభిముఖంగా ఉత్సవమూర్తులను చేసి ప్రధాన అర్చక బృందం విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల్లో అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీత, అర్చక బృందం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మార్చి 3 వరకు 11 రోజుల పాటు జరగబోయే ఈ ఉత్సవాల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
విద్యుద్దీపాలకంరణ, రంగురంగుల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 27వ తేదీన ఎదుర్కోలు, 28వ తేదీన సాయంత్రం తిరు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. స్వామి వారి కల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రతి యేటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలను మొదటగా సృష్టికర్త ప్రారంభించడంతో బ్రహ్మోత్సవాలు అన్న పేరు స్థిరపడింది. ఈ ఉత్సవాలతో స్వామిక్షేత్రం 11 రోజుల పాటు ముక్కోటి దేవతలకు విడిదిగా మారుతుందని అర్చకులు చెబుతున్నారు. బ్రహ్మోత్సవ వేళ యాదగిరి వేదగిరి అన్న ప్రాచీన నామాన్ని సార్థకం చేసుకుంటుంది.
ఈ సందర్భంగా సకల దేవతలను శాస్త్రోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా వొస్తున్నది. విశ్వక్సేన పూజలతో మొదలైన ఉత్సవాలు స్వయంభువులకు నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహోత్సవాలకు ముగింపు పలుకుతారు. మొదట ధ్వజారోహణంలో గరుత్మంతుడికి పూజలు నిర్వహిస్తారు. మూడో రోజు నుంచి స్వామివారి అలంకార సంబురాలు జరుపుతారు. ఏడు, ఎనిమిది, తొమ్మిది రోజుల్లో విశేష పర్వాలైన ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, రథయాత్ర నిర్వహిస్తారు. పదో రోజున చక్రతీర్థ స్నానం జరుపుతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1,250 కోట్లు వెచ్చించి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దగా గతేడాది మార్చి 28న ప్రధానాలయం పునఃప్రారంభమైంది. సకల వసతులతో నిర్మించిన ఆలయంలో ఈ ఏడాది అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. భక్తులకు, విఐపిలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని ఇవో జె గీత తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు వివిధ జిల్లాలు, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాలకు వొస్తుంటారు.



