మోసపోతే గోసపడుతావంటున్న పార్టీలు

మమ్మల్నే నమ్మండి… వేరే పార్టీలను నమ్మి మోసపోకండి

 

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)

‘‘తెలగాణ సోదరా..తెలుసుకో నీ బతుకు…. మోసపోతే నీవు గోసపడుతావ’’న్న ఈ పాట గురించి తెలియని తెలంగాణ ప్రజలుండరు. తెలంగాణ తొలివిడుత ఉద్యమంలో ముచ్చర్ల (సంగిరెడ్డి) సత్యనారాయణ పాడిన ఈ పాట నాటి తెలంగాణ ప్రజలందరినీ మేల్కొలిపింది. ఆనాటివరకు తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయమేంటన్న విషయాన్ని ఆ పాట రూపంలో ఆయన వినిపించారు. ఆ పాట ఆనాడు ఎంత పాపులర్‌ అయిందంటే తెలంగాణ గురించి ఏ సమావేశం, సభ జరిగినా ముచ్చర్ల సత్యనారాయణను ఆ పాట పాడకుండా సభికులు విడిచి పెట్టేవారు కాదు. ఆసలు ఆయన కనపడితే చాలు తెలంగాణ ప్రజల్లో ఉత్సాహం ఉరకలు వేసేందంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా జీవితాంతం గోసపడక తప్పదన్నది ఆ పాటలోని సారాంశం. తెలంగాణ ఏర్పడిన పది సంవత్సరాల తర్వాత కూడా ఆదే విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తు చేస్తున్నాయి. అయితే ఆనాడు తెలంగాణ సాధనకోసం పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) మాత్రమే ఈ నినాదాన్ని తీసుకోగా నేడు రాష్ట్రంలోని పార్టీలన్నీ కూడా అదే విషయాన్ని చెప్పడం చూస్తుంటే ఇప్పుడున్నది స్వేచ్ఛాయుత తెలంగాణ కాదా అన్న అనుమానం కలుగుతున్నది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి దాదాపు పదేళ్లు కావొస్తున్నది. ఈ పదేళ్ళ కాలంలో తెలంగాణ ప్రజలు మోసపోయారంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఈ నవంబర్‌ 30న ముచ్చటగా మూడవసారి తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. గత రెండు విడుతలుగా అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)పైన కాంగ్రెస్‌, బిజెపిలు విరుచుకు పడుతున్నాయి. ఈ పదేళ్ళ కాలంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ చేసిందంతా తెలంగాణ విధ్వంసమేంటున్నాయి ఆ పార్టీలు. అన్ని రంగాల్లో అవినీతి తాండ విస్తున్నదని తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఏ ఆశయంకోసమైతే ప్రజలు బలిదానం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఈ పదేళ్ళలో వారి ఆశయాలు నెరవేరకపోగా రాష్ట్రం అప్పుల పాలైందంటూ ఆ పార్టీలు విమర్శిస్తున్నాయి. బిజెపి అయితే బిఆర్‌ఎస్‌ పార్టీకి కొత్త నిర్వచనాన్ని చెప్పింది. బిఆర్‌ఎస్‌ అంటే బ్రష్టాచార్‌ రాష్ట్ర సమితిగా పేర్కొంది. కమీషన్లు, అక్రమాలు, అవినీతి తప్ప ఈ ప్రభుత్వ కాలంలో జరిగింది ఏమీలేదంటోంది. పైగా అవినీతి లెక్కలుకూడా చెబుతోంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కాళేశ్వరంలో నలభై వేల కోట్ల అవినీతి జరిగిందంటున్నాడు. అంతేకాదు, మిషన్‌ కాకతీయలో 22వేల కోట్లు, మియాపూర్‌ భూ కుంభకోణంలో 4వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే ఈ అవినీతిపై కేవలం విచారణ జరిపించడమేకాదు, అవినీతి డబ్బును కెసిఆర్‌నుండి కక్కించి, రాష్ట్రంలో బిసి, ఎస్సీ, ఎస్టీలకు పంచుతామంటూ ఆయన ఎన్నికల హామీ ఇస్తున్నారు. కాగా వోట్ల కోసం బిఆర్‌ఎస్‌ నేతలు టోపీలు పెట్టుకుని నమాజ్‌లో పాల్గొంటున్నారని, వారిని నమ్మి మోసపోవొద్దని ఆ పార్టీ ముఖ్యనేత, కరీంనగర్‌ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్‌ ముస్లిం కమ్యూనిటీని హెచ్చరిస్తున్నారు.

కాగా గత వాగ్ధానాలన్ని తుంగలో తొక్కి కేవలం తనతోపాటు తన కుటుంబ సభ్యులకు అంటే అల్లుడు హరీష్‌రావుకు, కుమారుడు కెటిఆర్‌కు, బిడ్డ కవితకు మాత్రమే ఉద్యోగాలు కల్పించుకున్నాడని బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌పైన కాంగ్రెస్‌ తీవ్రంగా ధ్వజమెత్తుతోంది. నిధులు, నీళ్ళు, నియామకాలన్న తెలంగాణ నినాదాన్ని అటుకెక్కించిన విధానంపైన ఆ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నది. తెలంగాణ కల సాకారం అవుతున్న దశలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్నమాట నిలుపుకోని కెసిఆర్‌ మాటలను నమ్మి మరోసారి మోసపోవొద్దని ఆ పార్టీ ప్రజలను హెచ్చరిస్తున్నది. గజ్వెల్‌లో పేదల భూములను స్వాహా చేసి, ఇప్పుడు కామారెడ్డి భూములపై కన్నువేసిన కెసిఆర్‌ మాటలకు మోసపోతే ఆ తర్వాత గోసపడాల్సి వొస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అక్కడి ప్రజలకు హితోపదేశం చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే విపక్షాల మాయమాటలు విని మోసపోవొద్దని బిఆర్‌ఎస్‌ అంటోంది. మీ బొటనవేలిముద్ర తప్ప పట్టా భూములను ముఖ్యమంత్రి స్థాయివాడు కూడా టాంపరింగ్‌ చేయని విధంగా ధరణి పోర్టల్‌ను రూపొందిస్తే, దాన్ని బంగాళఖాతంలో వేస్తామంటున్న వారిని నమ్మి మోసపోవొద్దని ఆ పార్టీ అధినేత కెసిఆర్‌ ఊరూరా తిరిగి ప్రజలను హెచ్చరిస్తున్నారు. ధరణిని కాదని కాంగ్రెస్‌ భూమాత, బిజెపి మీ భూమి పథకాలను ప్రవేశపెడుతామంటున్నారు. కాని, పట్టాదారుడి అనుమతి లేకుండా ఏ చిన్న సవరింపు కూడా చేయడానికి వీలులేని, రైతు బంధు పథకం అమలుకు ఇబ్బందిలేని ఈ పథకం స్థానంలో మరే పథకమైన దిగదుడుపే నంటున్నారు బిఆర్‌ఎస్‌ నేతలు. ఇతర పార్టీ నేతల మాటలు నమ్మితే భూ తగాదాలతోపాటు కరెంటు కష్టాలు నిత్యకృత్యంగా మారుతాయని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. మొత్తంమీద ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతున్న ఈ మూడు పార్టీలతో పాటు బిఎస్పీ లాంటి మరికొన్ని పార్టీలు కూడా ఇతర పార్టీల మాటలు విని నష్టపోవొద్దని, అలా మోసపోతే జీవితాంతం గోసపడక తప్పదని హెచ్చరిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *