పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: 76 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేసి, వారి జీవితాల్లో నవ శకానికి నాంది పలికిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ మైనార్టీల సమ్మేళనానికి ఎమ్మెల్యే జిఎంఆర్, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించి, భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. 65 సంవత్సరాలు పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం బిజెపి పార్టీలో మైనార్టీల సంక్షేమానికి పాటుపడిన దాఖలాలు లేవన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించడంతోపాటు, పూర్తి పారదర్శకతతో పథకాలు రూపొందించారని తెలిపారు. ప్రధానంగా ఆడపిల్లల వివాహాలు పేదవాళ్లకు భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని తెలిపారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 200 పైగా మైనార్టీ గురుకులాలను ప్రారంభించి విద్యార్థి దశనుండే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం జరిగిందని తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి నిధులు అందిస్తూ ఆర్థిక అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు.పటాన్ చెరు నియోజకవర్గం వ్యాప్తంగా సొంత నిధులతో 100కు పైగా మసీదులు ఆశిర్ఖానాలు ఈద్గాలు నిర్మించడంతోపాటు మైనార్టీ ఫంక్షన్ హాళ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో రెండు కోట్ల రూపాయలతో మైనార్టీ ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం రామచంద్రపురంలో మూడు కోట్ల రూపాయలతో ఆధునిక వసలతో ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిర్ణయించిన పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డికి మూడోసారి భారీ విజయాన్ని అందించి పటాన్ చెరు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఐలేష్, సత్యనారాయణ, బిఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు గోవింద్, మాజీ జెడ్పిటిసి జమీల్, మెరాజ్ ఖాన్, కృష్ణకాంత్, సోహైల్, యాదయ్య, లల్లు, కుత్బుద్దీన్, చాంద్, గౌస్, మైనార్టీ మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల ఆత్మబంధువు సీఎం కేసీఆర్





