మహేశ్వరం, ప్రజాతంత్ర సెప్టెంబర్ 9: పదే పదే ప్రోటో కాల్ గురించి మాట్లాడే బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి తాను ఎందుకు ప్రోటోకాల్ విస్మరించారో చెప్పాలని బిఏంసి అల్మాస్ గూడ 4వ డివిజన్ కార్పొరేటర్ సమ్ రెడ్డి స్వప్న వెంక రెడ్డి నిలదీశారు. శనివారం బడంగ్ పేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో స్వప్న వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. 4వ డివిజన్ శిరిడి సాయి నగర్, మధురా నగర్ రోడ్డు నిర్మాణం పనులు జరుగుతుండగా మేయర్ పారిజాత హడావుడిగా వచ్చి, స్థానిక కార్పొరేటర్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శంకుస్థాన చేయడం ఏమిటని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావస్తున్న సమయంలో మేయర్ కొబ్బరి కాయలు కొట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని అనేక సార్లు మేయర్ ను కోరిన స్పందించలేదన్నారు. ఇదే విషయాన్ని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకుపోగా.. వెంటనే స్పందించిన మంత్రి రోడ్డు నిర్మాణం కోసం రూ.26 లక్షలు ప్రత్యేక నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిధులు ఇవ్వకపోగా.. ఎవరు లేని సమయంలో మేయర్ హడావుడిగా వచ్చి తాను ఏదో చేసినట్లుగా కొబ్బరికాయలు కొట్టడం హాస్య స్పందనంగా ఉందన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించడం లేదని పదేపదే ఆరోపణలు చేసే మేయర్, ఒక మహిళ కార్పొరేటర్ విషయంలో ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని మండిపడ్డారు. మేయర్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మేయర్ ప్రోటోకాల్ పాటించకుండా కార్పొరేటర్లను ఎలా అవమానించిందో, మేము కూడా అదే విధంగా వ్యాహరించల్సి వస్తుందని హెచ్చరించారు. తరుచుగా ప్రోటోకాల్ గురించి మాట్లాడే మేయర్ ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. మేయర్ రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తే, మేము కూడా అలానే వ్యవహరించాల్సి వస్తుందని స్వప్న వెంకట్ రెడ్డి హెచ్చరించారు.




