మానవ సంబంధాల పరమార్థం రాఖీ బంధం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ‌తోడబుట్టిన అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముల్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ బంధన్‌ (‌రాఖీ పౌర్ణమి)  పండుగ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుందని సిఎం తెలిపారు. భారతీయ సంస్కృతికి, జీవన తాత్వికతకు రాఖీ పండుగ వేదికగా నిలుస్తుందని  సీఎం తెలిపారు.  రాఖీని రక్షా బంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని అన్నారు. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెల్లు ఆకాంక్షిస్తారని సీఎం తెలిపారు. మానవ సంబంధాలను, కుటుంబ అనుబంధాలను మరింతగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ కొనసాగుతున్నదన్నారు.

మానవీయ పాలనే లక్ష్యంగా అమలు చేస్తున్న పలు పథకాలు వృద్దులు తదితర రక్షణ అవసరమైన వర్గాలకు భరోసానందిస్తున్నాయన్నారు. సంపదను సృష్టించి సకలజనులకు పంచుతూ కొనసాగుతున్న ప్రగతి ప్రస్థానం రాష్ట్ర ప్రజల నడుమ సహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తూ, సహోదర భావాన్ని పెంచుతున్నదని సిఎం అన్నారు. అనేక పథకాలను అమలు చేస్తూ, మహిళలకు  రాష్ట్ర ప్రభుత్వం భరోసానందిస్తూ, పెద్దన్నలా రక్షణగా నిలిచిందని సిఎం అన్నారు.  ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, విజయ ప్రస్థానాన్ని సాగిస్తూ, దేశానికే దిక్సూచిగా నిలిచారని అన్నారు. రాఖీ పండుగను ప్రజలంతా ప్రేమానురాగాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *