రాహుల్ వెంట నడిచిన సినీనటి రియాసేన్
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతున్నది. నవంబర్ 7న తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ప్రవేశించాక అక్కడ కూడా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. పలువురు ప్రముఖులు, శివసేన నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు వేలాదిగా ఆయన వెంట పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్రలో ఇప్పటికే పనీ నటి పూజా భట్, రితేశ్ దేశ్‌ముఖ్, టివి యాక్టర్ సుశాంత్ సింగ్ పాల్గొనగా గురువారం సినీ నటి రియా సేన్ సైతం రాహుల్ గాంధీ భారత్ జోడో రాహుల్ యాత్రలో పాల్గొన్నారు. కాగా రాహుల్ గాంధీ యాత్ర గురువారం పాతూర్ నుంచి మొదలయిన సందర్భంగా రాహుల్ గాంధీ వెంబడి రియాసేన్ కూడా కలిసి నడిచారు.
ఆమె ప్రింటెడ్ ఆరెంజ్-రెడ్ కుర్తా, డెనీమ్ జీన్స్‌లో కనిపించింది. ఇక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సెప్టెంబర్ 7న తలపెట్టిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పూర్తయి ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతున్నది. మహారాష్ట్రలో ఆయన యాత్ర కనీసం 382కిమీ. ఉండనుంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ కార్యవర్గం, నాయకుల్లో ఓ ఆశ నింపడానికి రాహుల్ యాత్ర ఓ ఊతం అవుతుందన్న నమ్మకం పార్టీ శ్రేణుల్లో ఉన్నా తన యాత్ర కేవలం ఎన్నికలను ఉద్దేశించి చేస్తున్నది కాదని, దేశంలో అన్ని వర్గాలను ఏకం చేయాలనే ఆశయంతో చేపట్టినట్టు రాహుల్ పదేపదే స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే.



