తెలంగాణపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటున్న ‘పెద్దన్న’
తెలంగాణలోని ఆదిలాబాద్, సంగారెడ్డి సభల్లో ఆయన చేసిన ప్రసంగమంతా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలపై విమర్శగానే సాగింది. ఈ రెండు చోట్ల కోట్లాది రూపాయల ఆభివృద్ధి, ప్రారంభోత్సవాలను చేసిన ప్రధాని తాను ఎన్నికల ప్రసంగం చేయడంలేదంటూనే విపక్షాలపైన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని, వీటి అవినీతిని అంతమొందించేందుకు అవసరమైతే సర్జికల్ లేదా ఎయిర్ స్ట్రైక్ చేస్తామంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనాత్మకంగా మారాయి. అంటే ఎట్టిపరిస్థితిలో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తామని పరోక్షంగా మోదీ చెప్పాడా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. కేంద్రంతో కయ్యం కన్నా నెయ్యంచేయడంద్వారానే తెలంగాణకు లాభదాయకమన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆలోచనను ఎవరూ కాదనలేరు. కేంద్రంలో ఏ ప్రభుత్వమున్నా ప్రధానితో సత్సంబంధాలు నెలకొల్పుకున్నప్పుడే రాష్ట్రాలు పురోగవృద్ధిని సాధిస్తాయనడంలో అతిశయోక్తిలేదు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.
ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేంద్రం సాక్షిగా చేసుకున్న విభజన హామీలు ఈ దశాబ్ధకాలంగా అమలుకాకుండా నిలిచిపోయాయి. వాటితోపాటు కేంద్రం సాధారణంగా అన్ని రాష్ట్రాలకు కేటాయించే నిధులు అయితేనేమీ, ఇతర పథకాల వితరణ విషయంలో తెలంగాణపట్ల సవతితల్లి ప్రేమను కనబరుస్తున్నదంటూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం కోడైకూసింది. అందుకు ప్రధాన కారణం కేంద్రంలో అధికారంలోఉన్న రాజకీయ పార్టీతో రాష్ట్రంలో అధికారంలోని పార్టీ తీవ్రంగా విభేదించడమే కారణమన్న విషయం తెలియందికాదు. దాని వల్ల కొత్తరాష్ట్రం అభివృద్దిలో కేంద్ర సహాయం లోపించింది. ఏమైతేనేమీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారమార్పిడి జరిగింది. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి కూడా వాస్తవంగా నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో ఉప్పులో నిప్పులానే ఉంది. గత దశాబ్ధకాలంగా ఈ రెండు పార్టీలు పరస్పరం విమర్శనాస్త్రాలను సంధించుకుంటునే ఉన్నాయి. అధికారం కోసం నిత్యపోరాటాలు చేస్తూనే ఉన్నాయి. అయితే రాజకీయాలు వేరు.. పాలన వేరన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పకనే చెప్పారు. తాజాగా ప్రధాని రెండురోజుల తెలంగాణ పర్యటనను పాలకుడిగా ఆయన నేర్పుగా సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పాలి.
గత ముఖ్యమంత్రికి భిన్నంగా రాష్ట్రానికి వొచ్చిన ప్రధానిని స్వాగతించడం, చివరన వీడ్కోలు చెప్పిన విధానం తాము కేంద్రంతో స్నేహాన్ని కోరుకుంటామన్న సంకేతాన్నిచ్చినట్లైంది. అంతేకాదు, గత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు భిన్నంగా ప్రధాని మోదీతో వేదిక పంచుకున్నతీరు కూడా కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏమాత్రం ఘర్షణకు అవకాశంలేదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లైంది. అన్నిటికీ మించి ఆకట్టుకున్నది రేవంత్‌రెడ్డి ప్రసంగం. దశాబ్ధకాలంగా పెండిరగ్లో రాష్ట్ర విభజన హామీలను సాధించుకోవడంలో విఫలమైందని గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడిన రాష్ట్ర కాంగ్రెస్ ఇక్కడ ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా కేవలం రాష్ట్రాభివృద్దికి కావాల్సిన వాటిని వినయంగా విన్నవించుకున్నతీరు రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యపర్చింది. మోదీని ప్రసన్నం చేసుకునే విధంగా ఆయనను ‘పెద్దన్న’గా సంబోధించడం, గుజరాత్ మాడల్‌ను ప్రస్తావించడాన్ని విపక్షాలు విమర్శించినా కార్యసాధన లక్ష్యంగానే ఆయన వాటిని తిప్పికొట్టారు. కాంగ్రెస్ మొదటినుండీ గుజరాత్ మాడల్‌ను విమర్శిస్తున్న నేపథ్యంలో రేవంత్ గుజరాత్ మాడల్ ప్రస్తావన తీసుకువొచ్చి పరోక్షంగా మోదీని ప్రసంసిండ మేనంటున్నాయి విపక్షాలు. అయితే రాష్ట్ర అభివృద్ధి తప్ప తనకు వేరే ఆలోచనలేదంటున్న రేవంత్‌రెడ్డి గుజరాత్లో నర్మదా, సబర్మతి నదుల అభివృద్ది తరహాలోనే తెలంగాణలో మూసీనది పరివాహక ప్రాంత అభివృద్ధికి సహకరించాలని చెప్పేందుకే ఆ ప్రస్తావన చేసినట్లు సమయస్పూర్తిగా సమాధాన మిచ్చారు.
కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరును ప్రధాని మోదీ ఏవిధంగా అర్థంచేసుకున్నారో తెలియదుకాని, ఆయన సహజ ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వంపైన ఘాటైన విమర్శలు గుప్పించి వెళ్ళారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌ను, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ను ఒకే ఘాటిన కట్టేశారు. ఇంతకాలం బిఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటిఎంగా మారిందంటూ ఆరోపిస్తూ వొచ్చిన ప్రధాని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఏటిఎంగా మారిందంటూ తీవ్రాతితీవ్రమైన విమర్షనాస్త్రాన్ని సంధించారు. గత తొమ్మిదిన్నర ఏళ్ళ బిఆర్ఎస్ ప్రభుత్వం తీరుకు విసిగివేసారిపోయిన ప్రజలు కాంగ్రెస్‌కు పట్టంకడితే అదే అవినీతిదారిలో ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతున్నదంటూ ధ్వజమెత్తడం ద్వారా ఆయన కేవలం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాష్ట్రంలో పర్యటించాడన్నది స్పష్టమవుతున్నది. తెలంగాణలోని ఆదిలాబాద్, సంగారెడ్డి సభల్లో ఆయన చేసిన ప్రసంగమంతా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలపై విమర్శగానే సాగింది. ఈ రెండు చోట్ల కోట్లాది రూపాయల ఆభివృద్ధి, ప్రారంభోత్సవాలను చేసిన ప్రధాని తాను ఎన్నికల ప్రసంగం చేయడంలేదంటూనే విపక్షాలపైన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని, వీటి అవినీతిని అంతమొందించేందుకు అవసరమైతే సర్జికల్ లేదా ఎయిర్ స్ట్రైక్ చేస్తామంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనాత్మకంగా మారాయి. అంటే ఎట్టిపరిస్థితిలో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తామని పరోక్షంగా మోదీ చెప్పాడా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కోట్లాది రూపాయలను దోచుకుందని చెబుతున్న కాంగ్రెస్ ఇంతవరకు తీసుకున్న చర్యలేమిటన్నది ఆయన ప్రశ్న. అంటే ఆ అవినీతిలో కాంగ్రెస్ పాత్రకూడా ఉందనుకోవాల్సిఉంటుం దంటాడాయన. వారసత్వ పార్టీలకు దోచుకునే లైసెన్స్ ఏమైనా ఉందా? సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ అవినీతి వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించి అవతల పారేసేందుకు తాను సిద్దంగా ఉన్నానంటూనే, అందుకు వొచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి నాలుగు వందల స్థానాలకు పైగా ఇచ్చి గెలిపించాలంటూ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసిన తీరుపైన కాంగ్రెస్, సిపిఎం నాయకులు ఘాటుగానే స్పందిస్తున్నారు. పిఎం రాక సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి చూపించిన మర్యాదను ఆయన నిలబెట్టుకోలేదని ఇబ్రాహింపట్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి విచారం వ్యక్తంచేశారు. కెసిఆర్ భూ అక్రమాలు, అవినీతిపై చేసిన ఫిర్యాదులను కేంద్రం ఇంతకాలంగా ఎందుకు పట్టించుకోలేదంటూ ఆయన ప్రతి సవాల్ విసిరారు. దీన్నిబట్టి బిఆర్ఎస్, బిజెపిలిద్దరు తోడుదొంగలనుకోవాల్సి వొస్తుందని రెడ్డి అంటే, గతంలో ఇచ్చిన హామీలేవి అమలుచేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నిస్తున్నారు. ఆదిలాబాద్`ఆర్మూర్ రైల్వేలైన్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయం, నిజాంపేట`బీదర్ రహదారి, మెదక్`సంగారెడ్డి రైల్వేలైన్, సంగారెడ్డిలో కేంద్రీయ విద్యాలయం ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమున్నాయంటూ, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోదీ ఈ సభలకు శ్రీకారం చుట్టారన్న విమర్శచేశారు.
-మండువ రవీందర్రావు
సీనియర్ జర్నలిస్ట్
-మండువ రవీందర్రావు
సీనియర్ జర్నలిస్ట్





