వాతావరణ శాఖ అంచనా
పలు ప్రాంతాల్లో ఇంకా తగ్గని ఎండవేడిమి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : మరో రెండు రోజుల తర్వాత తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు రావొచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. గత నెల 29 న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు తెలంగాణలోకి ఈ నెల 8 నాటికి ప్రవేశిస్తాయని ఈ శాఖ ముందుగా వేసిన అంచనాలు తప్పాయి. వాతావరణశాఖ రాష్ట్ర అధికారి శ్రావణి మాట్లాడుతూ….ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పలు ప్రాంతాల్లో అయిదారు డిగ్రీలు అదనంగా పెరగడంతో అధిక వేడి, ఉక్కపోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
నైరుతి రుతుపవనాల రాకలో ఆలస్యం కారణంగా జూన్ రెండోవారంలోనూ ఈ పరిస్థితి కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణకు రుతుపవనాలు రావాలంటే ముందుగా కర్నాటక, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురవాలి కానీ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నాయని, తెలంగాణలోనే అక్కడక్కడ చిరుజల్లులు, అసాధారణ ఎండలతో మిశ్రమ వేడి వాతావరణం ఉన్నట్లు శ్రావణి తెలిపారు. మరో 2 రోజుల తర్వాత తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు రావొచ్చని తాజా అంచనా వేశారు.


