మ‌రో అగ్ర‌నేత‌ను కోల్పోయిన మావోయిస్టులు

– ఎన్‌కౌంటర్‌లో కేంద్ర క‌మిటీ స‌భ్యుడు  సింహాచలం మృతి
– నంబాల త‌ర్వాత నెల‌లోపే మ‌రో కీల‌క నేత‌ హ‌తం
– మ‌రికొంద‌రు మావోయిస్టులు మృతి?
– వ‌రుస దెబ్బ‌ల‌తో ప‌త‌న ప‌థంలో మావోయిస్టులు
– సింహాచ‌లంపై రూ.కోటి రివార్డు:  పోలీసులు

రాయ్‌పూర్‌,‌జూన్‌5: ‌మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రం బీజాపూర్‌ ‌జిల్లాలో జ‌రిగిన‌ మరో భారీ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు టెంటు లక్మీ నరసింహాచలం అలియాస్‌ ‌గౌతమ్‌ ఉన్నారు. ఆయన తలపై రూ. కోటి రివార్డు ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు కీలక మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.జిల్లాలో విస్తరించిన నేషనల్‌ ‌పార్క్‌లో కాల్పులు కొనసాగుతున్నాయి. నేషనల్‌ ‌పార్క్ అటవీ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నట్లు- భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్‌ ‌చేపట్టాయి. ఈ విషయాన్ని గమనించి భద్రతా బలగాలపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి.  ఈ కాల్పుల్లో టెంటు లక్మీ నరసింహాచలం అలియాస్‌ ‌గౌతమ్ మృతిచెందారు. మావోయిస్టు అగ్రనాయకుడు నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌ ‌జరిగిన నెలరోజుల్లోపే బీజాపుర్‌ ‌జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం మృతిచెంద‌డం పార్టీకి కోలుకోలేని దెబ్బ‌. ఈయ‌న‌ సుధాకర్‌గా పార్టీలో ప్రసిద్ధి చెందాడు. అతడికి గౌతమ్‌, ఆనంద్‌, ‌చంటి బాలకృష్ణ రామరాజు, సోమన్న అనే మారు పేర్లు ఉన్నాయి.

ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సుధాకర్‌పై రూ. కోటి రివార్డు ఉంది. 2004లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ఇంద్రావతి -టైగర్‌ ‌రిజర్వ్‌లో మావోయిస్టు సీనియర్‌ ‌నేతలు ఉన్నట్లు భద్రతా దళాలకు పక్కా సమాచారం అందడంతో  డీఆర్‌జీ, ఎస్‌టీ-ఎఫ్‌ ‌దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున దళాలు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ ఆపరేషన్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌ ‌నేలకొరిగారు. బీజాపుర్‌ ఎస్పీ డాక్టర్‌ ‌జితేంద్ర యాదవ్‌ ఈ ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించారు. అయితే సుధాకర్‌ ‌మృతికి సంబంధించి ఎటువంటి ప్రకటను ఆయన జారీ చేయలేదు.

బీజాపుర్‌ అడవుల్లో సెర్చ్ ఆపరేషన్‌ ఇం‌కా కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆరునెలల వ్యవధిలో మావోయిస్టు కేంద్ర కమిటీ-కి చెందిన ముగ్గురు నాయకులను భ‌ద్ర‌తా దళాలు ఎన్‌కౌంటర్‌ ‌చేయడం గమనార్హం. ఇక తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మావోయిస్ట్ ‌పార్టీ మాజీ ప్రెస్‌ ఇన్‌ఛార్జి బండి ప్రకాశ్‌, ‌స్పెషల్‌ ‌జోన్‌ ‌కమిటీ- సీనియర్‌ ‌లీడర్‌ ‌పాపారావు కూడా అక్కడే ఉన్నట్లు తమకు సమాచారం అందినట్లు బస్తర్‌ ఐజీ పి.సుందర్‌ ‌రాజు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్రకాశ్‌ ‌మావోయిస్టుల నియామకాలు, ప్రచారం, దక్షిణ బస్తర్‌లో కార్యకలాపాలను పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతడిపై రూ.25 లక్షల రివార్డు ఉంది.  ఇక పాపారావు  గెరిల్లా యుద్ధ తంత్ర నిపుణుడు. ఉచ్చులు పన్నడంలో దిట్టగా పేరుంది. చాలా ఐఈడీ ఇతర దాడుల్లో అతడు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నాడు.

అతడిపై రూ.20లక్షల రివార్డు ఉంది. వీరిద్దరికి సంబంధించిన సమాచారం వెల్లడి కాలేదు. కేవలం మూడు వారాల వ్యవధిలో అగ్రనేతలను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు ఆపరేషన్‌ ‌కగార్‌ ‌పేరుతో కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా చత్తీస్‌గఢ్‌లో జరిగిన పలు ఎన్‌కౌంటర్‌లలో ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృతిచెందారు. అలాగే ప్రభుత్వం ఎదుట మరికొంతమంది మావోలు లొంగిపోయారు. మరోవైపు ఇంకొంతమంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *