మరోసారి హైదరాబాద్‌ను ఏపి నాయకులు వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. పద్నాలుగేళ్ళ తెలంగాణ పోరాటంలో హైదరాబాద్ మినహా తెలంగాణ ఇస్తే తమకు అభ్యంతరంలేదంటూ వితండవాదం చేసిన ఏపి నాయకత్వం, మరోసారి విభజన హామీల్లో భాగంగా ఉమ్మడి రాజధాని అంశాన్ని పురస్కరించు కుని మరికొంతకాలం హైదరాబాద ్‌పైన తమకున్న హక్కును కొనసాగించుకోవాలన్న డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు. తాజాగా ఏపి అధికార పార్టీ నేత, ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత సమీప బంధువు వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనాయాంశంగా మారాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు కావస్తుండగా, ఎప్పుడో మరిచిపోయిన హైదరాబాద్ అంశాన్ని తిరిగి ముందుకు తీసుకురావడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఏదో ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపిలో వైసిపి అధినేత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, నిన్నటివరకు తెలంగాణలో అధికారంలోఉన్న కెసిఆర్‌తో సత్సంబంధాలున్నాయన్నది ఇరురాష్ట్రాల రాజకీయాలను పరిశీలించినవారెవరైనా ఇట్టే చెబుతారు. అయితే ఈ అయిదేళ్ళ కాలంలో హైదరాబాద్ విషయంపైనా ఏనాడు వ్యాఖ్యానించని వైసిపి ఇప్పుడే ఎందుకు ఆ ప్రకటన చేసిందన్న చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా ఒక పక్క పార్లమెంటు ఎన్నికలు, మరో పక్క ఏపి శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో వైసిపి ఈ ప్రస్తావన తీసుకురావడంలో ఉద్ధేశ్యమేమై ఉంటుందన్నది ఇరు రాష్ట్రాల వారిని ఆలోచింపజేస్తున్నది. 2014 జూన్ 2న రెండు తెలుగురాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు, ఏపికి హైదరాబాద్‌లాంటి రాజధాని లేకపోవడంతో అక్కడ రాజధాని నిర్మాణానికి పదేళ్ళపాటు అవకాశం కల్పించే క్రమంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా వినియోగించుకోవాలని ఆనాడు కేంద్రం విభజన చట్టంలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే పదేళ్లు గడిచిన ఏపిలో రాజధాని ఏర్పాటుకాలేదు.
అందుకు అనేక కారణాలను అ ప్రాంతమే సృష్టించుకుంది. విభజన అనంతరం మొదటిసారిగా అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ అనేక సర్వేలను జరిపి అమరావతి రాజధానికి సరైన ప్రాంతంగా గుర్తించింది. ఆమేరకు 2015లో అక్కడ రాజధాని ఏర్పాటుకోసం భూసేకరణ చేపట్టింది. అనేక వివాదాలు, కోర్టుకేసులు కొనసాగుతున్నప్పటికీ హైదరాబాద్‌లో ఉన్న తమ పాలనా సిబ్బందినంతటినీ అమరావతికి తరలించింది. ముఖ్యంగా ఓటుకు నోటు కేసుతో అధికారుల తరలింపును వేగవంతం చేసింది. తాత్కాలిక నిర్మాణాలతో పాలనను అమరావతినుండే కొనసాగించింది. కాగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినతర్వాత పాలనను వికేంద్రీకరించే ఉద్దేశ్యంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అనాటినుండి ఈ రాజధానుల అంశం వివాదగ్రస్తమైంది. వైఎస్ జగన్ పాలన చేపట్టిన ఈ అయిదేళ్ళలో ఏపి రాజధాని ఏదన్న విషయాన్ని ,చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిరది. ఏపి రాజధానిగా విశాఖ పట్టణాన్ని తీర్చి దిద్దుతామని వైసిపి ప్రభుత్వం చెబుతున్నా, అక్కడ నిర్మాణం విషయంలో అనేక అవరోధాలు ఎదురవుతూ వచ్చాయి.
వివాదం కోర్టు పరిధిలో ఉండటంతో రాజధానిని నిర్మాణం చేయకుండానే జగన్ పదవికాలంకూడా పూర్తి కావస్తున్నది. వాస్తంగా విభజన జరిగిన మొదటి అయిదు సంవత్సరాల్లోనే రాజధాని ఏర్పాటు జరిగిపోవాల్సి ఉండిరదని, దాని నిర్మాణంపట్ల నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని టిడిపి ప్రభుత్వాన్ని దోషుగా చూపిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. తాజాగా వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు అదే అంశాన్ని చెపుతున్నాయి. రాజధాని కట్టే అవకాశం ఉన్న 5 ఏండ్లు తాత్కాలిక రాజధానిపేరుతో టిడిపి కాలయాపన చేసిందని, తమ హయాంలో రాజధాని నిర్మాణానికి ఆర్థిక వనరులు సరిపడా లేనందున, అప్పటికే అభివృద్ధి చెందిన విశాఖలో రాజధాని నిర్మాణం చేస్తున్న క్రమంలో అనేక న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
న్యాయపరమైన చిక్కులు పోయేవరకు హైదరాబాద్‌ను ఉమ్మ డి రాజధానిగా కొనసాగించాలన్న అభిప్రాయాన్ని ఆయన మీడియా ముఖంగా వెల్లడిరచడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆంద్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఏర్పడి దశాబ్దకాలమైంది. ఈ పదేళ్ళకాలంలో ఎవరి పాలన వారు హాయిగా చేసుకుంటున్న తరుణంలో మరోసారి హైదరాబాద్ పేర వివాదం రగిల్చే ప్రయత్నాలేమిటని తెలంగాణవాదులు మ ండిపడుతున్నారు. అయితే విచిత్రమేమంటే ఏపి అధికార పార్టీలోనే బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని ఏపికి చెందిన కొందరు మంత్రులు ఖండిస్తున్నప్పటికీ, అధికార ప్రకటన కాకపోయినా అభిప్రాయంమాత్రం సరైనదేనని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే విభనజ హామీలన్ని నెరవేరలేదు. మరో పక్క కృష్ణా జలాల వివాదం కొనసాగుతున్నది. మరో పక్క అసలు ఏపికి సంబందించి పాలనాపరమైన ఏ ఒక్క కార్యాలయంకూడా ఇక్కడలేదు.
గతంలో ఏపికి ఇచ్చిన కార్యాలయాలనుకూడా తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయడమైంది. ఈ తరుణంలో మరి కొన్ని రోజులు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న అంశాన్ని తెరపైకి తేవడాన్ని ప్రధానంగా బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా రానున్న ఎన్నికల్లో రాజధానిగురించి చెప్పుకోవడానికి ఏమీలేని పరిస్థితితో వైఎస్ఆర్ పార్టీ ఈ కొత్త వివాదానికి తెరతీసిందని ఏపిలోని టిడిపి ఆరోపిస్తున్నది. ఇదిలాఉంటే తిరుపతిని ఏపి రాజధానిగా చేయాలని ఏపి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మరో కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు తిరుపతికి ఉన్నాయంటారాయన.
-మండువ రవీందర్రావు
సీనియర్ జర్నలిస్ట్





