ఆస్ట్రేలియన్ యూనివర్సిటీల అధ్యయన బృందం చేసిన పరిశోధనలో తల్లితండ్రుల తరంతో (పేరెంట్స్ జనరేషన్) పోల్చితే 15-20 ఏండ్ల వయస్సు కలిగిన యువతరం (యంగ్ జనరేషన్)లో మద్యం మక్కువ, ఆల్కహాల్ వినియోగం తగ్గిందనే ఆసక్తికర ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. ఆస్ట్రేలియా, యుకె, యూయస్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన విషయాల్లో భాగంగా యువతరం మద్యానికి ఆసక్తి చూపడంలేదనే ఆశ్చర్యకర విషయం తెలుస్తున్నది. ఆల్కహాన్ దురలవాటు తగ్గించడానికి ప్రభుత్వ ప్రయత్నాలు తక్కువగా ఉన్నప్పటికీ పేరెంట్స్ తరపు సీనియర్ సిటిజన్లతో పోల్చితే యువతరం స్వయం ప్రేరణతో ఆల్కహాల్‌కు దూరంగా ఉంటున్నారని తేలింది.
యువతరం ఆలోచనల్లో మార్పులకు కారణాలు :
సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, సాంకేతిక మార్పులు జరుగుతున్న వేళ యువతరం ప్రాధాన్యతలు మారడంలో భాగంగా యువతరం మద్యం మత్తుకు ఇష్టపడని కారణం ఆల్కహాల్ అలవాట్లు తగ్గాయని విశ్లేషిస్తున్నారు. పరిశోధన బృందం పలు దేశాల యువతరంతో నిర్వహించి ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం నాలుగు ముఖ్య కారణాలతో యువతరం మద్యాన్ని ఇష్టపడడం లేదని తెలుస్తున్నది :
1. భవిష్యత్తు పట్ల అనిశ్చితి, కెరీర్ పట్ల ఆసక్తి :
భవిష్యత్తుపై అనిశ్చితి, ఆందోళనలో యువతరం తమ కెరీర్ పట్ల ఆసక్తితో అధిక సమయం కేటాయించడం, చదువుపై ఏకాగ్రత పెరగడం, భావోద్వేగాలను సమర్థవంతంగా అదుపు చేసుకోవడం, పార్టీలు/ఆల్కహాల్‌లకు తక్కువ సమయం కేటాయించడం, వాతావరణాల్లో వస్తున్న పెను మార్పులు, స్వంత గృహాల కోసం ప్రణాళికలు వేసుకోవడం వల్ల మద్యం వైపు దృష్టి సారించలేక పోతున్నారు.
2. ఆరోగ్యం పట్ల స్పృహ పెరగడం :
శారీరక మానసిక ఆరోగ్యం పట్ల స్పృహ పెరడం, అనారోగ్యంతో ఉజ్వల భవిత ప్రభావితం కావచ్చనే భయాలతో పాటు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాంతులు/స్పృహ కోల్పోవడం లాంటి అసౌకర్యాలు కలుగవచ్చనే భావనలు యువతలో పెరగడం గమనించారు.
3. శాస్త్రసాంకేతిక రంగంలో సమూల మార్పులు :
సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు, విరామ సమయాల్లో వ్యత్యాసాలతో యువతరం ఉద్యోగులు ఆల్కహాల్ పట్ల అనాసక్తతను ప్రదర్శిస్తున్నాను. సాంకేతిక విప్లవంలో మద్యం బ్రాండ్ల ప్రకటనలు ఆసక్తిని రేకెత్తించినా యువత నిగ్రహించుకుంటూ తమ భవిష్యత్తు ప్రణాళికల పట్ల శ్రద్ధ చూపడమనే వాంఛనీయ మార్పును గమనించారు. అంతర్జాల ఆలంభనలతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో వారి ఏకాగ్రత మద్యంపైకి పోవడం లేదని తెలుస్తున్నది.
4. కుటుంబ అనుబంధాల్లో మార్పులు :
తరాల అంతరాలతో తల్లితండ్రులతో పిల్లల అనుబంధాల్లో సమూల మార్పులు బయట పడుతున్నాయి. అధిక తల్లితండ్రులు పిల్లల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలతో యువతరం దృష్టి మద్యానికి దూరం అవుతున్నదని తేలింది. తల్లితండ్రులు అధిక సమయం పిల్లలతో గడపడానికి ఇష్టపడడంతో యువతరం ఏకాగ్రత చదువులు/ఉద్యోగాలపై మాత్రమే పడడం గమనించారు.




