మకర సంక్రాంతి

వాతావరణం చలిగా ఉంటూ..మంచు పడుతూ ఉండే ఈ హేమంత ఋతువు-రాత్రి సమయం ఎక్కువగాను,పగటి సమయం తక్కువగా ఉండే మార్గశిర మాసంలో సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు విజృంభించే అవకాశాలు ఎక్కువ. అందుకనే ఈ మాసంలో వచ్చే సంక్రాంతి పర్వదినానికి వేసే ముగ్గులు,గొబ్బెమ్మలకు ఎంతో ప్రాధాన్యత,శాస్త్రీయత కూడా ఉంది.గొబ్బెమ్మల తయారికి ఉపయోగించే గోమయానికి మరియు గోవు మూత్రానికి ఎన్నో క్రిములను సంహరించే శక్తి ఉండడం.ముగ్గు వేయడం కోసం ఉపయోగించే సున్నం లో,పసుపుకుంకుమలకు కూడ సూక్ష్మజీవులను నిర్మూలించే గుణం కలిగి ఉండడం వలన వాటిని వినియోగిస్తాము. మహిళలు తెల్లవారుజామున లేవడం, నడుమును నేలకంటా వంచి అటు ఇటు కదులుతూ చుక్కలు పెట్టడం,ముగ్గులు వేయడం వలన కాళ్ళ నొప్పులు,ఉదర సమస్యల వంటి బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించడానికి తోడ్పడుతాయి.

ఆవుపేడను ముద్దలుగా చేసి వాటి మధ్యలో గురుగు చేసి వాటిలో ఈ కాలంలో విరగబూసే బంతి పూలతో అలంకరిస్తారు. వీటినే గొబ్బెమ్మలుగా పిలుస్తారు.గోపి అనే సంస్కృత పదం నుండి పుట్టి గొబ్బి అనే పదంగా వాడుకలోకి వచ్చింది.  ఈ గొబ్బెమ్మలకు  పసుపు,కుంకుమ బొట్లను పెట్టి..ముగ్గుల మధ్యలో ఉంచి గోపికలు శ్రీకృష్ణుడి చుట్టూ చేరి సంతోషంగా పాడిన పాటలే గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ ఆలపిస్తారు. హరిదాసులు కూడా తెల్లవారుజామున హరినామ కీర్తన చేస్తూ దర్శనమిస్తారు. వీరు నిష్క్రమించగానే, గంగిరెద్దుల వారు వేంచేస్తారు. శివకేశవులకు భేధం లేదన్నట్లు.. వీరికి సమర్పించే ధాన్యం భగవంతునికి సమర్పించినట్లుగా భావిస్తారు.కాలక్రమంలో సూర్య భగవానుని రథయాత్రలో ప్రధానంగా నాలుగు ఘట్టాలు ఉంటాయి.అవి మేష,కటక,తులా,మకర సంక్రమణాలు. సంక్రాంతి అంటే సంక్రమణం,చేరుట అని అర్థం. కటక సంక్రమణం నుండి మకర సంక్రమణం వరకు గల ఆరు మాసాలు దక్షిణాయణంగా, మకర సంక్రమణం నుండి కటక సంక్రమణం వరకు గల ఆరు మాసాలను ఉత్తరాయణంగా పరిగణిస్తారు.  ఈ సంక్రాంతి పండుగను మూడు రోజులు ఒక్కో పేరుతో తరతరాలుగా మనం నిర్వహించుకుంటున్నాము.

మొదటి రోజు భోగి:  సూర్యుడు ధనూ రాశి నుండి మకర రాశి లోనికి ప్రవేశించబోయే రోజు(సంక్రాంతి)కి ఇది ముందు రోజు. ఈ విషయాన్ని సంకేత రూపంగా తెలియజేస్తూ సూర్యుడు ఇప్పటి వరకు ఉన్న విధంగా కాకుండా,రేపటి నుండి  మరింత వేడిమితో రాబోతున్నాడు అనడానికి నిదర్శనంగా ఈ రోజున పెద్ద పెద్ద మంటల్ని వేస్తారు. ఇంట్లో సంవత్సర కాలం పాటు వ్యర్థంగా పడి ఉన్న అనవసరమైన కర్రలు ఈ మంటలో వేయడం వలన ఇల్లు శుభ్రంగా అవుతుంది.చలి మంటల్లో పాల్గొన్న ఫలితం ఉంటుంది. ఇక ఈ పండుగలో దాగిన రహస్యం ఏమిటంటే… మన శరీరానికి హాని కలిగించే ఎన్నో రకాల క్రిమికీటకాలు (చలి మంచు కి వచ్చి చేరేవి)తమంతట తామే  ఈ మంటల ఆకర్షణకు గురై ఆ మంటల్లో పడి మరణించి పరోక్షంగా మనకు మేలు చేస్తాయి. అలాగే ఈ రోజు సాయంత్రం చిన్న పిల్లలున్న ఇండ్లలో భోగి పళ్ళు పేరుతో పేరంటాన్ని నిర్వహిస్తారు. రేగు పండు కి సంస్కృతంలో అర్కఫలం అని పేరు.అర్క అంటే సూర్యుడు అని అర్థం.ఈ పండు కూడా రంగులో,ఆకారంలో,పేరులో కూడా సూర్యుని పోలి ఉంది.కాబట్టి ఈ రేగుపండ్లనే భోగి పండ్లుగా తల మీదుగా పోస్తూ పిల్లలను ఆశీర్వదిస్తారు. బొమ్మల కొలువు ను కూడా ఏర్పాటు చేస్తారు.

రెండవరోజు సంక్రాంతి:  ఇటు సూర్యుడు కొత్త రాశిలోకి ప్రవేశిస్తూ ఉండడం.అటు ముగ్గులు రమణీయంగా కనిపిస్తూ ఉండడం. అలాగే హరిదాసు కీర్తనలు,గంగిరెద్దు రాకలు,గొబ్బెమ్మలు….. మనమంతా ఆనందంగా ఉన్న సమయాన.. నా బాగోగులు చూడాలనే ఆనందంతో పితృ దేవతలు (మరణించిన పెద్దలు) ఈ రోజు వాయు రూపంతో ఆశీర్వదిస్తారు  అని విశ్వసిస్తారు. అందుకే ఈ రోజున నువ్వులు, నీళ్ళు తర్పణం గా విడుస్తారు. తర్పణం అంటే తృప్తి కలిగించేది అని అర్థం.ఈ మకర సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతను తెలిపే మరో కథనం కూడా ఉంది.ఈ రోజున భీష్మ పితామహుడు తన తండ్రి నుంచి తన ఇష్టానుసారం తనువును చాలించే వరం పొంది ఉన్నాడు  కాబట్టి అంపశయ్యపై పడుకొని, ఉత్తరాయణ కాలంలో మరణించిన వ్యక్తి బంధం విముక్తుడు అవుతారనే విశ్వాసంతో మకర సంక్రాంతి వరకు వేచి ఉండి ఈ రోజుననే తనువును చాలిస్తునట్లు ప్రకటిస్తారు. అంతేకాదు సకల శుభకార్యాలను ఆరంభించే మంచి రోజుగా కూడా పరిగణిస్తారు. పిల్లలు పెద్దలు ఆకాశంలో గాలి పటాలను ఎగురవేస్తారు. ఈ రోజుకు రెండు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ‘ఆది దేవ నమస్తుభ్యం’ అంటూ కొత్త సూర్యునికి స్వాగతం పలుకుతూ, గాలి వీచే దిశలోను మరియు గాలిలోని తేమ పరిమాణంలోను భేధం ఉంటుందని తెలియజేయడం ఒకటైతే.. సూర్య లోకానికి చేరుతున్న లేదా చేరిన పితృదేవతలను ఆహ్వానించడం రెండవది.

గాలిలో ఒక పాములా కనిపిస్తూ గాలి పటాల రూపంలో..శరీరాన్ని విడిచిన జీవుడు అతి సూక్ష్మ రూపంలో అలా ఆకాశం గమనం చేస్తాడు అని కూడా పలువురి విశ్వాసం. పంటలు బాగా పండి ఇంటిలో గాదెలు నిండిన కారణంగా,చేతిలో డబ్బులు ఆడుతున్న కారణంగా కొత్తగా నగానట్రా,పొలం పుట్రా కొనుగోలు చేసేది కూడా ఈ కాలంలోనే.. సూర్య భగవానుని సాక్షిగా ఈ రోజున పొంగలిని చేసి ఆయనకు ఇక్కడి నుండే నైవేద్యం సమర్పించి కుటుంబ సభ్యులంతా దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు.

మూడవరోజు కనుము:    పండుగలో మూడవ రోజు కనుము.కనుము అంటే పశువు అని అర్థం.  మానవ జాతికి చెందిన మనం ఎలాగైతే ఆ భగవంతుని సృష్టి అనుకుంటామో.. అలాగే పశువులు,పక్షులు ఇతర జాతులు కూడా ఆయన యొక్క సృష్టిగానే పరిగణించాలి. ఒక తండ్రి తన సంతానాన్ని ఏవిధంగా అయితే ఎప్పుడూ చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారో.. అలాగే మనకు పొలం విషయంలో దుక్కి దున్నడం మొదలుకొని ధాన్యం ఇంటికి వచ్చేవరకు ఏ పశువు సహాయపడిరదో..ఆ పశు జాతికి పూజచేయడం ఈ రోజు ప్రత్యేకత. తనను కొట్టినా,తిట్టినా కూడా తన యజమాని క్షేమాన్ని కోరుతూ ,తన యజమాని చెప్పినట్లే నడుచుకుంటుంది కాబట్టి మనకు సహాయం పడిన పశువులను కడిగి వాటి కొమ్ములకు పసుపు రాసి, కుంకుమ బొట్లుపెట్టి, పూలదండలు కట్టి,చక్కని మేతని,నీటిని అందిస్తూ వాటిని సంతోషపడేలా చేస్తారు.ప్రతి వ్యక్తి తన పితృ దేవతలను స్మరించడమే నిజమైన సంపదగా భావించి, పితృదేవతలు కాకి రూపంలో వచ్చి తమ నివేదనలను స్వీకరిస్తారని ప్రీతికరంగా పితృదేవతలకు ఇష్టమైన వంటకాలు సమర్పిస్తారు. పశువు ఐనా,పక్షి అయినా తిండి లభించనప్పుడే ఆ ఊరు ను వదిలి పోతుంది.ఈ మాసంలో అన్ని ఇండ్లలో ఆహారం పుష్కలంగా లభిస్తుంది కాబట్టి ఎక్కడికి కదలాల్సిన అవసరం లేదని దీని భావం. అందుకే కనుమ నాడు కాకైన ఊరు కదలదు అనే సామెత జనించినట్లు కథనం. ఈ పండుగ సందర్భంగా చేసుకునే ప్రతి పిండి వంటలలో ఉష్ణాన్ని కలిగించే గుణం ఉన్నటువంటి నువ్వులను శరీరానికి అవసరమైన ఉష్ణం కలిగించడం కోసం  వినియోగిస్తారు. ఇలా మనం నిర్వహించుకునే ప్రతి పండుగలోనూ పురాణ గాథలు,ఆధ్యాత్మిక, వైద్యపరమైన రహస్యాలు దాగి ఉండడం విశేషం.ఈ సనాతన ఆచార సంప్రదాయాలే మానవజాతికి జీవం.

-నరేందర్‌ రాచమల్ల
9989267462

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *