భూమిని కబ్జా చేసిన మంత్రి గంగుల అనుచరులపై చర్యలు తీసుకోవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : అంధుడినైనా తన భూమి కబ్జా చేయడమే కాకుండా మంత్రి గంగుల కమలాకర్ ప్రోద్భలంతో అతని అనుచరులు మహిపాల్, కర్ర రవీందర్ రెడ్డిలు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని, వాళ్ళకు భయపడి హైదరాబాద్ లో తలదాచుకున్నానని బాధితుడు చెట్టి వెంకట్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు తన భార్యతో కలసి మాట్లాడుతూ తాను 2007లో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ పంచాయితీలోని లక్ష్మీపూర్ గ్రామంలో సర్వే నెం.30 ఒక ఒక ఎకరం భూమిని కొనుగోలు చేశానన్నారు. ఇటీవల కుటుంబ అవసరాల కోసం 10 గుంటల ఆస్తిని విక్రయించానని పేర్కొన్నారు. మిగిలి ఉన్న 35 గుంటల భూమి సర్వేయర్లు 06-03-2021న పంచనామ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసి, రాళ్లతో సరిహద్దులు ఏర్పాటు చేసి స్వాధీన పరిచారని చెప్పారు. మంత్రి అనుచరులు తన భూమిలోకి వచ్చి ఇబ్బందులు కలిగిస్తుంటే వారిని రానివ్వకుండా కోర్టులో 2021 లో కేసు వేశానన్నారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేయబడినప్పటికీ భూ కబ్జాదారులు నిస్సంకోచంగా తన భూమిలో ఇళ్ళు కడుతున్నారని తెలిపారు. తనతో పాటు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు చెప్పారు. తన భూమికి రూ.30 లక్షల వెలకట్టి ఇవి తీసుకోని కనిపించకుండా వెళ్లాలని కూడా హుకుం జారీచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు చెప్పినట్లు వినకపోతే తనతో పాటు కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించారని ఆరోపించారు. ఈ విషయంపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ ఎల్లయ్య గౌడ్ రూ.10 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. లోకల్ పోలీసులు మంత్రి గంగుల కమలాకర్ కు వాచ్ డాగ్ లుగా పనిచేస్తున్నారని అన్నారు. తన భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపి తక్షణమే తన భూమి ఇప్పించి రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *