భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

  • రాత్రికి 60 అడుగులు చేరుకునే అవకాశం
  • బాధితులకు సేవలు అందించేందుకు మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ ‌బృందాలు సిద్ధం
  • అత్యవసర పరిస్థితుల కోసం ఆర్మీ హెలీక్యాఫ్టర్‌ ఏర్పాటు

భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 28 : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే రెండుసార్లు పెరుగుతూ తగ్గుతూ వొచ్చిన గోదావరి శుక్రవారం ఉదయం 47.6 అడుగులు ఉఉండగా క్రమంగా మళ్ళీ వేగంగా పెరిగింది. సాయంత్రానికి 52 అడుగులకు చేరుకుంది. ఇది ఇంకా పెరుగుతూ 58 నుండి 60 అడుగుల వరకు పెరుగుతుందని జిల్లా అధికారులు తెలిపారు. వరద ప్రభావంతో రహదారులన్నీ గోదావరి వరద ముంచెత్తింది. భద్రాచలం నుండి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై వరదనీరు వేగంగా ప్రవహిస్తుంది. అలాగే భద్రాచలం నుండి ఆంధ్రా ప్రాంతాలైన కూనవరం, విఆర్‌పురం, చింతూరు ప్రాంతానికి రాకపొకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం వద్ద గోదావరి వరద రోడ్డుపై ప్రవహించటంతో పోలీస్‌ అధికారులు రాకపోకలు నిలిపివేసారు.

60 అడుగులు చేరుకుంటే చాలా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందస్తుగా అత్యవసర సేవల కోసం మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ ‌బృందాలను రంగంలోకి దింపింది. ప్రమాదం జరిగే వెంటనే చర్యలు చేపట్టేందుకు ఒక ఆర్మి  హెలీక్యాఫ్టర్‌ను సిద్దంగా ఉంచారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మణుగూరు, అశ్వాపురం, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపాడు, భద్రాచలం, పినపాక, దుమ్ముగూడెం,చర్ల మండలాల్లో ఇప్పటికే 40 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసారు.

4900 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 60 అడుగులు వచ్చినప్పటికి సమర్ధంతంగా ఎదుర్కోనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్దంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ ‌ప్రియాంక అల విలేకరుల సమావేశంలో తెలిపారు. భద్రాచలం ముంపు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రంలోనే తలదాచుకున్నారు. అధికారులు వారికి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఎగువ ప్రాంతంలో భారీగా వరదనీరు రావడం వలన భద్రాచలం వద్ద గోదావరి వేగంగా పెరుగుతుంది.

ముంపు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రంలోనే ఉండాలి : విలేఖరుల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ‌డా. ప్రియాంక అలా
గోదావరి నీటిమట్టం పూర్తిగా తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు ముంపు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని జిల్లా కలెక్టర్‌ ‌ప్రియాంక అల తెలిపారు. శుక్రవారం నాడు భద్రాచలం సబ్‌కలెక్టర్‌ ‌కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో అత్యవసర సేవలు నిర్వహణకు మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ ‌టీమ్‌లు హెలీక్యాఫ్టర్‌లు సిద్దంగా ఉంచినట్లు తెలిపారు.

ఈ అర్ధరాత్రి గోదావరి వరద 60 అడుగులకు వచ్చే అవకాశం ఉన్నందున రాత్రి వేళలో పునరావాస కేంద్రాలకు తరలింపు పక్రియ ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజలు ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు తరలి రావాలని సూచించారు. సహాయక చర్యలు పర్యవేక్షణకు మండల ప్రత్యేక అధికారులు , మండల అధికారులు పర్యవేక్షిస్తునట్లు కలెక్టర్‌ ‌తెలిపారు. ఇప్పటివరకు 9 ప్రాంతాలలో రవాణా సేవలు నియంత్రణ చేసామని తెలిపారు. రేపటి వరకు రవాణా సేవలు పునరుద్దరణ జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *