‘‘ఎవరో అప్పులు చేయడం ఏమిటి? వారు అప్పు కట్టకపోతే రద్దు చేయడం ఏమిటి? ప్రజల నుంచి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం మాటేమిటి అన్న ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారుల పేర్లును బయటపెట్టినట్లు అనుమానాలున్నాయి. ఆదాయం విషయంలో మొండిగా వ్యవహరించే మోదీ సర్కారు, అప్పులు ఇచ్చే విషయంలో మాత్రం శ్రద్ధ కనబరచకపోవడం ఏమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక తిరోగమన దిశలో దేశం ఉన్న దృష్ట్యా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది.’’
సామాన్య ప్రజలకు రూపాయి రుణం ఇవ్వడానికి సవాలక్ష షరతులు విధించిన ప్రభుత్వ బ్యాంకులు, పేద రైతులు తీసుకున్న రుణానికి న్యాయంగా ఇవ్వాల్సిన రెండు శాతం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అలాగే సంవత్సరం లో కట్టిన వారికి ఒక్క శాతం ప్రాంప్ట్ రి పేమెంట్ ఇన్సెంటివ్ ఇవ్వని బ్యాంకులు ఏకంగా కార్పొరేట్ సంస్థలకు, బడా పారిశ్రామిక వేత్తలకు 11.17 లక్షల కోట్లు రుణాలు రద్దు చేయడం చూస్తుంటే ప్రభుత్వాలు ఎవరి సంక్షేమం కోసం పనిచేస్తున్నాయో తెలియంది కాదు. సాధారణ ప్రజలు బ్యాంకు రుణాలను సకాలంలో కట్టకపోతే నోటీసులు, వేలం, జప్తు, జరిమానాలతో తెగ హడావిడి చేస్తారు. వారిని బ్లాక్ లిస్టులో పెట్టి మిగతా బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తులు అప్పులు పుట్టకుండా చేస్తారు. కానీ లక్షల కోట్లు ఎగవేసిన వారికి మాత్రం ఎటువంటి దండన లేదు సరికదా వారి అప్పులు ఏకంగా రద్దుచేసి రుణగ్రహీతల జాబితా నుంచి తొలగిస్తుండడాన్ని ఏమనాలి..! తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ రుణ ఎగవేతదారులకు సంబంధించి రూ.11.17 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసినట్టు ప్రకటించడం విస్మయం గొలుపుతోంది. ఆదాయం విషయంలో ముందండే మోదీ సర్కార్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.8,16,421 కోట్లు, కమర్షియల్ బ్యాంకులు రూ.11,17,883 కోట్లు గత ఆరేళ్లలో రద్దు చేశాయి. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలోపు కేంద్రం వద్ద ఉన్న సమాచారం. గడిచిన ఆరేళ్లలో దేశంలో బ్యాంకులు రూ.11.17 లక్షల కోట్ల రుణాలు రద్దు చేశాయని పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ ఈ విషయంపై లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం నిరర్ధక ఆస్తులు రద్దు చేయడం వంటి చర్యల ద్వారా రుణాల్ని రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆర్బీఐ డేటా ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.8,16,421 కోట్లు, కమర్షియల్ బ్యాంకులు రూ.11,17,883 కోట్లు గత ఆరేళ్లలో రద్దు చేశాయి. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలోపు కేంద్రం వద్ద ఉన్న సమాచారం. అలాగే రూ.25 లక్షలకుపైగా రుణాల్ని రద్దు చేసిన రుణ గ్రహీతల వివరాల్ని కూడా కేంద్రం వెల్లడించింది. 2017 జూన్ 30 నాటికి పాతిక లక్షలకుపైగా రుణాలు రద్దైన వాళ్లు 8,045 మంది ఉండగా, జూన్ 30, 2022 నాటికి 12,439 మంది ఉన్నారు. ప్రైవేటు బ్యాంకుల్లో జూన్ 30, 2017 నాటికి రూ.25 లక్షల రుణాలు రద్దు చేసిన వారి సంఖ్య 1,616 మంది ఉండగా, జూన్ 30, 2022 నాటికి 2,447 మంది ఉన్నారు. బ్యాంకు మోసాలకు సంబంధించి 515 మందిపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈడీ జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.44,992 కోట్లుగా ఉంది.
సామాన్యుడి దగ్గర ముక్కుపిండి వసూలు
దైనందిన జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకూ కొనుగోలు చేసే ప్రతీ వస్తువు నుంచి జీఎస్టీ వసూలు చేస్తున్నారు, ముక్కుపిండి మరీ బాదేస్తున్నారు. పేద, ధనిక అన్న బేదం లేకుండా అవకాశం ఉన్నచోట ఆదాయాన్ని లాగేస్తున్నారు. అయితే ఇలా అధిక మొత్తంలో వస్తున్న ఆదాయం ఇలా రుణ ఎగవేతదారులకు ఇస్తున్నారన్న ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎదురవుతోంది. సాధరణ ప్రజలకు బ్యాంకు సకాలంలో రుణాలు కట్టనప్పుడు బ్యాంకర్లు తెగ హడావుడి చేస్తారు. సిబిల్ స్కోరు పడితే భవిష్యత్ లో అప్పు పుట్టదంటూ ఆందోళనకు గురిచేస్తుంటారు. సామాన్యుల విషయంలో సవాలక్ష భయాలు పెట్టే బ్యాంకర్లు బడా బాబుల విషయంలో ఎందుకు చూపడం లేదన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోతోంది.
తప్పనిసరిగా రుణాన్ని రద్దు చేయడం అంటే అది ఇకపై ఆస్తిగా పరిగణించబడదు. రుణాలను రద్దు చేయడం ద్వారా, బ్యాంకు తన పుస్తకాలపై నిరర్థక ఆస్తుల స్థాయిని తగ్గించవచ్చు. అదనపు ప్రయోజనం ఏమిటంటే, అలా రద్దు చేయబడిన మొత్తం బ్యాంకు పన్ను బాధ్యతను తగ్గిస్తుంది. రుణగ్రహీత రుణం తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ అయిన తర్వాత మరియు రికవరీకి చాలా తక్కువ అవకాశం ఉన్న తర్వాత బ్యాంకు రుణాన్ని రద్దు చేస్తుంది. రుణదాత డిఫాల్ట్ చేసిన రుణాన్ని లేదా ఎన్పీఏ ఆస్తుల వైపు నుంచి తరలించి, ఆ మొత్తాన్ని నష్టంగా నివేదిస్తారు. రైట్-ఆఫ్ తర్వాత, బ్యాంకులు వివిధ ఎంపికలను ఉపయోగించి రుణాన్ని తిరిగి పొందేందుకు తమ ప్రయత్నాలను కొనసాగించాలి. వారు కూడా బందోబస్తు ఏర్పాటు చేయాలి. లాభం నుండి రాసిన మొత్తం తగ్గించు బడినందున పన్ను బాధ్యత కూడా తగ్గుతుంది. ఏది ఏమైనప్పటికీ, రైట్-ఆఫ్ లోన్ల నుండి రికవరీ అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది RTI ప్రత్యుత్తరం చూపినట్లుగా – ఈ డిఫాల్టర్లకు బ్యాంకులు రుణాలు ఇచ్చిన ఆస్తులు లేదా తాకట్టు గురించి ప్రశ్నలు లేవనెత్తుతుంది. అయితే ప్రభుత్వం తప్పు బ్యాంకర్లపైకి నెడుతున్నది. ఈ పరిస్థితికి బ్యాంకర్ల ఉదాసీనతే దీనికి కారణం అని పత్రిక సమావేశాలు పెట్టి చెబుతున్నారు. ఎవరో అప్పులు చేయడం ఏమిటి? వారు అప్పు కట్టకపోతే రద్దు చేయడం ఏమిటి? ప్రజల నుంచి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం మాటేమిటి అన్న ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారుల పేర్లును బయటపెట్టినట్లు అనుమానాలున్నాయి. ఆదాయం విషయంలో మొండిగా వ్యవహరించే మోదీ సర్కారు, అప్పులు ఇచ్చే విషయంలో మాత్రం శ్రద్ధ కనబరచకపోవడం ఏమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక తిరోగమన దిశలో దేశం ఉన్న దృష్ట్యా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మొండి బకాయిలను, కేటాయి ంపులు జరిపిన నిరర్థక రుణాలను నాలుగేండ్ల తర్వాత బ్యాంకులు వాటి ఖాతాపుస్తకాల్లోంచి రైటాఫ్ చేస్తాయని రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి చెప్పారు. రుణాలు రైటాఫ్ జరిగినా, సంబంధిత రుణగ్రస్తులు రుణాలు చెల్లిం చాల్సిందేనని, రికవరీ ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తాయని వివరించారు.గత నెలలో రూపాయి విలువ బలహీనపడలేదు కేవలం డాలరు విలువ బలపడింది ఇప్పడు రైటాఫ్ చేసిన రుణగ్రస్తులు రుణాలు చెల్లించాల్సిందే అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు సామాన్య ప్రజలకు అర్థం కాక ఆత్మ నిబ్బరం చేసుకుంటున్నారు.
– డా. యం. సురేష్ బాబు,
అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక.




