సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర,జూలై 25; దేశంలో ఎక్కడాలేని విధంగా దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుకునేందుకు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మంగళ వారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 10వేల మంది బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకు సాయం అంటే 10 వేల బీసీ కుటుంబాలకు భరోసాగా నిలుస్తుందన్నారు. ఇతర రాష్ట్రాలలో తమ బిడ్డలను చదివించుకోవటం అంటే బీసీలకు ఎంతో భారంగా ఉండేదని కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో 10వేల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గినట్లేనని చెప్పారు.
తమ బిడ్డలను పై చదువులు చదివించేందుకు పొరుగు రాష్ట్రాలకు పంపించేందుకు పడే తంటాల నుంచి విముక్తి లభించిందని బీసీ కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇది చాలా పెద్ద పనియని ఇలాంటి సాయం ఇంతకు ముందే పాలకుడు చేయలేదని చెప్పారు. కేసీఆర్ బీసీ విద్యకు అదనంగా 150 కోట్లు కేటాయించడం బీసీ బిడ్డల భవిష్యత్ వెలుగులకు పునాదులవుతాయన్నారు. పేద బీసీ బిడ్డలు దేశవిదేశాల్లో ఎక్కడైనా చదువుకునేందుకు వెనుకాడవలసిన పనిలేదని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు.




