బీఆర్ఎస్ తో నా బంధం ముగిసింది

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: 22 ఏండ్ల బీఆర్ఎస్ అనుబంధానికి నీలం మధు ముదిరాజ్ స్వస్తి పలికారు. సోమవారం పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కొత్తపల్లి వేదికగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ పెట్టిన 22 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఒక సైనికుడి లాగా పనిచేస్తూ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేశానని ఆయన తెలిపారు. 2014లో పటాన్ చెరు జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేయడానికి అభ్యర్థులు సైతం లేని సమయంలో పోటీ చేసి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా నా స్వగ్రామం చిట్కుల్ లో రెండు ఎంపీటీసీలను గెలిపించానని అన్నారు. అందులో మా అమ్మ రాధమ్మ ఉన్నారని స్పష్టం చేశారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తన వంతుగా కృషి చేశానన్నారు. గత నాలుగైదు ఏండ్లుగా నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా పార్టీ అభ్యున్నతి కోసం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను విరివిగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లానని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం తన ఆస్తులను సైతం అమ్మి కార్యక్రమాలు నిర్వహించానన్నారు. అయినా బీఆర్ఎస్ పార్టీ కనీసం తన సేవలను గుర్తించకపోవడం, పార్టీ అభ్యర్థిగా ప్రకటించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాల కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రచారం నిర్వహిస్తే ఓర్వలేని  ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తనపై అక్రమంగా కేసులు బనాయించడమే కాకుండా తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం చింపివేశారని అన్నారు. అయినా సమయమనంతో పార్టీ అభివృద్ధి కోసం శ్రమించానని వెల్లడించారు.బహుజన జాతి బిడ్డలు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం వచ్చినప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో  స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి పోటీలో ఉంటున్నట్టు ప్రకటించారు.ప్రజల ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పాదయాత్ర వేదికగా ఆయన ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *