ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతం పెంచాలని, త్వరలో జరుపబోయే జనాభా గణనలో కులాల వారి లెక్కలు తీయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బీసీ డిమాండ్లపై సోనియా గాంధీని కలిసి మద్దతు కోరినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. బీసీల డిమాండ్లపై సోనియా గాంధీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అలాగే బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని, బిసిల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ ను తొలగించాలని డిమాండ్ చేసారు. బిసిలకు పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా ఇవ్వాలని, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియమాకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని కోరారు. అన్ని విషయాలు విన్న సోనియా గాంధీ దీనికి తగు సమయంలో సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేశారని చెప్పారు. సోమవారం పార్లమెంట్ హాల్లో ఉన్న సోనియా గాంధీ కార్యాలయంలో బిసి డిమాండ్లపై వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. జనగణలో కులగనల చేయాలన్న విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున లేఖ రాసినందుకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు గుజ్జ సత్యం తెలిపారు. సోనియా గాంధీని కలిసిన వారిలో విద్యార్థి నాయకుడు జిల్లపల్లి అంజి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వరికుప్పల భాషయ్య తదితరులు ఉన్నారు.




