బిజెపితో ఒప్పందం వల్లనే కమ్యూనిస్టులు దూరం ఎస్.పి.ఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర రాజేష్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 13 :  రాష్ట్రంలో మతతత్వ బిజెపి విస్తరణ అడ్డుకునేందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అభ్యర్థన మేరకు కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారని, అవసరం తీరాక లిక్కర్ స్కామ్ లో కూతురు, కుటుంబాన్ని కాపాడుకునేందుకు బిజెపితో లోపాయకారి ఒప్పందం చేసుకోవటం వల్లనే ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు కెసిఆర్ కు దూరం జరిగారని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్.పి.ఐ) పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర రాజేష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎస్.పి.ఐ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కమిటీ సమావేశం హిమాయత్ నగర్ లో గ్రేటర్ కన్వీనర్ ఎస్.కే.ఆదామ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కెసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను విక్రయించి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మరోసారి మభ్యపెట్టి ఓట్లు వేయించుకునేందుకు బిఆర్ఎస్ కుట్రలు చేస్తున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకున్నదని విమర్శించారు. కొత్త రేషన్ కార్డులు, 57 ఏళ్లు నిండిన వారందరికీ పింఛన్లు, నిరుద్యోగ భృతి డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం లాంటి హామీలను నెరవేర్చలేదని ప్రశ్నించారు. ధరణి పేరుతో ప్రజల భూములను కొల్లగొడు తున్నారని ఆరోపించారు. ఐదున్నర లక్షల కోట్లు అప్పు చేసి లక్షా ఇరవై వేల కోట్లతో కట్టిన కాలేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు కెసిఆర్ కమిషన్ల కక్కుర్తితో ప్రమాదంలో పడిందన్నారు. ఈ సమావేశంలో ఎస్.పి.ఐ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్.రామచందర్, ఎం.పాండు నాయక్, ఎం.గోవింద్ నాయక్, నవీన్, మల్లేష్, రాజు టేకులపల్లి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *