- చంద్రబాబు తెలంగాణకు రావడానికి అవకాశం
- కేసీఆర్ ఏపిలో అట్రాక్ట్ చేయలేరు…కేసీఆర్‌తో చంద్రబాబు ఆడుకుంటారు
- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : టిఆర్‌ఎస్‌ను…బిఆర్‌ఎస్ పార్టీగా మార్చడంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణను అవమాన పర్చడమే కాకుండా తెలంగాణ వాదాన్ని చంపేశాడంటూ…టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి సోమవారం అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…బిఆర్‌ఎస్ పార్టీతో కేసీఆర్ రాజకీయంగా సక్సెస్ అయ్యే పరిస్థితి ఉండదన్నారు. కేసిఆర్ పార్టీ పేరు నుంచి ‘టి’ తొలగించి తెలంగాణను అవమానించారన్నారు.
బిఆర్‌ఎస్ పార్టీతో కేసీఆర్ ఆంధప్రదేశ్ వెళ్తుండటంతో మొన్నటి వరకు ఆంధ్ర రాజకీయాలకు మాత్రమే పరిమితమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణకు రావడానికి కేసీఆర్ అవకాశం ఇచ్చాడన్నారు. సైలెంటుగా ఉన్న చంద్రబాబును తెలంగాణకు వొచ్చేలా చేసిన సిఎం కేసీఆర్…ఏపిలో అట్రాక్ట్ చేయలేడనీ, కానీ చంద్రబాబు మాత్రం తెలంగాణను అట్రాక్ట్ చేయగలడన్నారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించడంతోనే కేసీఆర్ బలం పోయిందన్నారు. కేసీఆర్‌లో ఎక్కడో ఓ మూలన సమైక్య భావన ఉందనీ, బిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటుతో సిఎం కేసీఆర్ తెలంగాణ వాదాన్ని పూర్తిగా చంపేశాడన్నారు. రాజకీయ బతుకునిచ్చిన చెట్టునే కేసీఆర్ నరికేశాడనీ, కేసీఆర్‌తో ఇక చంద్రబాబు రాజకీయంగా ఆడుకుంటాడన్నారు. కూటములు, పొత్తులపై ముందు ముందు తెలుస్తుందనీ, తెలంగాణలో ఇక సీరియస్ పాలిటిక్స్ నడుస్తాయనీ, మహారాష్ట్ర, కర్ణాటకకు బిఆర్‌ఎస్ వెళితే టిడిపి కూడా వెళుతుందన్నారు.
మైనారిటీ వెల్ఫేర్‌కు రూ.1500కోట్లు కేటాయించండి…సిఎం కేసీఆర్‌కు లేఖ రాసిన జగ్గారెడ్డి రాష్ట్రంలో మైనారిటీ వెల్ఫేర్ స్కీంకు 1500కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు జగ్గారెడ్డి లేఖ రాశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వొచ్చాక మైనార్టీ లోన్స్ ఇవ్వడం లేదనీ, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో చిరు వ్యాపారులకు లోన్స్ ఇచ్చామనీ గుర్తు చేశారు. ఇటీవల ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్‌కు 120 కోట్లు కేటాయించిందనీ, ఈ నిధులు ఏమాత్రం సరిపోవన్నారు. 120కోట్లు కేవలం 1200మందికి మాత్రమే సరిపోతాయన్నారు. రాష్ట్రంలో మైనారిటీ యువత లక్షల్లో ఉన్నారనీ, ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే 12 కోట్లు కొద్దిమందికే సరిపోతాయనీ, మైనార్టీ కార్పొరేషన్‌కు కనీసం 1500కోట్లు కేటాయించాలని లేఖలో కోరారు. అలాగే అప్లికేషన్ గడువును జనవరి 5 వరకే విధించారనీ, మైనార్టీ కార్పొరేషన్ లోన్ దరఖాస్తు గడువును ఒక నెల రోజులు పెంచాలని సిఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో జగ్గారెడ్డి కోరారు.




