బాలల భారతం భీష్ముడు

బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి

వీరందరికీ భీష్ముడు వేదవేదాంగ విద్వలనూ, శస్త్రాస్త్ర ప్రయోగాలనూ, వాటిని ఉప సంహరించుకునే విధానాన్నీ నేర్పించాడు. యవ్వనం రాగానే వివాహాలు చేశాడు. దుశ్శలకు సింధు రాకుమారుడైన జయద్రధునితో వివాహం జరిగింది. ఒక రోజున మాద్రి పాండురాజువద్ద తనబాధను వ్యక్తం చేసింది. తనకు పిల్లలు లేకపోవడం, ఆమె సవతికి పిల్లలు కలగడం పట్ల ఆమో ఆవేదన వ్యక్తం చేసింది. పాండు రాజు కుంతిని మంత్రాన్ని ఉపదేశించమని కోరాడు. మాద్రి మంత్ర ప్రభావంతో అశ్వనీదేవతలను ఆహ్వానించి నకుల సహదేవులను కన్నది. వసుదేవుడు విప్రవరులను వెంటనిడుకుని శతశృంగ పర్వతం మీదున్న పాండు రాజును కలిసి, పాండు కుమారులకు నామకరణం ఆదిగా సర్వ విధ్యుక్త కర్మలూ జరిపించాడు. మునులు వేదవిద్యలు బోధించగా, రాజర్షి శుక మహారాజు ధనుర్విద్యను బోధించాడు.అర్జునుడు ధనుర్విద్యలో భీముడు గదాచాలనంలో, ధర్మరాజుతో మరాలు విసరడంలోనూ, నకుల సహదేవులు డాలూకత్తలతో యుద్ధం చేయడంలోనూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటు పాండుకుమారులూ అటు ధృతరాష్ట్రుడి సంతానమూ ప్రవర్ధ మానులవుతూవున్నారు.

…..పాండురాజు మరణం……
అర్జునుడికి పద్నాలుగు సంవత్సరాలోచ్చాయి. ఒకనాడు ఇలా జరిగింది. కుంతి వచ్చిన అతిథులకూ, పరిసరాల్లోని మునులకూ భోజనాలు పెడుతున్నారు. ఆ సమయంలో పాండురాజు మాద్రితో వనవిహారం చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పాండురాజు మనస్సు చలిచింది. కామవాంఛ చెలరేగింది. ఎంతగా ప్రయత్నించినా ఇంద్రియవాంఛను నిగ్రహించుకోలేకపోయాడు. మాద్రిని అనుభవించాడు. ఫలితంగా ఆయన ప్రాణవాయువులు అనంతవాయుల్లో కలిసి పోయాయి. మాద్రి ఏడుపు విని కుంతి వచ్చి విషయం తెలుసుకున్నాక, కన్నీరు మున్నీరుగా ఇద్దరూ విలపించారు. అక్కడున్న మునులందరూ వారిని ఓదార్చి ఉత్తరక్రియలకు ప్రయత్నం ప్రారంభించగానే మాద్రి తాను సహగమనం చేస్తానంది.

కుంతిని పిల్లల పోషణాభారం వహించమని కోరింది. కుంతి భర్తృహీనం భరించడం సాధ్యంకాదంది. మునులందరూ బ్రహ్మచర్య నియమంతో భోగాలాలసత్వం విడిచి, ఉప్పూకారం తినకుండా, భర్తనే స్మరించుకుంటూ ఉంటూ పిల్లలను చూసూకోమన్నారు. పాండురాజుతో సహగమనం చేసింది మాద్రి. ఇద్దరి భౌతిక దేహాలూ పంచభూతాల్లో లీనమైపోయాయి. తర్వాత మునులు కుంతీదేవినీ, పాండవులనూ వెంటబెట్టుకుని హస్తినాపురం చేరి ధృతరాష్ట్రునికి అప్పగించారు. నగరంలోని ఆబాలగోపాలం పాండురాజు మరణవార్త విని ఎంతగానో శోకించారు. ధృతరాష్ట్రుడు అనంతకర్మలూ జరిపించి, అస్థినిమజ్జనం చేయించాడు. అంబాలిక, సత్యవతీ, అంబిక అరణ్యానికి పోయారు.
(తరువాయి వొచ్చే వారం…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *