నాకు ఆ వేదవిదుల అనుగ్రహం వుంటే చాలును. చివరి సారిగా చెబుతున్నాను వినుకో పాండవులు ఎంతో శాంత స్వభావులైనా, వారికి కోపం రానీయకు, ఇక నీఇష్టం అన్నాడు.
మరొక పక్కన జూదం సాగిపోతూనే వుంది. కొడుకు గెలుస్తున్నాడని ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషంగా వున్నాడు. ధర్మరాజు ద్రౌపదిని కూడా జూదంలో ఓడిపోయాడు. శకుని అట్టహాసంగా నవ్వుతున్నాడు. ఇంకా అడటానికి నీ దగ్గర ఏమీ మిగిలింది? అంటూ పాచికలతో ఆడుతున్నాడు.
శకుని మాటలు విన్న సుయోదనుడు విదురుని వద్దకు వచ్చి వెంటనే వెళ్ళి ద్రౌపదిని సభకు తీసుకురమ్మన్నాడు. ద్రౌపది తమ దాసి అన్నాడు.
విదురునికి చాలా బాధనిపించింది. సభలోని వారందరూ దీనంగా తలలు దించుకున్నారు. భీష్మ, ద్రోణ, కృప, బాహ్లిక, సోమదత్త, భూరిశ్రవన, సంజయ, అశ్వత్థామ, యుయుత్సు, వికర్ణ ప్రభృతులందరూ వేడివిట్టూర్పులు విడుస్తూ విచారంగా కూర్చుండిపోయారు. విదురుడు ఇప్పటికైనా దుర్వ్యవసాయాన్ని ఆపమన్నాడు. తన చేత్తోనే కాలపాశాన్ని మెడకు చుట్టుకుంటున్నాడని వారించాడు. దుర్యోదనుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పాత్రికామిని పిలిచి ద్రౌపదిని తీసుకుని రమ్మన్నాడు. ప్రభువు ఆజ్ఞప్రకారం ప్రాతికామి వెళ్ళి ద్రౌపదికి తాను వచ్చిన పని చెప్పాడు. ద్రౌపది ఎంతో ఆందోళనకు గురైనది. జూదంలో ఓడటానికి మరేమీలేకనా కట్టుకున్న భార్యను పణం పెట్టాడు అనడిగింది.
అన్నీ పొగొట్టు కున్నాకనే ధర్మరాజు తనను ఓడిపోయినట్లుగా చెప్పాడు. ధుర్యోదనుల వారు తనను వారికి దాసిగా రమ్మన్నారని తెలియజేశాడు. అందుకు ద్రౌపదిలా అంది.
‘ధర్మరాజు నన్ను ముందుగా పందెంలో ఓడిపోయారో లేక ఆయనే ముందు ఓడి నన్ను పణంగా పెట్టారో కనుక్కురా’ నేనిప్పుడు ఏక వస్త్రను. సభాభవనానికి రాకూడదు’ అంది. ప్రాతికామి తిరిగివచ్చి సభలో అదే విషయాన్ని నివేదించాడు. ఆ విషయం ఇక్కడే తేల్చుకుందాం రమ్మను అంటూ నవ్వుతూ ప్రాతికామిని మరలా పంపాడు.
ద్రౌపది కన్నీరు కారుస్తూ మరలా వచ్చిన ప్రాతికామి మాటలకు భయపడి గాంధారి వైపు వెళ్ళింది. ధుర్యోదనుడు ప్రాతకామి వలన పనికాదని తెల్సి దుశ్శాసనుని పిలిచి నువ్వే వెళ్ళి ద్రౌపదిని లాక్కురా అన్నాడు. దుశ్శాసనుడు పరమ సంతోషంతో నాలుగు అంగల్లో ద్రౌపదిని సమీపించి, రాజసూయావభృత స్నానంతో పవిత్రమైన ఆమె జుట్టుపట్టుకుని ఏడుస్తున్నా వినకుండా సభాభవనానికి లాక్కువచ్చాడు. ద్రౌపది తాను ఒక వస్త్రను, రజస్వలను, పెద్దలున్న సభకు రాకూడదని చెప్పినా దుశ్శాసనుడు వినిపించుకోలేదు.
-డా. పులివర్తి కృష్ణమూర్తి




