‘‌బాబు’..ఇక నువు మారవా ..?

మండువ రవీందర్‌రావు:తెలుగుదేశం పార్టీ ఆవిర్భవి ంచేవరకు తెలంగాణ ప్రజలకు వరి అన్నమంటేనే తెలవదట .. తెలంగాణ ప్రజలను జొన్నలు, కొర్రలు, రాగులు తినే దశనుండి వరిఅన్నం తినేస్థాయికి తీసుకువొచ్చింది ఆ పార్టీ వ్యవస్థా పకుడు ఎన్టీ రామారావేనట.. రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎన్టీఆర్‌ ‌రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చేవరకు తెల్లన్నమంటేనే తెలియదట.. ఏదైనా వేడుకలప్పుడు మాత్రమే వరి అన్నం తినేవారట.. పండుగలప్పుడు పండుగ బువ్వ అని, దైవకార్యాలప్పుడు స్వామి బువ్వ అంటూ ప్రత్యేక రోజుల్లో మాత్రమే తెల్ల అన్నం తినేవారన్నది చంద్ర  బాబు ఉవాచ.  ఎన్టీఆర్‌ ‌వొచ్చిన తర్వాతే హైదరాబాద్‌ ‌ప్రజలకు తెల్లవారుజామున మేల్కొనే అలవాటు అబ్బిందని గతంలో చెప్పిన విషయాలు ఇప్పుడు గుర్తుకు వొస్తున్నాయి. హైదరాబాద్‌ అనగానే చంద్రబాబుకు పూనకం వొచ్చినట్లు అవుతుంది.

తెలుగుదేశం పార్టీ అవిర్భవించేవరకు, ముఖ్యంగా తన తొమ్మిదేళ్ళ పాలనలోనే హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు వొచ్చిందన్న విషయాన్ని ఆవు వ్యాసంలా చర్విత చర్వణం గా చెబుతుంటే వినడానికి తెలంగాణ ప్రజలు అలవాటు పడ్డారు. సాఫ్ట్‌వేర్‌ ‌రంగాన్ని తీసుకురావడంద్వారా హైదరాబాద్‌ను హైటెక్‌ ‌సిటీగా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువొచ్చింది తానేనంటూ ఇప్పటికే అనేకసార్లు చెప్పుకొచ్చిన చంద్రబాబు తాజాగా మరోసారి అదే విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణరాష్ట్రం ఆవిర్భవించిన ఈ తొమ్మిదేళ్ళకాలంలో నాటి తెరాస నేటి భారాస ప్రభుత్వం చేసిందేమీలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు హైదరాబాద్‌, ‌సికిందరాబాద్‌ అన్న రెండు నగరాలే ఉండేవి. కాని, టిడిపి కాలంలోనే కొత్తగా సైబరాబాద్‌ను ఏర్పాటు చేసిన ఘనత తమదేనంటాడు చంద్రబాబు నాయుడు. ఈ తొమ్మిదేళ్ళలో హైదరాబాద్‌కు కోట్లాది పెట్టుబడులతో వొచ్చిన పరిశ్రమలన్నీ సైబరాబాద్‌ ఏర్పాటుముందు   దిగతుడుపేనన్నట్లుగా ఉన్నాయి ఆయన మాటలు.

తాను హైటెక్‌ ‌సిటీని ఏర్పాటు చేయకపోతే ఇవ్వాళ సాఫ్ట్‌వేర్‌ ‌దిగ్గజాలు ఇక్కడికి వొచ్చేవా అంటారాయన.  తొమ్మిదేళ్ళుగా తెలంగాణనుండి జండా ఎత్తివేసిన తెలుగుదేశం పార్టీ మరోసారి ఇక్కడ తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు వ్యూహరచన చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రెండుగా విడిపోయినతర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో పదేళ్ళపాటు ఉండే విధంగా విభజన ఒప్పందం ఉన్నప్పటికీ చంద్రబాబు ముందుగానే తన పాలనావ్యవస్థను ఏపికి తరలించుకుపోయాడు. ఒక ఎంఎల్సీ స్థానంకోసం ఎంతకు దిగజారాడన్న విషయం వోటుకు  నోటు విషయంలో బయటపడింది. దీంతో ఇక తెలంగాణలో ఉండలేమన్న నిర్ణయం తీసుకోవడంవల్లే ఏపి ఉద్యోగులంతా వసతులు లేకపోయినప్పటికీ చంద్రబాబు వత్తిడితో ఏపికి తరలి వెళ్ళాల్సివొచ్చింది. గత ఎన్నికల్లో ఏపిలో ఓటమి చవిచూసిన బాబు అక్కడ అధికారపార్టీ రాజకీయాలను తట్టుకోలేకపోతున్న క్రమంలో తెలంగాణలో పార్టీని పునర్నిర్మాణం చేసుకునే ప్రక్రియను ప్రారంభించారు.

రానున్న ఎన్నికల్లోగా పార్టీకి పునర్‌వైభవాన్ని కలిగించేందుకు కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిని ఏర్పాటుచేయడంతోపాటు, ఖమ్మం నడిబొడ్డున పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహిం చడంద్వారా ఇంకా తెలుగుదేశానికి తెలంగాణలో పట్టు ఉందన్న విషయాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేశారు. కాగా, రానున్న ఎన్నికల్లో భావసారూప్యత పార్టీలతో పొత్తుపెట్టుకునే పథక రచన చేస్తున్నారు. ఏపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాస్తవంగా తెలంగాణలో ఆ పార్టీని ఆయన పట్టించుకోవడమే మానివేశారు. దాంతో ఆ పార్టీ నాయకులు, క్యాడర్‌ ‌మనుగడకోసం ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఇప్పుడు వారందరినీ తిరిగి రావాల్సిందిగా ఆ పార్టీ నూతన అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌ ఇటీవల విజ్ఞప్తిచేసిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని బాబుకూడా పునరుద్ఘాటించారు. నాయకులు వలసలు వెళ్ళారుగాని, ఇంకా ప్రజల గుండెల్లో తెదేపా పట్ల అభిమానంతో ఉన్నారన్నారు.

వారందరిని సంఘటితం చేసి,  రానున్న ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంలోభాగంగా ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ‌భవన్‌లో చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అంతా తెలుగుదేశం హయాంలోనే అని మరోసారి తన ఆవు  వ్యాసాన్ని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచింది తెలుగుదేశం పార్టీనే అని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఇవ్వాళ అభివృద్ధి పథంలో నడుస్తున్నదంటే  ఇరవై ఏండ్ల క్రితం తమ పార్టీ వేసిన పునాదులేకారణమంటున్న బాబు, తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డమీద, నేటికి నలభై ఒక సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తున్న టిడిపి తెలుగురాష్ట్రాలకు చారిత్రక అవసరమని,  దాన్ని ఆదరించాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్న చంద్ర బాబు ..ఆంధ్ర ప్రాంతం తెలంగాణా లో విలీనం కు ముందే హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌నిజామ్‌ ‌రాజు ప్రపంచ ధనవంతుల జాబితా లో ఒకరన్న విషయం మరిచిపోతున్నాడు ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *