జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బస్తీ దావఖానాలు జిల్లాలో నిర్లక్ష్యంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం బస్తీ దావఖానాల్లో వైద్య సేవలకు గాను మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, స్విపర్ అనే ముగ్గురు సిబ్బందిని నియమించి వారికి నెలకు రూ. 92 వేల రూపాయలు ఖర్చు చేస్తుంది. వీటి పర్యవేక్షణకు గాను నోడల్ అధికారిగా జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్ కు బాధ్యతలను అప్పగించింది. జగిత్యాల జిల్లాలో 6 బస్తీ దావఖానాలు మంజూరైనప్పటికి కేవలం జగిత్యాల నియోజకవర్గంలో రెండు ప్రారంభమయ్యాయి. లక్షల వెచ్చించి ప్రభుత్వం బస్తి దావఖానాలో రోగుల సౌకర్యార్థం అనేక వసతులు చేసినప్పటికీ వాటిని సిబ్బంది నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. దీంతో బస్తీ దవాఖానాకు వచ్చే రోగులు అసౌకర్యాల మధ్యనే వైద్యం చేయించుకునే పరిస్థితి నెలకొంది. బస్తీ దావఖానాల పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా ఉప వైద్యాధికారికి అప్పగించగా ఆయన సొంత ప్రాక్టీస్ పైనే దృష్టి సారించి బస్తీ దావఖానాల పర్యవేక్షణ పట్ల పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు సమీపంలోగల ఇస్లాంపురాలో ఆగస్టు నెలలో బస్తీ దావఖానను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మైనార్టీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ప్రజలకు ఎల్లవేళలా వైద్య సేవలు అందించడం కోసం ఏర్పాటుచేసిన బస్తి దావఖానలో వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న వైద్యుడు మంగళవారం అందుబాటులో లేడని స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పలువురు పాత్రికేయులు ఆసుపత్రిని విజిట్ చేయగా వైద్యుని కుర్చీ ఖాళీగా( మధ్యాహ్నం 12 గంటలు) కనిపించింది. వైద్యం కోసం ఈ దావఖానకు వచ్చిన చిన్నారులను స్టాఫ్ నర్స్ పరీక్షిస్తూ కనిపించింది. రోగుల దాహార్తి తీర్చడానికి ఏర్పాటుచేసిన వాటర్ కూలర్ మూలన పడేసి ఉంది. దావఖానలో ఇంజక్షన్ వేయడానికి ప్రత్యేక గది ఏర్పాటుచేసినా.. అందులో ఇంజక్షన్ వేయకుండా వదిలివేయగా దీంతో మహిళ రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ పనిచేసే వైద్యుడి గురించి సిబ్బందిని అడుగగా ఒకరు సెలవుల్లో ఉన్నారని, మరోకరు ఇప్పుడే బయటకు వెళ్లారని తెలపడం గమనార్హం.
ప్రభుత్వం ఇచ్చే వేతనం తీసుకోవడం తెల్సు కానీ విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం చేస్తున్న సదరు వైద్యుడు,’’బస్తిలను’’ పర్యవేక్షించే అధికారి తీరుపట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 40 మంది రోగులను స్టాఫ్ నర్స్ పరీక్షించి వైద్యం చేయడం కొసమేరుపు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురా బస్తీ దావాఖాన పరిస్థితి ఈవిధంగా ఉంటే మిగతా వాటిలో ప్రజలకు ఏమేరకు వైద్య సేవలు అందుతున్నాయో స్పష్టమవుతుందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్టాఫ్ నర్స్ రోగులను పరీక్షించి వారికి వైద్యం చేస్తే జరగరాని సంఘటనలు చోటు చేసుకుంటే బాధ్యులు ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. బస్తీ దావఖానల పర్యవేక్షణ అధికారి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాల్సి ఉండగా విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ప్రజల ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైద్యం కన్నా సొంత వైద్యమే ( ప్రయివేటు ) మిన్న అన్న చందంగా వ్యవహారిస్తుంటాడని పర్యవేక్షణ అధికారి తీరుపై ఆరోపనలు వెల్లువెత్తుతున్నాయి.ఇస్లాంపు
అంతేకాకుండా జగిత్యాల అంగడి బజార్ సమీపంలో సొంతంగా క్లినిక్ ఏర్పాటు చేసుకొని నిరంతరం రోగులకు ప్రైవేట్ గా సేవలందించడానికే సమయం కేటాయిస్తారని, ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంటారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బస్తి దావఖాన ఏర్పాటుచేసిన నాలుగు నెలల్లోనే ఇన్ని సమస్యలు తిష్టవేస్తే విటన్నింటికి పర్యవేక్షణ లోపంతోనే రోగులకు వైద్య సేవలు అందడం లేదని చర్చ జోరుగా కొనసాగుతుంది. అధికారులు ఇప్పటికైనా బస్తీ దావఖానలపై దృష్టి సారించి విధుల్లో నిర్లక్ష్యం వహించే వారు ఎంతటి వారైనా వారిపై తగు చర్యలు తీసుకొని బస్తి దావఖానాల్లో మెరుగైన వైద్యం అందించాలని, తద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.



