తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ఏ పార్టీ అధికారంలోకి వొస్తుందన్న అంచనాలు పలు రకాలుగా ఉన్నాయి. ఒక్కో పార్టీదీ ఒక్కో అంచనా. ఆత్మవిశ్వాసం కావొచ్చు. తమను ప్రజలు ఆదరించే పరిస్థితి ఉందని నమ్మకం కావొచ్చు. ఈసారి అధికారం తమదేనని ప్రతి పార్టీ అంటోంది. భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి రావడం ఖాయమని చెబుతుంది. ప్రధాని మోదీ నుంచి కిందిస్థాయి నేతల వరకూ ఈసారి తెలంగాణలో అధికారం తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. నిజంగా భారతీయ జనతా పార్టీకి అంత సీనుందా? తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత బలముందా? లేక క్యాడర్ లో ధైర్యం చెప్పే ప్రయత్నమా? అన్నది ఈ కథనం…
జాతీయ పార్టీగా… దక్షిణాదిన బీజేపీ జాతీయ పార్టీగా కొంత ఇబ్బందులు పడుతుంది. ఆ పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంకు లేదు. ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో కమలం పార్టీ రాణించలేకపోతుంది. ఒక్క కర్ణాటక మినహా మరెక్కడా కాలు మోపడానికి కూడా ఇబ్బందులు పడుతుంది. అలాంటిది గత కొన్నాళ్లుగా తెలంగాణలో బలంగా కనిపిస్తుంది. అనేక చర్యల ద్వారా తెలంగాణలో పార్టీకి భవిష్యత్ ఉందన్న నమ్మకాన్ని కలిగించే విధంగా వాతావరణం ఉంది. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో పాటు డబుల్ ఇంజిన్ సర్కార్ వంటి నినాదాలతో ఇక్కడ నిలదొక్కుకోగలిగింది. రాష్ట్ర నాయకత్వం కంటే ఢల్లీి నాయకత్వాన్ని చూసే ఇక్కడ ఓటు బ్యాంకు అంతో ఇంతో పెరిగిందని చెప్పాలి.
తెలంగాణలో ఒక్క అసెంబ్లీ సీటు నుంచి నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకునే దాకా వెళ్ళింది. మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి షాక్స్ ఇవ్వబోతోంది..? బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుపోటములను కమలం పార్టీయే డిసైడ్ చేయబోతోందా. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అందరి దృష్టీ బీజేపీపైనే ఉంది. ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నది డిసైడ్ చేయబోయేది కమలం పార్టీయే అంటున్నారు విశ్లేషకులు. అందుకు తగిన సమీకరణాలు, లెక్కలను చూపిస్తున్నారు. 2018లో బీజేపీకి ఓట్ల శాతం 6.98 ఉండగా.. 2019 లోక్ సభ ఎన్నికల నాటికి.. అంటే కొన్ని నెలల్లోనే ఆ పార్టీకి 19.65శాతానికి పెరిగింది. ఒక్క అసెంబ్లీ సీటు నుంచి నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకునే దాకా వెళ్ళింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి షాక్స్ ఇవ్వబోతోంది..? బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుపోటములను డిసైడ్ చేయబోతోందా..?
తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం కొంత సానుకూల అంశంగానే చూడాలి. అలాగే అత్యధిక శాతం ఉన్న మాదిగ రిజర్వేషన్ల సమస్య పరిష్కారానికి ప్రధాని మోదీ హామీ ఇచ్చి వారిని తమ వైపునకు తిప్పుకోగలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ నగరంలో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఇందుకు సంబంధించిన కీలక ముందడుగు పడిరది. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామని చెప్పారు. అంబేద్కర్ స్వప్నాన్ని తాము నెరవేరుస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు, సదరు ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు నగరాల్లో బీజేపీ కొంత బలం పుంజుకుందనే చెప్పాలి. ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని నియోజకవర్గాలు.. ఉత్తర తెలంగాణలో బీజేపీ పట్టు సంపాదించుకోగలిగింది. దీంతో గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈసారి పవర్ లోకి రావడం ?ఖాయమని భావిస్తుంది. బీజేపీ అనుకూల, ప్రతికూలతలను ఒకసారి పరిశీలిస్తే…
మూడో వంతు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందని, మిగిలిన స్థానాల్లో అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోరు సాగుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో బీజేపీ 30 సీట్లల్లో గట్టి పోటీ ఇస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో ముథేల్, నిర్మల్, కోరుట్ల, నిజామాబాద్ అర్బన్, హుజూరాబాద్, గోషామహల్, కరీంనగర్ లాంటి సీట్లు ఉన్నాయి. ఈ సీట్లను బీజేపీ గెలుచుకోవడం గానీ లేదంటే గట్టి పోటీ అయినా ఇస్తుందని అంటున్నారు. వీటిని ఏ కేటగిరీ స్థానాలుగా కమలం పార్టీ భావిస్తోంది. ఇక బీ కేటగిరీలో మరో 15 సీట్లు ముక్కోణపు పోరులో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇందులో ముషీరాబాద్, కామారెడ్డిలాంటి స్థానాలు ఉన్నాయి. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నా.. నేను లోకల్ అని బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. మిగిలిన 89 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోరు గట్టిగా నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్థానాల్లో మేమున్నాం అని చెప్పుకోడానికి బీజేపీ, జనసేన గుర్తులు ఈవీఎంలలో ఉంటాయి.
బీజేపీ అధిష్టానం కూడా గెలిచే 30 స్థానాలపైనే గట్టిగా దృష్టి పెట్టిందని అంటున్నారు. వీటిల్లో కనీసం 20 సీట్లు గెలిచి, మరో 10 స్థానాల్లో రెండవ స్థానంలో ఉన్నా.. 2024లో లోక్‌సభ ఎన్నికలకు ఈ వోట్లు పనికొస్తాయనేది బీజేపీ శ్రేణుల ఆలోచన. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 48 స్థానాల్లో బీజేపీ కార్పొరేటర్లు గెలిచారు. వీళ్ళల్లో కొందరు బీఆర్ఎస్లో చేరినా.. హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ సీట్లల్లో సత్తా చాటాలని కమలం పార్టీ భావిస్తోంది. అందుకే ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాతో సిటీ బేస్డ్గా బహిరంగ సభలను కూడా నిర్వహిస్తోంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో తమిళుల జనాభా ఉంది. అందుకే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, స్టార్ క్యాంపెయినర్లతో ఈ ప్రచారం చేయిస్తున్నారు పార్టీ అధ్యక్షుడు నడ్దా. హిందూ ఓటర్లపై ప్రభావం చూపి బలం పెంచి అధికార పీఠానికి చేరువ కావడానికి యు పి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిని వివిధ ప్రాంతాల్లో ప్రచార రంగంలోకి దింపిది జాతీయ పార్టీ. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తనదైన శైలిలో కొన్ని ప్రాంతాలలో విస్తృతంగా దృష్టి కేంద్రీకరించి ప్రచరంలో మునిగి ఉన్నారు. కేంద్ర పార్టీ నాయకులతో సంప్రదిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
రాష్ట్రంలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరగడం తమకే కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడానికి కారణం కూడా ఇదే. తమ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లపై వీరు ప్రభావితం చూపిస్తారన్నది బీజేపీ అధిష్టానం ఆలోచన. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. కోరుట్ల నుంచి పోటీలో ఉన్నారు. జగిత్యాల, నిజాబాద్ అర్బన్ సహా 6 స్థానాల్లో ఆయన ప్రభావం చూపించే అవకాశముంది. అలాగే కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి అక్కడి ఎంపీ బండి సంజయ్ నిలబడ్డారు. ఆయన కూడా తన ఎంపీ స్థానం పరిధిలో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రి నినాదం బీజేపీకి అంతగా కలసి వస్తుందని అనుకోవడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ ఎస్సీల్లో మాదిగ వర్గం ఓట్లు మాత్రం ఈసారి కమలం పార్టీకే పడతాయంటున్నారు. గతంలో బీఆర్ఎస్కే ఓట్లేసిన మైనార్టీలు ఈసారి కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. హైదరాబాద్ తప్ప.. జిల్లాల్లోని ముస్లిం ఓటు బ్యాంక్ కాంగ్రెస్‌కు టర్న్ అయింది. బీఆర్ఎస్ ముస్లింలకు 3 టిక్కెట్లు ఇస్తే, కాంగ్రెస్ ఐదు టిక్కెట్లు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ చీల్చే ఓట్లను బట్టే.. కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఏది అధికారంలోకి వస్తుంది అన్నది తేలుతుందని భావిస్తున్నారు.
అధికార బీఆర్ఎస్ మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 118 స్థానాల్లో పోటీ చేస్తోంది, కొత్తగూడెం సీటును తన కూటమి భాగస్వామి అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి వదిలిపెట్టింది. బిజెపి 111 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపింది, మిగిలిన తొమ్మిది స్థానాలను తన కూటమి భాగస్వామి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ (జెఎస్పి)కి వదిలివేసింది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) 107 స్థానాల్లో, సీపీఐ (మార్క్సిస్ట్) 19 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పోటీ చేస్తుండడంతో కాంగ్రెస్ అభ్యర్థి రాష్ట్ర పార్టీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి కాగా, బీజేపీ అభ్యర్థి కూడా కొంత ఇబ్బంది పెడుతున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్ నుంచి బరిలో ఉండి ముఖ్యమంత్రిని ఊపిరాడకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాజపా తరఫు అభ్యర్థులకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పొరుగు నియోజకవర్గాలపై కూడా భాజపా దృష్టి సారించింది. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉంది. మంత్రి ఇంద్రకరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ నియోజకవర్గంలో బీజేపీ కూడా పోటీలో ఉంది.
బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లు పోటీలో ఉన్నందున త్రిముఖ పోరు తీవ్రంగా ఉండడంతో పాటు వారి ఉనికి పార్టీ క్యాడర్‌ను పెంచే అవకాశం ఉంది. కరీంనగర్, కోరుట్ల, జగిత్యాల, వేములవాడ, హుజూరాబాద్ వంటి కీలక నియోజకవర్గాల్లో బీజేపీ భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. 2020లో హుజూరాబాద్‌లో హైవోల్టేజీ ఉపఎన్నిక జరిగింది, ఇక్కడ ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి క్యాబినెట్ నుండి తొలగించిన తర్వాత, బి ఆర్ ఎస్ నుండి వైదొలిగి, బిజెపిలో చేరి, బిఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా యంత్రాంగాన్ని ఉపయోగించినప్పటికీ, గెలిచారు. అదే రాజేందర్ ఇప్పుడు కె సి ఆర్ తో గజ్వేల్ లో తలపడి గందరగోళం సృష్టిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కూడా ముక్కోణపు పోటీని చూస్తుంది, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ బి ఆర్ ఎస్, బిజెపి మంచి ప్రభావం కనబరుస్తాయి, అయితే ఫిరాయింపుల కారణంగా కాంగ్రెస్ బలమైన నాయకులను కోల్పోయింది.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు అయోధ్య రామయ్య దర్శనానికి ఉచితంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ కారును, కమీషన్ల ప్రభుత్వాన్ని మోడీ గ్యారేజ్ కు పంపించాల్సి సమయం ఆసన్నమైందని, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, భారత్ భవిష్యత్ కోసం బీజేపీ అభ్యర్ధులకు ఓటు వేయాలని అన్నారు. తెలంగాణ లో ప్రజలు ఇచ్చే ఓటు ద్వారా బీసీ ముఖ్యమంత్రి అనే ప్రజల కల నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఎంబీబీఎస్, ఎండీ చదువుకునే విద్యార్థుల కోసం 25శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు.. రాజ్యాంగ విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్ ను తొలగించి దాన్ని బీసీ, ఎస్సీ , ఎస్టీ లకు వర్తింపచేస్తామని అన్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామని హామీ ఇచ్చారు.
వారసులను సీఎం, ప్రధాని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై, సోనియా గాంధీపై మండిపడ్డారు. ఈ ఎన్నికలు మోడీ సుపరిపాలన, కెసిఆర్ అహంకార పాలనకు మధ్య జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరం కుంభకోణం, మద్యం కుంభకోణాలతో పాటుమియాపూర్ భూముల కుంభకోణం బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. బీజేపి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ చేసిన అవినీతి కుంభకోణాలపై దర్యాప్తు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. జనవరి 22నఅయోధ్య లో రామ మందిరం ప్రారంభిస్తామని అన్నారు. రామ మందిరాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపి బలాలు : బీసీ ముఖ్యమంత్రి ప్రకటన బీసీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్ లాంటి వారు ఉండటం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మద్దతు నరేంద్ర మోదీ ఇమేజ్ అర్బన్ లో యువత పార్టీకి అనుకూలంగా ఉండటం హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో బలాన్ని పెంచుకోవడం మోదీ, అమిత్ షాలతో పాటు అగ్రనేతల ప్రచారం
బలహీనతలు : రాష్ట్ర నాయకత్వం బలహీనంగా ఉండటం బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడం జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వరసగా నేతలు పార్టీని వీడటం క్షేత్రస్థాయిలో బలంగా లేకపోవడం ఢల్లీి లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయకపోవడం బీఆర్ఎస్ తో పరోక్ష పొత్తు ఉందన్న ప్రచారం.
-నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్ జర్నలిస్ట్,
98481 28215





