బయో ఫ్యూయెల్‌కు కరువైన ప్రోత్సాహం!

మండిరచినపుడు శక్తిని ఉత్పత్తి చేసే పదార్ధాన్ని ఇంధనం అంటారు. ఇంధన వాడకం నిత్యకృత్యం. వాహనాలు నడవడానికి, విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఇలా ఇంధనం ఎన్నో రకాలుగా ఉపయోగ పడుతున్నది. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు మూడవ వారంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరుపు కుంటారు.
మనం ప్రతిక్షణం ఎన్నోరకాల ఇంధనాలపై ఆధారపడి జీవిస్తున్నాం. నీరు, పెట్రోల్‌, డీజిల్‌, బొగ్గు, విద్యుత్‌, కట్టెపుల్లలు సహా ఎన్నో రకాల ఘన, ద్రవ, వాయు ఇంధనాలు, యురేనియం, థోరియం వంటి అణు రసాయన ఇంధనాలు నిత్య జీవితంతో పెన వేసుకుని పోయాయి. నిత్య జీవితంలో ఇంధనాలుగా ఉపయోగ పడుతున్నాయి.  సంప్రదాయ ఇంధన వనరులైన బొగ్గు, పెట్రోల్‌, డీజిల్‌, అణు ఇంధనాలు ప్రకృతిలో పరిమితంగా మాత్రమే లభిస్తాయి. వాటిని ప్రస్తుతం వినియోగిస్తున్నట్లుగా విపరీతంగా వినియోగిస్తే ప్రమాదం తప్పదు.

అవసరాలకు మించి వినియోగం చేస్తూ పోతే,  భవిష్యత్తు అంధకారమే. అందుకే సంప్రదాయేతర ఇంధన వినియోగం ప్రత్యామ్నాయ మార్గంగా చేసుకోవాల్సిన సమయం ఆసన్న మైంది.పెట్రోల్‌ డీజిల్‌ గ్యాసులకు బదులుగా బయో ఇంధన వనరులను, బయోడీజిల్‌, బయో గ్యాస్‌ వంటి ఇంధన వనరులపై ఆధారపడడం వల్ల భవిష్యత్తు తరాలకు మేలు చేసినవారం అవుతాం.    కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి అంతర్భాగంలో చేరి, భూమి లోపల విపరీతమైన ఉష్ణం, పీడనం కారణంగా మృత జీవజాలం నుండి శిలాజ నూనెలు/బొగ్గు ఏర్పడినవి. శిలాజ నూనెలు లేదా శిలాజ ఘన పదార్థాలను (నేల బొగ్గు వంటివి) తిరిగి సులభంగా పునరుత్పత్తి కావించుటకు సాధ్యం కాదు. అలా తిరిగి శిలాజ ద్రవ్యాలు ఏర్పడాలంటే  మళ్లీ కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది.

అంటే  శిలాజ ఇంధనాలను వాడే కొలది వాడి నిల్వలు తగ్గుతాయి కాని పెరగవు. 19వ శతాబ్ది నుండి శిలాజ ఇంధన వాడకం ప్రపంచ వ్యాప్తంగా పెరిగి పోయింది. పరిశ్రమల్లో బాయిలర్లలో, థెర్మోపవరు ప్లాంటు బాయిలరులో బొగ్గు వాడకం ఎక్కువ. పెట్రోలు, డీజిల్లను ఇంధనంగా వాడు వాహనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అందువలన శిలాజ ఇంధనాల నిల్వలు త్వరగా కరిగి, తరిగి పోతున్నాయి. ఇలాగే శిలాజ ఇంధనాల వాడకం కొనసాగితే కొన్ని వందల సంవత్సరాల తరువాత శిలాజనిల్వలు తరిగి పోతూ, బైకులు, కార్లు, బస్సులు, ట్రక్కులు, విమానాలు, ఓడలు ఏవి కదలవు. మళ్ళి మానవుడు ఎద్దుల బండ్లను, గుర్రపు బళ్ళను, సైకిళ్ళను వాడ వలసి వుంటుంది.  కనుక కొంత మేరకు పెట్రోలియం ఇంధనాల వాడకం తగ్గించే నేపథ్యంలో ఈ జీవ ఇంధనాల వైపు ప్రపంచ దృష్టి మళ్ళింది.

చెట్లగింజల నుండి తీసిన కొన్ని నూనెలు ఆహార యోగ్యం కాదు. ఉదాహరణకు వేప, కానుగ. జట్రోఫా (అడవి ఆముదం, నేపాళం) వంటి అనేక నూనెలు ఆహార యోగ్యం కాదు. ఈ నూనెలను అల్కహోలసిస్‌ అనబడు ఎస్టరిఫికేసన్‌ రసాయన చర్య ద్వారా బయోడీజిల్‌ గా పరివర్తించి,10% వరకు డీజిల్‌లో కలిపి డిజిల్‌ను ఇంధనంగా  వాహనాల్లో వాడటం వలన డీజిల్‌ వాడకాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. డీజిల్‌తో నడిచే వాహనాల్లోని అంతర్గత దహన యంత్రం యొక్క కార్బోరేటరులో తగు మార్పులు చేసిన నేరుగా బయోడిజిల్‌ను వాడవచ్చును. అలాగే డీజల్‌తో నడిచే రైలు ఇంజనులలో బయోడిజిల్‌ను వాడవటం వలన కూడా డీజల్‌ వాడకాన్ని గణనీయంగా తగ్గించ వచ్చు. పశువుల పేడ, మూత్రాలను ఉపయోగించి బయోగ్యాస్‌ ఉత్పత్తి కొన్ని దశాబ్దాలుగా ఉత్పత్తి చేస్తున్న విషయం తెలినదే. అలాగే ఏదైన జీవద్రవ్య ఘన ఇంధనాన్ని తక్కువ ఆక్సిజన్‌ అందేలా/లేదా ఆక్సిజన్‌ రహిత వాతావరణంలో 450ళీ%జ%వద్ద మండిరచడం వలన జీవ వాయు ఇంధనం ఏర్పడుతుంది. ఘనజీవ ద్రవ్య పదార్థాలను తాపవిచ్ఛేదన / ఉష్ణవిచ్ఛేదన కావించిన హైడ్రోజన్‌, కార్బన్‌ మొనాక్సైడ్‌, మిథేన్‌, ఈథేను, ఇథైలిన్‌ వాయువులు ఏర్పడుతాయి.

ఈ వాయువులను కండెన్సరు/ద్రవీకరణకారి లోద్రవీకరించిన ద్రవ ఇంధనం/బయోడీజిల్‌ ఏర్పడుతుంది. భారత గత యూపీఏ కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి వ్యయం తగ్గించడం, వాతావరణ కాలుష్య నివారణకు, విలువైన విదేశీ మారక ద్రవ్యం మదింపుకోసం జీవ ఇంధనాల ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి నిలిపింది. ఇంధన భద్రతే విదేశాంగ విధానాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తున్న ప్రస్తుత కాలంలో శిలాజ ఇంధనాల నిల్వలు రోజురోజుకూ అడుగంటి పోతున్న కారణంగా కాక, భూ ఉష్ణోగ్రత వ్యాకోచానికి దారి తీస్తున్న, బొగ్గు పులుసు వాయువుల విడుదలను అరికట్టడానికి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేయడం అనివార్యంగా మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం భావించింది. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా జీవ ఇంధనాలు (బయో ఫ్యూయెల్‌) అన్ని విధాలా లాభసాటిగా గుర్తించారు.

శిలాజ ఇంధనం పెట్రోలు స్థానంలో, కర్బనం తక్కువగా ఉండే బయో డీజిల్‌ ప్రత్యామ్నాయ రవాణా ఇంధనంగా అభివృద్ధి చేసే దిశలో, ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో, బయో ఇంధన ఉత్పత్తులపై దృష్టి నిలిపింది. బయో డీజిల్‌ విపణి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావించి, నిర్ధారించి, చమురు ధరలు పెరిగిపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని భారత దేశంలో బయో డీజిల్‌ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించే దిశగా కృషి చేసింది. బయో డీజిల్‌ అనగా కానుగ (శాస్త్రీయ నామం:పెన్నేటి) గింజలు లేదా పెద్ద నేపాళం (జప్రోటా) గింజలనుండి తీసే నూనె. బయోడీజిల్‌ రెండు దశాబ్దాల క్రితమే గుర్తించినా, అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతున్నది. సస్టేనెబుల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ ఆఫ్‌ రూరల్‌ ఏరియాస్‌ (సూత్ర) అనే సంస్థ బెంగళూరులో బయో డీజిల్‌ తయారీ, వినియోగంపై విస్తృత పరిశోధన జరిపింది. తత్ఫలితంగా బెంగుళూరు పరిసర ప్రాంతాలతో ముందుగా ట్రాక్టర్లను బయో డీజిల్‌ తో నడపడం జరిగింది.

యూరోపియన్‌ దేశాలలో ఉత్పత్తి అయిన డీజిల్‌ లో 2శాతం బయో డీజిల్‌ ను మిశ్రమిస్తున్నారు. గత భారత ప్రభుత్వం కూడా మొత్తం రవాణా ఇంధనాలుగా జీవ ఇంధనాలను 20శాతానికి పెంచాలనే లక్ష్య నిర్దేశం చేసింది. బంజరు భూములు అధికంగాగల భారతావనిలో జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి పలు పెద్ద సంస్థలు ప్రయత్నించాయి. కానుగ సాగుకు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అక్కరలేదు. కానుగ చెట్లు నెలకు ఒకటి, రెండు తడులతో మామిడి చెట్లంత పెరుగుతాయి. గృహావరణాల్లో, రోడ్ల కిరువైపులా కానుగ నాటితే ఆహ్లాదకరమైన నీడతోపాటు, వేణ్ణీళ్ళకు చన్నీ ళ్ళ తోడు లాగా ఆదాయం పెరుగుతుంది. ఈ చెట్లు 5 సంవత్సరాలు కాపు ప్రారంభించి, 30 ఏళ్ళ వరకు పంట నిస్తాయి. కానుగ స్వయంగా చీడ పీడల నివారణి అయినందున దానిపై ఎటువంటి చీడ పీడలుండవు. ఈ క్రమంలోనే 2006- 08 మధ్య కాలంలో రాష్ట్రంలో జీల ఇంధన మొక్కల పెంపకాన్ని చేపట్టారు.

లక్ష ఎకరాలలో జీవ ఇంధన మొక్కల పెంపకం లక్ష్యంగా  పెట్టుకుంది. దీనికోసం రైతులు, స్వచ్చంద సంఘాలను, పంచాయతీలను ప్రోత్సహించింది. ఒక్కొక్క రైతుకు 5 ఎకరాల వరకు సాయం చేయాలని నిర్ణయించారు. భారత ప్రభుత్వం కానుగ  6రూపాయల మద్దతు ధరలు నిర్ణయించింది. బయోడీజిల్‌ కొనుగోలు రేటును 25రూపాయలు నిర్ణయించింది. పంట వేసుకోవడానికి 40%  బ్యాంకు ద్వారా, 60% సబ్సిడీ అందించే చర్యలు చేపట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకం, ఇందిర ప్రభ వాటర్‌ షెడ్‌ పథకం ద్వారా చేపట్టు ఎస్సీ, ఎస్టీ అసైన్‌ భూములు 100% రాయితీ కల్పిస్తామని ప్రకటించింది. స్వశక్తి మహిళా సంఘాలచే ప్రభుత్వ బీడు భూములలో చేపట్టుటకు 100% రాయితీ అందిస్తామంది. ప్రతి వంద రైతులకు అనుసంధాన కార్యకర్తలకు నెలకు 1500 చొప్పున ఏర్పాటు చేసే నిర్ణయం గైకొంది.

ప్రతి మండలానికి ప్లాంటేషన్‌ మేనేజర్‌, బయోడీజిల్‌ కొరకు 4వేల రూపాయలు కేటాయించారు. ప్రభుత్వ భూములలో కానుగ మొక్కలను పెంచడం ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ సంఘాలకు, పంచాయితీ లకు, అవెన్యూ ప్లాంటేషన్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.  బ్లాక్‌ అండ్‌ అవెన్యూ ప్లాంటేషన్‌ పై రాష్ట్రంలో కోట్లు ఖర్చు చేశారు. ఇందిర ప్రభ అటకెక్కగా, సబ్సిడీలు మటు మాయమయ్యాయి. ప్రభుత్వం ప్రకటించినట్లు పంటకు మద్దతు ధర చెల్లించడం కానీ కొనుగోలు చేసిన దాఖలాలు లేనేలేవు. కోట్లాది రూపాయల అంచనాలతో ప్రణాళికా బద్దంగా మొక్కల పెంపుదలకు కార్యాచరణ రూపొందించి అట్టహాసంగా పెంపకములను చేపట్టినా, అది ఆచరణ శూన్యమే అయింది.  నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో  పునరుత్పాదక ఇంధన పథకాలకు విశేష కృషి చేస్తున్నది. స్వచ్ఛమైన శిలాజ ఇంధనాలను, పర్యావరణ హితమైన ఇంధనాలను తగిన పరిమాణంలో అందుబాటులో ఉంచుకోవడానికి, అవి అందు బాటు యోగ్యంగా ఉండేలా చూడటానికి ప్రాధాన్యం ఇస్తున్నది. దేశంలో సులభతర వాణిజ్య నిర్వహణకు ఎంతో చేయూత అందిస్తున్నది.

స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు సదుపాయంగా ఉండేలా, అన్ని మంత్రిత్వ శాఖల్లో ప్రాజెక్ట్‌ అభివృద్ధి విభాగాలను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విభాగాలను  ఏర్పాటు చేసింది. ఇంధన పేదరికాన్ని అంతం చేసే దిశగా, స్వచ్ఛమైన శిలాజ ఇంధనాలను, పర్యావరణ హితమైన ఇంధనాలను తగిన పరిమాణంలో అందుబాటులో ఉంచుకోవడానికి మార్గ నిర్దేశం చేస్తున్నది. స్వచ్ఛందంగా శిలాజ ఇంధన  వినియోగం, స్వదేశీ ఇంధనాలపై మరింత ఎక్కవగా ఆధారపడటం, విద్యుత్‌ సేవలను పెంచడం, తాజాగా ఆవిర్భవిస్తున్న హైడ్రోజన్‌ వంటి ఇంధనాలవైపు మరలడం, అన్ని ఇంధన వ్యవస్థల్లో డిజిటల్‌ సృజనాత్మక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం తదితర అంశాలపై ప్రభుత్వ దృష్టి కేంద్రీకృతమై ఉంది.
-రామకిష్టయ్య సంగనభట్ల
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *