రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైదరాబాదులోని కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం గా మార్పు చేసినది. సంఘములో వారు అన్ని రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఈ మహిళా విశ్వవిద్యాలయం తోడ్పడుతుందని అని అనటంలో సందేహం ఉండకూడదు.అంతేకాకుండా తెలంగాణలో ఉన్నత విద్యావకాశాలు అంతగా లేకపోవడం వలన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తున్నది. దీనితో చాలా కుటుంబాలు అభ్యంతరం తెలపడంతో ఆడపిల్లల కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు కోఠి ఉమెన్స్ కాలేజీని విశ్వవిద్యాలయంగా మార్చడంతో తెలంగాణలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ అవతరించింది. దీనితో తెలంగాణలో ఆడబిడ్డలకు ఉన్నతవిద్యలో అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఇది మహిళలకు ఇస్తున్న అత్యంత గౌరవప్రదమైన విషయం.
తెలంగాణ అంటేనే ప్రకృతి. ప్రకృతితో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు సంస్కృతులు. తెలంగాణ ఆడ పిల్లలను ఒక బతుకమ్మగా ప్రేమిస్తారు గౌరవిస్తారు. అందుకే నూతనంగా ఏర్పాటు చేసిన కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి బతుకమ్మ తెలంగాణ విశ్వవిద్యాలయంగా నామకరణం చేయాలని ప్రజలందరూ అనుకుంటున్నారు.ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది. తెలంగాణ ఆడబిడ్డలు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. బతుకమ్మ పేరును మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టడం అంటే మనం గౌరమ్మను పూజించి గౌరవించడమే. ఈ బతుకమ్మ పూల పండుగ సూర్యచంద్రులు భూమండలం ఉన్నంతవరకు కూడా తెలంగాణలో విరజిల్లుతూనే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా కొన్ని కొన్ని నగరాల్లలో పట్టణాలలో బతుకమ్మ ఆడేవారు కాదు. అసలు తెలంగాణ ఏర్పడుటకు బతుకమ్మ పండుగ కూడా ఒక ప్రధాన కారణం.
మన బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయుటకు మరియు ఈ పూల పండుగ ఔన్నత్యాన్ని ఆడే పద్ధతులను ప్రపంచానికి తెలియజేయుటకు కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి బతుకమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేయాలని తద్వారా ఈ పండుగ కీర్తి ప్రతిష్టలను విశ్వ వ్యాప్తంగా ఇనుమడింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రానున్న మార్చి 8, 2023, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కోఠి ఉమెన్స్ విశ్వవిద్యాలయం ను బతుకమ్మ తెలంగాణ విశ్వవిద్యాలయంగా మారుస్తారని ఆశిస్తున్నాను.ఇంతవరకు బతుకమ్మ పేరు మీద తెలంగాణలో ఏ కార్యాలయములకు సంస్థలకు పేరు పెట్టలేదు.
– దండంరాజు రాంచందర్ రావు రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ సింగరేణిభవన్ హైదరాబాద్
9849592958




