ఒక్క క్షణం…
బ్రతుక్కి చావుకి నడుమ
ఆగి ఆలోచించ గలిగితే
నూరేళ్ళ జీవితాన్ని నిలుపుకోగలం
జీవితం మనిషికి మాత్రమే
దొరికిన అపురూప వరం
ఆవేశంలో, అనాలోచితంగా
బాధల గుప్పిట నలిగిపోతూ
అదృష్టంగా దొరికిన
జీవితాన్ని అర్ధాంతరంగా
ముగించాలనుకోవటం అవివేకం
కరువు కోరలకు చిక్కి
పండిన పంటకు పెట్టుబడే రాక
దళారీ దగాకు తల్లడిల్లి
నూరేళ్ళ బ్రతుకును
బలి తీసుకుంటున్న రైతన్నలు
క్షణికావేశంలో అనాలోచితంగా
అల్ప సమస్యలకు ఆయువు వదిలే
అమాయకులు మరచిపోరానిది
సృష్టిలో మానవజన్మ మనకు మాత్రమే
దొరికిన గొప్ప వరమని
చిరు అపజయాలకే కృంగిపోయి
నిన్ను నీవే వంచించుకునిఎందరికో
గుండెకోతను మిగులుస్తున్నావో ?
విజయాలన్నీ అపజయాల పునాదుల
మీదనే రెప రెపలాడతాయి
శోకాన మరుగున దాగి
అనుకోని సుఖమున్నట్టే
ధీరులై సాధించటమే సార్థకత
జీవితం అందరికీ
వడ్డించిన విస్తరికాదు
అవకాశాలను వెతుక్కుంటూ
సాగితేనే చేరువవుతాయి
పోరాడితేనే విజయాన్ని సాధిస్తాం
రాంక్ ల పంటను ఎరవేసి
కోట్లు పండించే కార్పొరేట్ బడుల్లో
పసితనం కనుమరుగై
సృజనాత్మకత కుదేలై
విషవలలో చిక్కిన రేపటి తరానికి
జీవన నైపుణ్యాలను
బ్రతుకు విలువలను నేర్పరు
తాము సాధించని
విజయాల కోసం
అధిరోహించని శిఖరాలకు
పిల్లలను చేర్చాలనే అత్యాశతో
వారిని బలి చేస్తున్న
స్వార్థ అమ్మా నాన్నలు ఎన్నడైనా
ఆ అమాయకపు గుండె వత్తిడిని
పసికట్టి ప్రేమగా అక్కున
చేర్చుకొని ఓదార్చకుంటే
అన్యాయంగా వారిని
చేతులారా మనమే పోగొట్టుకుంటాం
వత్తిడితో దిక్కుతోచని
అభాగ్యులకు స్వాంతనను
స్నేహ హస్తాన్ని అందించి
వారి మనో వ్యధను పంచుకుని
జీవితమంటే ఆశను మళ్లీ
వారిలో చిగురింప చేద్దాం
పిల్లల్ని మన తీరని కోర్కెలకోసం
సమిధలుగా మార్చక సహజంగా
వారిని పువ్వులుగా వికసించనిద్దాం
మనిషిగా మానవత్వపు
పరిమళాలను పులుముదాం
(ఆత్మ హత్యలతో అన్యాయంగా
బలై పోయిన వారిని తలచుకుని)
– డా. కె. దివాకరా చారి, 9391018972




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల