ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ప్రపంచ శాంతి సంరక్షణ దళంలోకి (యూయన్ పీస్ కీపిర్స్) 18 – 29 ఏండ్ల వయసున్న యువ స్వచ్ఛంధ సేవా కార్యకర్తలుగా మిలిటరీ, పోలీసు, పౌరులను ఎంపిక చేసి ప్రపంచ పౌర సమాజ రక్షణ, ప్రమాదకర ప్రదేశాల్లో సహాయం, యుద్ధ క్షతగాత్రులను ఆదుకోవడం, ఆకలి చావుల్ని ఆపడం, విపత్తు చేయూత, అశాంతి నెలకొన్న ప్రాంతాల్లో బలగాలను మోహరించడం లాంటి పలు మానవీయ మిషన్లకు నిర్వహిస్తూ ప్రపంచ శాంతి నెలకొల్పే ప్రయత్నాలను ఐరాస శాంతి పరిరక్షణ దళాలు నిర్వహిస్తున్నాయి.
అంకితభావం, ధైర్యం, సేవాతత్పరత చూపించే ఐరాస శాంతి స్థాపన దళ సభ్యుల నిస్వార్థ విశ్వహిత విధులను ప్రస్తుతించడం, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వీరులకు నివాళులు అర్పించడం, అసమాన ప్రతిభ కనపరిచిన యోధులకు పురస్కారాలు ప్రదానం చేయటానికి ప్రతి ఏటా 29 మే రోజున ‘అంతర్జాతీయ ఐరాస శాంతి స్థాపన దళ దినం (ఇంటర్నేషనల్ డే ఫర్ యూయన్ పీస్ కీపర్స్)’ పాటించుట ఆనవాయితీగా వస్తున్నది.
ప్రపంచ శాంతి స్థాపనలో విశిష్ట సేవలు
ప్రపంచ శాంతి పరిరక్షణ విధుల్లో అవిశ్రాంతంగా పని చేస్తూ నేటి వరకు దాదాపు 4000 మంది అమరత్వం పొందడం జరిగింది. ప్రపంచ మానవాళి ఎదుర్కొన్న కోవిడ్-19 విపత్తు వేళ ఐరాస శాంతి స్థాపక దళం మానవ శ్రేయస్సు కోసం మరింత శ్రమించాల్సి వచ్చిందని మనకు తెలుసు. 29 మే 1948న ఐరాస ఏర్పాటు చేసిన శాంతి పరిరక్షణ దళం తొలిసారి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అరబ్-ఇజ్రాయిల్ యుద్ధ కాల్పుల విరమణ విధులు నిర్వహించుటతో ప్రారంభమైన దళ ప్రస్థానం నేటికి 72 యూయన్ శాంతి స్థాపన మిషన్లలో ఒక మిలియన్ యువతీయువకులు తమ అమూల్య సేవలను అందించి, అనేక మిలియన్ల ప్రపంచ ప్రజలను కాపాడగలిగారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 14 శాంతి పరిరక్షణ ఆపరేషన్లలో 125 దేశాలకు చెందిన 1,00,000 మిలిటరీ, పోలీసు, పౌరులు శాంతి స్థాపన యజ్ఞంలో తమ సేవలను అందిస్తున్నారు.
శాంతి పరిరక్షకులకు వందనాలు
అంతర్జాతీయ ఐరాస శాంతి పరిరక్షణ దళ దినం వేదికగా ఐరాస ప్రధాన కార్యాలయం, న్యూయార్క్ వద్ద శాంతి దళ ప్రేమికుల సేవలను కొనియాడడం, ‘డగ్ హమ్మర్సోల్డ్’, ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ పతకాల ప్రదానం, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వీరులకు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతున్నది. యూయన్ పీస్‌కీపర్లుగా మహిళలను కూడా తీసుకోవాలన్న నిర్ణయం ప్రకారం, పలు దేశాల మహిళలు పోలీస్, పైలెట్, మిలిటరీ పరిశీలకులు లాంటి రంగాల ద్వారా ధీరవనితలుగా సేవలందిస్తున్నారు. ఐరాస శాంతి స్థాపన మిషన్లలో ఇండియా ప్రధాన భూమికను నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు 5,400 మంది దేశ బలగాలు సైప్రస్, కాంగో, లెబనాన్, మిడిల్ ఈస్ట్, సూడాన్, పశ్చిమ సహార, సొమాలియా లాంటి పలు ప్రాంతాల్లో విశిష్ట సేవలను అందించడం జరిగింది.
శాంతి పరిరక్షణలో మనందరం
2002లో జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో తీసుకున్న తీర్మానం ప్రకారం 29 మే 2003 నుంచి అంతర్జాతీయ ఐరాస శాంతి స్థాపన దళ దినం పాటించుట ఆనవాయితీగా మారింది. అంతర్జాతీయ ఐరాస శాంతి స్థాపన దళ దినం-2024 నినాదంగా ‘ఉజ్వల భవిత తగ్గట్లు : కలిసి మెరుగ్గా నిర్మిద్దాం (ఫిట్ ఫర్ ది ఫ్యూచర్ : బిల్డ్ బెట్టర్ టుగెదర్)’ అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది. నేడు ప్రపంచ మానవాళి అనుభవిస్తున్న కరోనా విపత్తు సమయాన ఐరాస శాంతి పరిరక్షణ దళం విభాగపు బాధ్యతలు మరింతగా పెరిగాయి.
విశ్వశాంతి, ప్రజా భద్రతే ఊపిరిగా విధులలో ప్రాణాలను సహితం లెక్కచేయక శ్రమిస్తున్న శాంతి యువ కపోతాల సేవలను ప్రస్తుతిద్దాం. ప్రపంచ శాంతి సర్వవ్యాప్తం కావాలని ఆశిద్దాం.
(నేడు అంతర్జాతీయ ఐరాస శాంతి స్థాపకుల దినం)
-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, 9949700037





