ప్రజా సమస్యలు గాలికొదిలేసిన పాలకులు

‘‘ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఎప్పటికప్పుడు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు చర్చంతా ఇటువైపు మళ్లించి ప్రజల దృష్టిని మరలుస్తున్నారు. అలాగే ఇప్పుడు కొరోనా ఫోర్త్ ‌వేవ్‌ ‌కారణంగా కూడా ప్రజల మనసంతా ప్రాణాలు కాపాడుకోవడమెలా అన్న దానిపై ఉంటోంది. ఇది కూడా ప్రభుత్వాలకు కలసివచ్చే అంశంగా చూడాలి. ఇకపోతే  ప్రభుత్వాలు తమ వైఫల్యా లను కప్పిపుచ్చుకోవడానికి, అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నట్లుగా అబద్దాల ప్రచారంలో ముందుంటున్నాయి.’’

తెలంగాణలో ఎమ్మెల్యేకు ఎర కేసు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బిఆర్‌ఎస్‌ ఈ ‌సమస్యను ఎవరికి వారు ప్రతిష్టగా తీసుకుని ముందుకు సాగుతున్నాయి. దీంతో అసలు సమస్యలు పక్కకు పోతున్నాయి. ప్రభుత్వాలను గుప్పిట్లో పెట్టుకున్న నేతలు ప్రజల సమస్యను పక్కకు పెట్టేందుకు ఇలాంటి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తాయని మరోమారు రుజువు చేశారు. దీంతో ప్రజలను కూడా మానసికంగా ఇటువైపు దృష్టి సారించేలా చేస్తున్నారు. దేశంలో అనేకానేక సమస్యలు ఉన్నా ఇప్పుడు చర్చ అంతా ఈ సమస్యపైనే సాగుతోంది. కోర్టుల్లోకూడా అనేకానేక కేసులు పెండింగ్‌లో ఉన్నా తక్షణ సమస్యగా బెంచ్‌ ‌ముందుకు ఇలాంటివి వచ్చి చేరుతున్నాయి. ఇది వ్యవస్థాగత లోపమా లేక పాలకుల కుట్రనో ఆర్థం కావడం లేదు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. మరోమారు కొరోనా మహమ్మారి దాడి హెచ్చరికలతో ఇక మరింత ఉపద్రవం ఏర్పడ నుందన్న భయాలు మొదలయ్యాయి.

నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే  దాడిచేస్తున్నాయి. ఉత్పత్తిరంగాలకు చేయూత లేకుండా పోయింది. యధారాజా తథా ప్రజా అన్న తీరులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలనుంచి కొత్తగా పన్నులు ఎలా రాబట్టవచ్చే అన్న ఆలోచనలో ఉన్నాయి. పండించిన ధాన్యానికి గిట్టు బాటు ధరలు దక్కడం లేదు. పండించిన ధాన్యం కొనే భరోసా లేదు. కేంద్రరంగ సంస్థలను ఇష్టం వచ్చినట్లు గా అమ్మేసే కార్యక్రమం జోరుగా సాగుతోంది. మూతపడ్డ పరిశ్రమల సంగతి సరేసరి. మోదీ  ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతున్న తీరు తిరోగమన చర్యగానే చూడాలి. అంతేగగాకుండా అసయర్థ విధానంగా కూడా చూడాలి. విశాఖ ఉక్కు లాంటి సంస్థలను తెగనమ్మడం పాడియావు పొదుగును కోయడం తప్ప మరోటి కాదు. కొత్త ఉద్యోగాల నియామకాల మాట దేవుడెరుగు కానీ ఉన్న ఉద్యోగులకు విఆర్‌ఎస్‌ ఇచ్చి ఇంటికి పంపేస్తున్నారు. ఉద్యోగాలను ఊడగొట్టిన పాపంలో పాలకుల ఆలోచన అంతా ఒకే విధంగా ఉంటోంది. కేవలం కార్పోరేట్‌ ‌కంపెనీలను ప్రోత్సహి స్తున్న తీరు కారణంగా చిన్న కంపెనీలు అనేకం మూత పడ్డాయి. వారికి సరైన ప్రోత్సాహం దక్కడం లేదు. బ్యాంకుల కొర్రీల కారణంగా స్వయం ఉపాధి చేపట్టాల నుకున్న వారు సైతం వెనక్కి తగ్గుతున్నారు.

దీనికి తోడు జిఎస్టీ దాడి విపరీతంగా ఉంది.  ప్రభుత్వం అంటే పన్నుల వసూళ్లు తప్ప మరోటి కాదన్న రీతిలో పాలనా వ్యవహారాలు సాగుతున్నాయి. పన్నులతో అభివృద్ది కార్యక్రమాలు పక్కకు పోయాయి. ప్రజలను వోటుబ్యాంక్‌గా చేసుకుని కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను ఇష్టం వచ్చినట్లుగా అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో దేశాన్ని మార్గనిర్దేశం చేయాల్సిన పాలకులు ఎన్నికలు, ఎన్నికలకు అవసరమైన పథకాల పేరుతో ముందుకు సాగుతున్నారు. ఒక ఎన్నిక నుంచి మరోఎన్నిక అన్నతీరులో పాలన సాగుతోంది. కేంద్రం దారిలోనే అన్ని రాష్టాల్ల్రో పాలన ఉంది. ఇన్నాళ్లు ఉద్యోగ అవ కాశాలు ఇచ్చిన అనేక కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేసి మరి కొందరికి ఉపాధి కల్పించాల్సిన కేంద్రం ప్రైవేటు పరం చేస్తూ ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు ఉద్యోగావ కాశాలను దెబ్బతీస్తున్నారు. దేశానికి, యువతకు ’అచ్చే దిన్‌’ అం‌టూ అశ చూపి, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం దేశ నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లింది. వారిని దగా చేసింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన  హాని గంగలో కలిపారు. ఇప్పటిదాకా ఎన్ని కోట్ల కొలువులు ఇచ్చారో చెప్పే దైర్యం మోడీ సర్కార్‌కు లేకుండా పోయింది. ఉద్యోగావకాశాలు కల్పించకుండా పోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడు తున్నాయి. రాష్టాల్రు,కేంద్రం ఇప్పటి వరకు ఎన్ని కొలువులు ఇచ్చిందో లెక్క చెప్పడం లేదు.

దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ఏంచేసిందో చెప్పాలని ఆయా రాష్టాల్ల్రో ఉన్న ప్రాంతీయ పార్టీలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. కానీ తమ రాష్ట్రంలో ఏ మేరకు నిరుద్యోగులను ఆదుకున్నారో చెప్పలేక పోతున్నారు. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు…ఉన్న ఉద్యోగాలనే మోడీ ప్రభుత్వం తొలగి స్తోందన్నది నూటికి నూరుపాళ్లు నిజం. ఉపాధి అవకాశాల్లో బిజెపి వైఫల్యాలను తీవ్రస్థాయిలో నిరుద్యోగులు నిరసిస్తూనే ఉన్నారు. అదే సమయంలో ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఎప్పటికప్పుడు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు చర్చంతా ఇటువైపు మళ్లించి ప్రజల దృష్టిని మరలుస్తున్నారు. అలాగే ఇప్పుడు కొరోనా ఫోర్త్ ‌వేవ్‌ ‌కారణంగా కూడా ప్రజల మనసంతా ప్రాణాలు కాపాడుకోవడమెలా అన్న దానిపై ఉంటోంది.

ఇది కూడా ప్రభుత్వాలకు కలసివచ్చే అంశంగా చూడాలి. ఇకపోతే  ప్రభుత్వాలు తమ వైఫల్యా లను కప్పిపుచ్చుకోవడానికి, అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నట్లుగా అబద్దాల ప్రచారంలో ముందుంటున్నాయి. దీనికి చిత్తశుద్దితో పనిచేయాలన్న సంకల్పం లేకపోవడమే కారణంగా చూడాలి. ధాన్యం ఉత్పత్తిలో స్వాలంబన సాధించినా  దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తొలగించడంలో విఫలం అవుతున్నారు.  ఎందుకంటే దేశంలో నేటికీ అనేక మంది పేదలు ఇంకా ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. చరిత్రలోనే రికార్డు స్థాయికి ధాన్యం ఉత్పత్తిని అన్నదాతలు ఉత్పత్తి చేస్తున్నా.. వారికి మద్దతు ధరలు కూడా దక్కకుండా చేస్తున్నారన్నారని అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంతోపాటు, ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అప్రమత్తంగా లేనంత కాలం ఇలాంటి రాజకీయాలే నడుస్తాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు అనుకూలంగా ఉండేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటారని గమనించాలి.
– ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *